
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ఒక పురుషుడు, మహిళ ఇష్టపడి కలిసి ఉండి.. ఆ తర్వాత మహిళ అత్యాచారం ఆరోపణలు చేస్తే చెల్లదని కర్ణాటక హైకోర్టు ఓ తీర్పులో స్పష్టం చేసింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన దావణగెరెకు చెందిన మహిళ, బెంగళూరుకు చెందిన ఒక పురుషుడు ఆరేళ్లుగా సన్నిహితంగా ఉన్నారు. పురుషుడు వివాహానికి నిరాకరించడంతో తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపిస్తూ మహిళ 2021లో బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనిని సవాల్ చేస్తూ అతడు హైకోర్టును ఆశ్రయించాడు. 2013లో ఫేస్‌బుక్ ద్వారా తమకు పరిచయం కలిగిందని, ఇద్దరి ఆమోదంతోనే సంబంధం కొనసాగిందని పేర్కొన్నాడు. ఇరువర్గాల వాదనలను ఆలకించిన జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం.. మహిళ ఆరోపణలను తోసిపుచ్చింది. ఆరేళ్లు సుదీర్ఘ సంబంధం ఉండడం వల్ల ఆమె చేసే అత్యాచారం అభియోగాలు చెల్లవని అభిప్రాయపడింది.