సహాయం కోసం హెల్ప్‌లైన్ ప్రారంభం
ఎస్పీ రమా రాజేశ్వరి
స్త్రీలు, బాలికలపై హింస తగ్గాలంటే సమాజం వారికి అండగా నిలవాలని.. అన్ని వర్గాల ప్రజలు, సంస్థలు మద్దతుగా నిలబడినప్పుడే వారు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారని ఎస్పీ రమా రాజేశ్వరి అన్నారు. అంతర్జాతీయ బాలికలు, స్త్రీలపై జరుగుతున్న హింస తొలగింపు దినోత్సవంలో భాగంగా శనివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో తాండూరులో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.
- తాండూరు
తాండూరు: స్త్రీలు, బాలికలపై హింస తగ్గాలంటే సమాజం వారికి అండగా నిలబడాలి. అన్ని వర్గాల ప్రజలు, సంస్థలు మద్దతుగా నిలబడినప్పుడే వారు తమకు ఎదురవుతున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారని ఎస్పీ రమా రాజేశ్వరి పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ బాలికలు, స్త్రీలపై జరుగుతున్న హింస తొలగింపు దినోత్సవంలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణంలోని మల్‌రెడ్డిపల్లిలో విద్యావేత్తలు, పాఠశాలలు, కళాశాలల అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలతో ఎస్పీ వర్క్‌షాప్ నిర్వహించారు.
అనంతరం స్థానిక సెయింట్ మార్క్స్ హైస్కూల్ లో విద్యార్థులతో, విలియం మూన్ పాఠశాల మైదానంలో ఆటో డ్రైవర్లతో ఎస్పీ సమావేశమయ్యారు. తర్వాత ఇందిరాచౌక్ నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు విద్యార్థినులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. బాలికలు, మహిళలపై జరుగుతున్న హింస, నేరాలకు వ్యతిరేకంగా, వాటిని నిరోధించేందుకు ప్రపంచవ్యాప్తంగా ‘ఆరేంజ్’ పేరుతో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. జిల్లాలో కూడా డిసెంబర్ 16 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వరకు అవగాహన కార్యక్రమాలను పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. సమాజం నుంచి సరైన మద్దతు లేకపోవడంతో మహిళలు తమ ఇబ్బందులను బయటకు చెప్పుకోవడం లేదని అభిప్రాయపడ్డారు.
మహిళలు, బాలికల రక్షణకు సమాజంతోపాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంధ సంస్థలు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందన్నారు. మేమున్నామనే భరోసా కల్పించినప్పుడే వారిపై హింస,వేధింపులు, నేరాలు తగ్గుతాయన్నారు. ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేయలేని మహిళల కోసం కొత్తగా తాండూరు డివిజన్‌లో 7893100200 హెల్ప్‌లైన్ నంబర్‌ను ఎస్పీ రమారాజేశ్వరి ప్రారంభించారు. మహిళల నుంచి వచ్చిన సమాచారాన్ని సేకరించి, వారికి కావాల్సిన సహాయాన్ని ఆయా పోలీసుస్టేషన్ల అధికారులు, షీ టీమ్‌ల ద్వారా అందిస్తామన్నారు. సమస్య తీవ్రంగా ఉంటే అధికారులు వారికి ప్రత్యేకంగా కౌనెల్సింగ్ నిర్వహిస్తారని తెలిపారు.
ఈవ్‌టీజింగ్, గృహహింస, భయభ్రాంతులకు గురైనా, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చినా పోలీసులను సంప్రదిస్తే అన్ని విధాల సహాయం అందిస్తామని వివరించారు. బాలికలపై హింసను అరికట్టడానికి కళాశాలలు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు, యజమాన్యాలు ప్రిన్సిపాళ్లలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ హెల్ప్‌లైన్ కార్డులు, ఫోన్ నంబర్ తో పాటు మణికట్టు బ్యాండ్‌లు, పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్ సునీత, సీపీఐ పట్టణ కార్యదర్శి విజయలక్ష్మీ పండిత్, పట్టణ ఇన్‌చార్జి డీఎస్పీ స్వామి, సీఐ సైదిరెడ్డి, చైతన్య కళాశాల కరస్పాండెంట్ రమేష్‌కుమార్, పలువురు విద్యావేత్తలు తదితరులు ఉన్నారు.
సమాజం స్త్రీలకు అండగా నిలవాలి
Published Sun, Nov 29 2015 12:01 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement