భూవినియోగ మార్పిడికి మోక్షం!
- ఎట్టకేలకు అనుమతుల జారీ ప్రక్రియను పునఃప్రారంభించిన ప్రభుత్వం
- హెచ్‌ఎండీఏలో అక్రమాలు జరిగాయని గతంలో అనుమతుల నిలిపివేత
- అప్పట్లో 54 దరఖాస్తులకు అనుమతి.. ఆ వెంటనే వాటి అమలు నిలుపుదల
- పెండింగ్ ప్రతిపాదనల్లో కొన్నింటికి మంత్రి కేటీఆర్ ఆమోద ముద్ర
- ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు...
సాక్షి, హైదరాబాద్: భూవినియోగ మార్పిడి(చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్) అనుమతుల జారీ ప్రక్రియను ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభించింది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న భూవినియోగ మార్పిడి ప్రతిపాదనల్లో కొన్నింటికి పురపాలక మంత్రి కె.తారకరామారావు బుధవారం ఆమోదముద్ర వేశారు. ఒకట్రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. హెచ్‌ఎండీఏలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో ఏడాది కింద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా రంగంలో దిగి కొరడా ఝుళిపించారు. అప్ప ట్లో హెచ్‌ఎండీఏ తీసుకున్న నిర్ణయాల అమలు నిలుపుదలకు ఆదేశించారు. దీంతో అప్పటికే జారీ చేసిన 54కు పైగా భూ వినియోగ మార్పిడి ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ గతేడాది ఏప్రిల్‌లో పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాలపై పునఃసమీక్ష జరుపుతామని అప్పట్లో ప్రకటించినా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. దీంతో అప్పటి నుంచి రాష్ట్రంలో భూవినియోగ మార్పిడి ప్రక్రియను ప్రభుత్వం స్తంభింపజేసింది.
పేరుకుపోయిన దరఖాస్తులు..
కొత్త పరిశ్రమలను నెలకొల్పేందుకు టీఎస్‌ఐపాస్ కింద దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే భూవినియోగ మార్పిడి అనుమతులనిస్తూ మిగిలిన దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టింది. దీంతో హైదరాబాద్ చుట్టూ కొత్త లేఅవుట్లు, వాణిజ్య సముదాయాలు, ఇతరత్రా అవసరాలకు భూవినియోగ మార్పిడి కోరుతూ రియల్టర్లు, వ్యాపారవేత్తలు పెట్టుకున్న వందల దరఖాస్తులు పేరుకుపోయాయి. నగరాలు, పట్టణాలు, పట్టణాభివృద్ధి సంస్థల మాస్టర్ ప్లాన్‌లో నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ/కన్జర్వేషన్/గ్రీన్ బెల్ట్, రిక్రియేషనల్ జోన్లలోని భూములను సంబంధిత కేటగిరీ కాకుండా ఇతరత్రా అవసరాలకు వినియోగించుకోవడానికి ప్రభుత్వం నుంచి భూ వినియోగ మార్పిడి అనుమతి తప్పనిసరి. ఇది లేకుండా నిర్మాణాలు చేపడితే అక్రమ నిర్మాణాలుగా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. మాస్టర్ ప్లాన్‌లు లోపాల పుట్టగా తయారు కావడంతో భూవినియోగ మార్పిడి దరఖాస్తులు భారీ సంఖ్యలో వచ్చాయి. పెద్ద సంఖ్యలో రియల్టర్లు అనుమతుల కోసం సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో భూవినియోగ మార్పిడి అనుమతుల జారీపై నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఊరట
హెచ్‌ఎండీఏ, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా), యాదాద్రి, వేములవాడ, బాసర టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీలతో పాటు రాష్ట్రంలోని ఇతర అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల పరిధిలో భూవినియోగ మార్పిడికి చెల్లించాల్సిన యూజర్ చార్జీలను భారీగా పెంచుతూ గత నెల 31న పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి కేటీఆర్ పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి ఆమోదిస్తుండడంతో అనుమతుల కోసం ఇప్పటికే కోట్లాది రూపాయల యూజర్ చార్జీలు చెల్లించి ఎదురుచూస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఊరట లభించినట్లు అయింది. గతేడాది జారీ చేసిన జీవోల అమలు నిలుపుదలను సైతం ప్రభుత్వం త్వరలో ఉపసంహరించుకోనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇంత కాలం అనుమతుల జారీ ప్రక్రియను నిలిపివేయడంతో రాష్ట్రంలో కొత్త లే అవుట్ల ఏర్పాటు ఆగిపోవడంతో పాటు నిర్మాణ రంగంపైనా ప్రభావం చూపిందని రియల్టర్లు అభిప్రాయపడుతున్నారు.