ఖాళీగా ఉన్న ఇంట్లో అస్థిపంజరం లభ్యం
బోడుప్పల్: ఖాళీగా ఉన్న ఇంట్లో అస్థిపంజరం దొరికింది. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఇన్‌స్పెక్టర్ ఎల్లంకి రవికిరణ్‌రెడ్డి కథనం ప్రకారం... బోడుప్పల్‌కు చెందిన సోమశేఖర్ స్థానిక హేమానగర్ వీధి నం.7లోని ప్లాట్ నం. 208లో ఆరు నెలల క్రితం ఇంటిని నిర్మించారు. నెల రోజుల పాటు గోదాంకు అద్దెకిచ్చాడు.
ఆ తర్వాత నుంచి ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. సోమశేఖర్ కూడా నాలుగు నెలలుగా ఆ ఇంటి వైపు వెళ్లలేదు. సోమవారం ఆయన తన ఇంటికి వెళ్లి చూడగా... ఇంట్లో మహిళ (30) అస్థిపంజరం కనిపించింది. భయాందోళనకు గురైన ఆయన వెంటనే మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మూడు నెలల క్రితమే ఆమె చనిపోయి ఉంటుందని, ఒంటిపై పూల రంగు చీర, గాజులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అస్థిపంజరాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అస్తిపంజరం లలితదా?
బోడుప్పల్ దేవేందర్‌నగర్ కాలనీకి చెందిన సామ్యూల్ భార్య లలిత మూడు నెలల క్రితం అదృశ్యమైంది. భర్త సామ్యూల్, కుమార్తె దీప ఈ విషయంపై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, హేమానగర్‌లో లభించిన అస్థిపంజరాన్ని పోలీసులు సామ్యూల్, దీపకు చూపించగా.. మృతురాలి జుత్తు, చీర, గాజులను బట్టి అది తప్పిపోయిన లలితగా అనుమానంగా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అస్థిపంజరానికి, దీపకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహిస్తే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు.
అనుమానాలకు తావిస్తున్న గొయ్యి...
సోమశేఖర్ ఇంటికి పక్కనే ఖాళీ స్థలంలో ఓ గొయ్యి కనిపించింది. నిన్న మధ్యాహ్నామే ఈ గొయ్యిని ఎవ్వరో తవ్వారని, అస్తిపంజరాన్ని అందులో వేసి కప్పెట్టేందుకే దీనిని తవ్వి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.