♦ నలుగురు ఉపాధ్యాయులకు ఒక్కరూ రాని వైనం
♦ అధ్వానంగా మారిన సయ్యద్‌పల్లి పాఠశాల నిర్వహణ
పరిగి : ఓ పక్క పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తుండగా.. ఉన్న ఉపాధ్యాయులు సైతం నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నారు. దీంతో మండలంలోని సయ్యద్‌పల్లి పాఠశాలలో శుక్రవారం విద్యార్థులే ఉపాధ్యాయుల అవతారమెత్తారు. వివరాలు.. సయ్యద్‌పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 120 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో ఒకరు ఇటీవల బదిలీపై వచ్చి అక్కడ టీచర్ల కొరత ఉండటంతో తిరిగి అదే స్థానానికి డిప్యుటేషన్‌పై వెళ్లారు. మరో టీచర్ తన భార్య డెలివరీ అయ్యిందని 15 రోజుల లీవ్‌పై వెళ్లారు. మరొకరు స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి వెళ్లగా.. రావాల్సిన ఒక్క టీచర్ కూడా సమయానికి రాలేదు.
ఉదయం 11 గంటలు అవుతున్నా ఆయన రాకపోవటంతో పెద్ద తరగతుల విద్యార్థులే చిన్న తరగతులకు బోధించాల్సి వచ్చింది. ఈ విషయంలో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాకమిటీ చైర్మన్ అక్కడికి వచ్చి గురువారం కూడా ఇదే పరిస్థితి ఉందని ఉపాధ్యాయులు రాకపోవడంతో విద్యార్థులే బోధిస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల తీరు వల్లే పాఠశాలలో రోజురోజుకు విద్యార్థు ల సంఖ్య తగ్గిపోతోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
11 గంటల తర్వాత వచ్చిన ఓ ఉపాధ్యాయుడు మార్గంమధ్యలో కలిసి విద్యార్థుల చేత ర్యాలీ తీయించటానికి రాపోల్ పాఠశాలలో ఫ్లకార్డులు తీసుకు వచ్చేందుకు వెళ్లానని అందుకే ఆలస్యం అయ్యిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. నలుగురు ఉపాధ్యాయులున్న ఈ పాఠశాలే ఇలా ఉంటే సింగిల్ టీచర్లున్న పాఠశాలల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయమై డిప్యూటీ డీఈఓ హరిశ్చందర్‌ను వివరణ కోరగా.. ఎంఈఓను పంపించి విచారణ చేయిస్తామన్నారు.
ఈ పాఠశాలలో విద్యార్థులే టీచర్లు!
Published Sat, Aug 22 2015 12:11 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement