చైన్ స్నాచర్‌ను సమర్ధవంతంగా ప్రతిఘటించిన మహిళ అతన్ని గాయపచగలిగింది. కానీ.. పోలీసులకు పట్టించడంలో విఫలమైంది. కరీంనగర్ జిల్లా బోయిన్‌పల్లి మండల కేంద్రానికి చెందిన లక్ష్మీ(45) అనే మహిళ ఆదివారం పత్తి చేను దగ్గరకు వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని దుండుగుడు ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లడానికి ప్రయత్నించాడు.
దీంతో ఆమె అతని చేతిని బలంగా పట్టుకొని ఒక్కతోపు తోసింది. దీంతో అగంతకుడు చెట్లలో పడిపోయాడు. అనంతరం అతన్ని పట్టుకొని రెండు తగిలించి.. చుట్టు ఉన్న వారిని అప్రమత్తం చేసింది. అంతలో తేరుకున్న దుండగుడు ఆమెనుంచి విడిపించుకొని పక్కనే పార్క్ చేసి ఉన్న బైక్ ఎక్కి పరారయ్యాడు. ఇంతలో అక్కడికి వచ్చిన స్థానికులు లక్ష్మీ ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.