ఇల్లు, తిండి కోసం నెలకు రూ.40 వేలు
వైద్యం, కాస్మోటిక్స్ కోసం ప్రతి నెలా రూ.4–5 లక్షలు కావాలి
ఇంత మొత్తం ఇచ్చేలా భర్తను ఆదేశించాలంటూ ఓ మహిళ పిటిషన్
ఇంత భారీ మొత్తం కోరడంపై కర్ణాటక హైకోర్టు అసహనం
సాక్షి, అమరావతి: భర్తతో విబేధాలున్న ఓ మహిళ తన నెల ఖర్చులకు గాను అడిగిన మొత్తం సర్వత్రా సంచలనంగా మారింది. వేలల్లో కాదు.. ఏకంగా లక్షల్లో ఖర్చుల కింద ఆ మహిళ అడిగిన మొత్తానికి హైకోర్టే విస్మయం వ్యక్తం చేసింది. నెల ఖర్చులు రూ.6.16 లక్షలా? అంటూ కర్ణాటక హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఓ ఒంటరి మహిళ నెలకు ఇంత మొత్తం ఖర్చు చేస్తారా? అని ప్రశ్నించింది. ‘ఈ స్థాయిలో ఆమె ఖర్చు చేయాలనుకుంటే భర్త సంపాదన మీద కాదు. ఆమెనే సంపాదించుకోమనండి. అప్పుడు తెలుస్తుంది కష్టం ఏంటో. ఈ మహిళకు కుటుంబ బాధ్యతలు లేవు. అంత మొత్తం ఖర్చుల కిందే కావాలంటోంది. సింపుల్‌గా రూ.6.16 లక్షలు అడిగేసింది.
భార్య ఎంత అడిగితే అంత భర్త నుంచి భరణం కింద ఇప్పించడం చట్టం ఉద్దేశం కాదు. చట్టాన్ని ఇలా దుర్వినియోగం చేయకుండా గట్టిగా సందేశం పంపాలని ఈ కోర్టు నిర్ణయించింది. భార్యతో విభేదాలు భర్తకు ఈ విధమైన పనిష్మెంట్‌గా మారకూడదు’ అని అసహనం వ్యక్తం చేసింది. అసలు ఇంతకీ అంత ఖర్చులు ఏమున్నాయని ఆ మహిళ తరఫు న్యాయవాదిని ప్రశ్నించగా, ఆయన చెప్పిన వివరాలు హైకోర్టును షాక్‌కు గురి చేశాయి. భర్త విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని, అందువల్ల తన క్లయింట్ అయిన మహిళ కూడా అదే స్థాయిలో జీవితాన్ని ఆస్వాదించదలచుకున్నారని ఆ న్యాయవాది చెప్పారు.
‘ఇల్లు, తిండి ఖర్చుకు రూ.40 వేలు.. వాచీలు, దండలు, గాజులు, చెప్పులు ఇలాంటి కనీస అవసరాలకు రూ.50 వేలు కావాలి. వైద్యం, కాస్మోటివ్ వంటి వాటి కోసం రూ.4 – 5 లక్షలు అవుతుంది. ఇవి కాక పిల్లల ఫీజులు అవీ ఉన్నాయి. అంతేకాక బంగారం రుణం తీర్చాలి. ఇలా అన్నింటికీ కలిపి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది’ అని ఆ న్యాయవాది చిట్టా విప్పారు. వాస్తవ అవసరాలు ఏమిటో చెప్పకుండా ఇలా విలాసాల కోసం భారీ మొత్తంలో ఖర్చులు అడిగితే కోర్టులు ఇచ్చేస్తాయనుకుంటున్నారా? అంటూ హైకోర్టు ప్రశ్నించింది. భర్త సంపదన రూ.10 కోట్లు ఉందని, అందువల్ల తనకు రూ.5 కోట్లు కావాలని ఎవరైనా అడిగితే కోర్టులు ఇచ్చేస్తాయా? అని నిలదీసింది.
అసలు వాస్తవ ఖర్చులు ఏమిటో చెప్పాలంటూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. భర్తతో విబేధాలున్న ఓ మహిళ తన భర్త నుంచి నెలకు రూ.6,16,300 ఖర్చుల కింద ఇప్పించేలా ఆదేశించాలంటూ కుటుంబ కోర్టును ఆశ్రయించారు. అయితే వాస్తవ ఖర్చుల వివరాలు ఆమె సమర్పించక పోవడంతో ఆమె పిటిషన్‌ను కింది కోర్టు కొట్టేసింది. దీనిపై ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించగా, ఆమె పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment