ముంచెత్తిన వాన
వరంగల్ : వరుస వర్షాలు జిల్లాను ముంచెత్తుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏజెన్సీ ఏరియాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాతోపాటు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నీటిమట్టం రాత్రి వరకు 10.20 మీటర్లకు చేరుకోవడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ఏటూరునాగారం మండలంలోని ఐలాపురం, ముళ్లకట్ట, రాంపూర్, కోయగూడెం, ఎల్లాపూరం, రాంనగర్, ఘనపురం, చెల్పాక, వీరాపురం, బనాజీబంధం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ధర్మారావుపేట-కొండాపూర్‌మధ్య మోరంచవాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పరకాల శివారు చలివాగు పొంగిపొర్లుతోంది. భారీ వర్షాలతో ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో 60 ఎకరాల మేరకు పంటలు నీటమునిగాయి.
ఏజెన్సీలో పొంగుతున్న వాగులు
ఆదివారం జిల్లాలో 32.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. తాడ్వాయిలో అత్యధికంగా 124 మి.మీల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. భూపాలపల్లి, ములుగు ఘనపూర్, ములుగు, ఏటూరునాగారం, మంగపేట, పరకాల, రేగొండ, మొగుళ్లపల్లి, నల్లబెల్లి, ఖానాపూర్ మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. మోరంచవాగు, చలివాగు, బొగ్గులవాగు, దయ్యాలవాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇక జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, హన్మకొండ, వరంగల్, వర్ధన్నపేట ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిశాయి.
నిండుతున్న చెరువులు
ఈ సీజన్‌లో తాజాగా కురుస్తున్న వర్షాలతో కుంటలు, చెరువులు, మధ్యతరహా నీటి వనరులు నీటితో నిండిపోతున్నాయి. మొన్నటివరకు నీటి చుక్కలేక ఎండిపోయి వెలవెలబోయిన చెరువులు ఇప్పుడు నీటితో నిండుకుండలా మారాయి. వారం రోజుల క్రితం కురిసిన వర్షాలతో చెరువుల్లోకి సగానికి కంటే ఎక్కువ నీరు చేరింది. తాజా వర్షాలతో చెరువులు పూర్తిస్థారుులో కళకళలాడుతున్నారుు. చిన్న చెరువులు, కుంటలు మత్తడి పోస్తున్నాయి.
పాఖాల, లక్నవరం, రామప్ప, గణపసముద్రం చెరువుల్లోకి భారీగా నీరు చేరింది. ఇదే సమయంలో బలహీనంగా ఉన్న చెరువులు, కుంటలకు గండ్లు పడుతున్నాయి. చెరువు కట్టల నిర్మాణ బలహీనతలు బహిర్గతమవుతున్నాయి. కాగా, రామన్నగూడెం పీహెచ్‌సీలో అందుతున్న వైద్యసేవలపై ఆరోగ్య శాఖ డెరైక్టర్ సాంబశివరావు సమీక్షించారు. ఏటూరునాగారంలోని రొయ్యూర్ ఊర చెరువు ఉధృతిని ఐటీడీఏ పీఓ పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు.