మద్యం కొత్త పాలసీకి తాత్కాలిక బ్రేక్!
* 3 నెలల పాటు పాత విధానమే
* అక్టోబర్ 1 నుంచి కొత్త విధానం
సాక్షి, హైదరాబాద్: జూలై 1 నుంచి అమలు కావాల్సిన నూతన ఎక్సైజ్ విధానానికి బ్రేక్ పడింది. గుడుంబాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకొని, ప్రజల ఆరోగ్యానికి హాని కలగని రీతిలో మద్యం విధానం రూపొందించాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ మరో మూడు నెలల పాటు వాయిదా వేసింది. దీంతో కొత్త మద్యం విధానాన్ని అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. దీనికి సీఎం కూడా ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో జూన్ 30తో ముగియనున్న ప్రస్తుత మద్యం దుకాణాల లెసైన్స్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించాలని నిర్ణయించారు.
గుడుంబాకు ప్రత్యామ్నాయంపై కసరత్తు
గుడుంబాను రాష్ట్రం నుంచి తరిమేయాలనేది సీఎం సంకల్పం. గుడుంబాకు బానిసలైన పేద, మద్యతరగతి వర్గాలు, కార్మికుల ఆరోగ్యానికి హాని కలిగించని రీతిలో అధికారికంగా ప్రభుత్వం ద్వారానే తక్కువ ధరకు మద్యం అందించే అవకాశాలను పరిశీలించాలని సీఎం గతంలోనే అధికారులను ఆదేశించారు. దీంతో ఎక్సైజ్ అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి మూడు నివేదికలు తయారు చేశారు. అందులో మొదటిది మహారాష్ట్ర తరహాలో ‘దేశీదారు’ తక్కువ ధర మద్యాన్ని దుకాణాల ద్వారా విక్రయించడం. రెండోది సారాయిని మళ్లీ ప్రవేశపెట్టి, వేలం ద్వారా 20 ఏళ్ల క్రితం నాటి విధానానికి అంకురార్పణ చేయడం.
మూడోది ఇప్పుడున్న విధానాన్ని కొనసాగిస్తూ, గుడుంబా తయారీని అరికట్టి, పీడీ చట్టాలను ప్రయోగించడం. ఈ మూడు విధానాల వల్ల ప్రజలకు ఉపయోగం, రెవెన్యూ లాభనష్టాలపై కూడా నివేదికలు రూపొందించారు. ఈ మూడు విధానాల్లోనూ లోపాలు ఉండడంతో సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే ముందుగా గుడుంబా, అక్రమ మద్యాన్ని తరిమికొట్టి కొత్త విధానంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
గుడుంబాపై సమరం షురూ!
సీఎంతో సమావేశం తరువాత ఎక్సైజ్ అధికారులు మంత్రి పద్మారావుతో భేటీ అయి గుడుంబాను అరికట్టేందుకు తీసుకోవాల్కిన చర్యలపై చర్చించారు. ఎక్సైజ్, పోలీసు శాఖలకు సమాచారం లేకుండా గుడుంబా అమ్మకాలు సాగడం లేదని నిర్ధారణకు వచ్చిన ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి నుంచే గుడుంబా తయారీని అరికట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి ఆదేశాలు ఇవ్వడంతో ఎక్సైజ్ క మిషనర్ ఆర్.వి. చంద్రవదన్ గురువారం అన్ని జిల్లాల ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు, సూపరింటెండెంట్లతో సమావేశమయ్యారు. పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారంతో గుడుంబా, కల్తీమద్యంపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు.