ఆ బాధ్యత మీదే
- ఔటర్ లోపల నీటి సరఫరా చేయండి
- సీఎం కేసీఆర్ ఆదేశం
- జలమండలి పరిధి పెంపు
- సుమారు రూ.13 వేల కోట్లతో ప్రతిపాదనలు
సాక్షి, సిటీబ్యూరో: జలమండలి పరిధి మరింత పెరగనుంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రధాన నగరంతో పాటు, శివార్లలో 60 శాతం ప్రాంతాల్లోని 8.60 లక్షల నల్లాలకు నిత్యం340 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్న విషయం విదితమే. తాజాగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల (సుమారు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధి) ఉన్న అన్ని శివారు మున్సిపల్ సర్కిళ్లు, నగర, గ్రామ పంచాయతీలు, కాలనీలు, బస్తీలకు నిత్యం సుమారు 600 మిలియన్ గ్యాలన్ల మంచినీటిని సరఫరా చేసే బాధ్యత జలమండలి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
గ్రేటర్ వాటర్‌గ్రిడ్ పథకానికిరూపకల్పన చేస్తున్న నేపథ్యంలో ఔటర్ లోపల మంచినీటి సరఫరా బాధ్యతను జలమండలికే అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఇటీవల ఆదేశించినట్లు సమాచారం. ఆ మేరకు సుమారు రూ.13 వేల కోట్ల అంచనా వ్యయంతో జలమండలి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఔటర్‌కు ఆవల, హెచ్‌ఎండీఏ పరిధిలో నీటి సరఫరా బాధ్యతను గ్రామీణ నీటి సరఫరా విభాగం తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం.
వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో...
జీహెచ్‌ఎంసీ ప్రస్తుత విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రోత్ కారిడార్, పాత హుడా పరిధి కలిపితే మరో 375 చదరపు కిలోమీటర్లు ఉంది. అంటే మొత్తంగా వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు కృష్ణా, గోదావరి, మంజీర, సింగూరు జలాశయాల నీటిని రోజు విడిచి రోజు సరఫరాకు అవసరమైన స్టోరేజి రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటుకు జలమండలి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
ఇందుకు రూ.13 వేల కోట్లు అవుతుందని అంచనాలు సిద్ధం చేసింది. మరో వారం రోజుల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి, సీఎంకు నివేదిస్తామని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. తాజా ప్రతిపాదనలతో ఐటీఐఆర్ ప్రాజెక్టుతో పాటు గ్రేటర్ శివారుల్లో దాహార్తి తీరే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
జలమండలి స్వరూపం ఇదే..
ప్రస్తుత జలమండలి పరిధి: 625 చదరపు కిలోమీటర్లు
తాజాగా పెరిగిన పరిధి కలిపితే: ఔటర్ రింగ్‌రోడ్డు లోపల మొత్తం పరిధి వెయ్యి చదరపు కిలోమీటర్లు
ప్రస్తుతం నల్లాలు:8.60 లక్షలు
ప్రస్తుత నీటి పరిమాణం: 340 మిలియన్ గ్యాలన్లు
పరిధి పెరగనున్న నేపథ్యంలో సరఫరా చేసే నీటి పరిమాణం: సుమారు 600 మిలియన్ గ్యాలన్లు
పెరగనున్న నల్లా కనెక్షన్ల సంఖ్య: అదనంగా మరో 8 లక్షలు