హైకోర్టు విభజనకు తీర్మానం
- అసెంబ్లీ ఉభయసభలు ఏకగ్రీవంగా ఆమోదం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఉమ్మడిగా ఉన్న హైకోర్టును వీలైనంత త్వరగా విభజించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీ తీర్మానించింది. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని భావించిన రాష్ర్ట ప్రభుత్వం.. చట్టసభల్లో తీర్మానం చేసి కేంద్ర న్యాయ శాఖకు పంపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసనసభలో సీఎం కేసీఆర్, మండలిలో న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం విడివిడిగా తీర్మానాలను ప్రవేశపెట్టారు. దీనికి అన్ని పక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. వీలైనంత తొందరలో హైకోర్టు విభజన జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఈ సందర్భంగా సీఎం శాసనసభలో పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు న్యాయ శాఖ కార్యదర్శిని ఢిల్లీకి పంపిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర విభజన జరిగి ఇన్ని నెలలవుతున్నా హైకోర్టు ఉమ్మడిగా ఉండడం వల్ల విభజన పరిపూర్ణంగా లేదని అన్నారు. దీనిపై తాను అవకాశం దొరికినప్పుడల్లా కేంద్రంతో మాట్లాడుతున్నానని, విభజనకు సంబంధించిన ప్రతిపాదన పంపితే చర్యలు తీసుకుంటామని కేంద్రం తాజాగా సమాచారమిచ్చిందని పేర్కొన్నారు.
ఉభయసభల్లో చేసిన తీర్మాన ప్రతులను న్యాయ శాఖ కార్యదర్శికి ఇచ్చి ఢిల్లీకి పంపుతామని, వాటిని కేంద్ర న్యాయ శాఖ మంత్రికి అందించి తదుపరి చర్యలు తీసుకుంటామని సభ కు వెల్లడించారు. కాగా, ఈ తీర్మానం ఆహ్వానించదగినదని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు విభజన జరిగేంత వరకు కోర్టులకు సంబంధించిన పోస్టుల భర్తీని నిలిపివేయాలని బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. జానారెడ్డి, కిషన్‌రెడ్డి సూచనలను విడిగా లేఖల రూపంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని సీఎం సమాధానమిచ్చారు. వెంటనే హైకోర్టు విభజన జరగాల్సి ఉందని, ఉభయసభల తీర్మానంతో అందుకు మార్గం సుగమమవుతుందని సీపీఐ, సీపీఎం, మజ్లిస్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.
నేడు ఢిల్లీకి రాష్ట్ర బృందం
కొత్త హైకోర్టుకు భవనాన్ని కేటాయించేందుకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రానికి తెలిపేందుకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం గురువారం ఢిల్లీకి వెళ్లనుంది. అక్కడ కేంద్ర న్యాయ మంత్రిని కలిసి హైకోర్టు విభజనను వేగవంతం చేయాలని కోరనుంది. ఈ బృందంలో న్యాయవాద జేఏసీ కన్వీనర్ రాజేందర్‌రెడ్డి, హైకోర్టు సాధన సమితి అధ్యక్షుడు సహోదర్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండారెడ్డి, జేఏసీ నేతలు ఉన్నారు. మరోవైపు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తాతో సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. హైకోర్టు విభజనపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం.