వాతావరణ ప్రతికూల పరిస్థితులు.. కలిసిరాని ఖరీఫ్.. పంటకు అందని సర్కార్ సాయం.. పెట్టుబడికి ఆదుకోని త‘రుణం’.. కరెంటు ‘కట్’కట.. ఎండిన పంటలు.. శక్తులన్నీ ఒడ్డి, ఆస్తులనమ్మి.. కొండంత ఆశతో పంటలు సాగు చేస్తే నెర్రెలు బారిన నేలలు రైతు గుండె పగిలేలా చేశాయి. రైతులు చేసిన అప్పులు.. దిగుబడి రాని పంటలు.. గుదిబండలా మారాయి. దిక్కుతోచని స్థితిలో ఉరి వేసుకుని.. పురుగుల మందులు తాగి నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఫలితంగా ఆయా కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. పంట లేదు.. కుటుంబ యజమానీ లేడు.. ప్రభుత్వ ఆర్థిక సాయం అందలేదు.. ఉన్నదంతా గుండె నిండా బాధే.. కళ్ల నిండా కన్నీళ్లే..
- నిబంధనలతో నిరీక్షణ
- ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఏదీ చేయూత..?
- జాప్యంతో ఆర్థికంగా మరింత కుంగిపోతున్న బాధితులు
- అధికారికంగా గుర్తించింది అత్యల్పం
- గడిచిన ఎనిమిదేళ్లలో 521 మంది ఆత్మహత్య.. గుర్తించింది 116 మందినే..
- త్రీమెన్ కమిటీ జాప్యం
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ప్రభుత్వ నిబంధనలు రైతుల కుటుంబాలకు గుది బండలా మారాయి. పంటలు లేక పరలోకానికి పయనమైన రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు సర్కార్ వెనకడుగు వేస్తోంది. ఏళ్లు గడిస్తే గానీ వారికి ఆసరా అందని పరిస్థితి. కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయి ఆయా కుటుంబసభ్యులు దుఃఖాన్ని దిగమింగుకుని సాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కమిటీల నివేదికలంటూ ఏళ్లు గడిచిపోతున్నాయి. ఒకవేళ పరిహారం మం జూరైనా అది చేతికి రావడానికి మరో ఏడాది గడవాల్సిందే. గడిచిన ఎని మిదేళ్లలో ఇప్పటి వరకు 521 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడితే.. 116మందిని మాత్రమే అర్హులుగా ఎంపిక చేశారు. నివేదిక సిద్ధం చేసి మిగిలిన 270 మందిని మరోసారి చంపేశారు. ఇంకా 135చావులు విచారణలోనే కొనసా..గుతున్నాయి. ఇతర కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ ఆర్థిక సాయం అందించలేదు. తమ వాళ్లు పంట ల దిగుబడి రాకనే ఆత్మహత్య చేసుకున్నారని ఆయా కుటుం బాలు దరఖాస్తులు చేసుకున్నా.. వాటిని తిరస్కరించారు.
ప్రభుత్వం గుర్తించింది..
జిల్లాలో ఖరీఫ్ నుంచి ఇప్పటివరకు 89 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. అయి నా.. ఆ ఆత్మహత్యల్లో వాస్తవం లేదంటూ అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. కేవలం 66 మంది రైతుల ఆత్మహత్యలపై విచారణ చేపట్టిన అధికారులు 17మంది రైతులు వ్యవసాయంలో సంక్షోభంతో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తేల్చారు. ఇప్పటివరకు తొ మ్మిది కుటుంబాలకు పరిహారం అందించారు. మిగతా ఎనిమిది కుటుంబాలకే ప్రభుత్వ సహా యం అందుతుందని కుండబద్దలు కొట్టారు. ఈ ఏడాది 10 మంది వరకు కౌలు రైతులు కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు నిరాసక్తత చూపుతుండడంతో ప్రైవేటు అప్పుల భారం మోయలేకపోతున్నారు. జిల్లాలో 50 వేల మంది కౌలు రైతులుండగా.. ఈ ఏడాది ఒక్క కౌలు రైతుకు గుర్తింపు కార్డు రాలేదు. రుణం ఇవ్వలేదు. ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చినా.. అన్నదాత బతుకులు మారడం లేదు. అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా రైతుల సమస్యలను పూర్తిస్థాయిలో పట్టించుకున్న దాఖలాలు లేవు. ఖరీఫ్ ఆరంభం నుంచి రుణాల మాఫీ, సాగుకు కొత్త రుణాల మంజూరు, గతేడాది దెబ్బతిన్న పంటలకు పరిహారం, పంటలకు మద్దతు ధర కల్పించడంలో విఫలమైంది.
అమలు కాని జీవో
2004 జూన్ ఒకటిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఆత్మహత్యలు నిర్ధారణపై జీవో 421 ప్రవేశపెట్టింది. దీని ప్రకా రం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులను నిర్ధారించేందుకు గాను త్రీమెన్ కమిటీ వేసింది. ఇందులో స్థానిక పోలీ సు, రెవెన్యూ, వ్యవసాయాధికారి సభ్యులుగా ఉంటారు. రైతును గుర్తించి, దర్యాప్తుచేసి, ఆత్మహత్యగా నిర్ధారించి వీరు ప్రభుత్వానికి నివేదిక పంపాల్సి ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం ప్రాథమిక ఆర్థికసాయం కింద రూ.50వేలు మరో దఫా రూ.లక్షను ఎక్స్‌గ్రేషియా కింద మంజూరు చేస్తుంది. దీంతోపాటే కుటుంబంలో చదువుకునే పిల్లలుంటే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకోవాలి. తదుపరి ప్రభుత్వం నుంచి ఉపా ధి కల్పించాలి. మృతుని భార్యను వితంతువుగా గుర్తించి పింఛన్ ఇవ్వాలి. కానీ.. జిల్లాలో ఎక్కడా ఈ జీవో ప్రకారం అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో అర్హులైన రైతు కుటుంబాలకు సహాయం అందకుండా పోతోంది.
నిబంధనలతో కన్నీళ్లు..
జీవో 421లోని నిబంధనలు రైతు కుంటుంబాలకు ఆర్థిక సాయం అందకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా జీవో ప్రకారం రైతు అయి ఉండి పంటల సాగు కోసం విత్తనాలు, ఎరువులకు అప్పులు చేసి ఉండాలి. దీనిపై నిర్దారణ కోసం వేసిన త్రీమెన్ అధికారులు ఇదే విషయాన్ని గుర్తించి నివేదిక ఇవ్వాలి. కానీ.. త్రీమెన్ కమిటీ అధికారులు జాప్యం చేస్తున్నారు. దీంతో ఆర్థిక సహాయం అందడంలో ఆలస్యమవుతోంది. జిల్లాలో బలవర్మణానికి పాల్పడిన రైతులు కేవలం ఇవే కారణాలతోనే కాదు.. ఒక ఏడాది అతివృష్టి, మరో ఏడాది అనావృష్టితో, వడగడ్ల వానలతో పంటలు తీవ్రంగా నష్టపోవడం.. పంటలు సరిగా పండక, పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఇంటి అవసరాలకు అప్పులు చేస్తున్నారు. కానీ.. జీవో ప్రకారం దర్యాప్తుతో రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక సాయం అందడం లేదు.
రికార్డులకెక్కని రైతుల చావులు
Published Fri, May 15 2015 1:16 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement