గీత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం
‘సాక్షి’ చొరవ భేష్
- ఉద్యమంలా హరితహారం
- చిట్టాపూర్ బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు
- సీఎం కేసీఆర్ దృష్టికి గౌడల సమస్యలు: స్వామిగౌడ్
సాక్షి, సంగారెడ్డి : గీత కార్మికులు, గౌడ కులస్తుల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి స్వగ్రామమైన చిట్టాపూర్‌లో శనివారం ‘సాక్షి’ హరితహారాన్ని నిర్వహించింది. 5 ఎకరాల విస్తీర్ణంలో ఈత మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అతిథులుగా హాజరై మొక్కలు నాటారు. గీతకార్మికులు, గౌడ కులస్తులు హరితహారంలో పాల్గొని ఈత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు ఆధ్వర్యంలో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎక్సైజ్ కమిషనర్‌తో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటామన్నారు. కొత్త ఎక్సైజ్ విధానంపై అభిప్రాయాలు స్వీకరించి సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
గీత వృత్తిని ప్రభుత్వాలు ధ్వంసం చేశాయి
గత ప్రభుత్వాలు గీత వృత్తిని పూర్తిగా ధ్వంసం చేశాయని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో కల్లుగీత వృత్తికి మళ్లీ జీవం పోశారన్నారు. జంటనగరాల్లో కల్లు దుకాణాలను తెరిపించి 50 వేల మంది గీత కార్మికులకు ఉపాధి కల్పించారన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందే గీత కార్మికులకు రూ. 5 లక్షల వరకు పరిహారం చెల్లించేందుకు అంగీకరించారన్నారు. గీత కార్మికులకు పరిహారంగా అందాల్సిన రూ.16 కోట్ల బకాయిలను విడుదల చేశారన్నారు. గీత కార్మికులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గీతకార్మికులు, గౌడకులస్తులు సైతం సహకరించాలని కోరారు. హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున ఈత, ఖర్జూరం చెట్లు నాటి హరిత ఉద్యమానికి ఊపిరిపోయాలని పిలుపునిచ్చారు. ఈత, తాటి చెట్ల సంరక్షణకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలన్నారు.
చెట్లు ఉన్నప్పుడే గీత కార్మికులకు ఉపాధి ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో అందుబాటులో ఉన్న సొసైటీ భూములతోపాటు చెరువు గట్లపైన ఈత మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. జిల్లాలో మొత్తం కోటి ఈత మొక్కలు నాటాలన్నారు. ఆదిలాబాద్‌లో 37 శాతం, ఖమ్మంలో 42 శాతం అటవీప్రాంతం ఉంటే మెదక్ జిల్లాలో మాత్రం ఆరు శాతం మాత్రమే ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే కెనడాలో ప్రతి వ్యక్తికి 8,538, అమెరికాలో 716, రష్యాలో 4,416, చైనాలో 102, భారతదేశంలో అత్యల్పంగా 28 చొప్పున మొక్కలు ఉన్నట్లు చెప్పారు. మరో మూడు నెలల్లో దుబ్బాక నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకువస్తామన్నారు.
మరో హరిత ఉద్యమాన్ని తెద్దాం
గీతకార్మికులు, గౌడకులస్తులు పెద్ద సంఖ్యలో ఈత, తాటి మొక్కలు నాటి మరో హరిత ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. గీతకార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
‘సాక్షి’పై ప్రశంసల జల్లులు
హరితహారంలో భాగంగా ‘సాక్షి’ దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో శనివారం పెద్ద ఎత్తున ఈత మొక్కలు నాటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడాన్ని అన్నివర్గాలు ప్రశంసించాయి. హాజరైన మంత్రి హరీశ్‌రావు ‘సాక్షి’ చొరవను ప్రశంసించారు. హరితహారంలో మొక్కలు పెంచే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ‘సాక్షి’ సామాజిక బాధ్యతతో వ్యవహరించటంతోపాటు గౌడ కులస్తులు, గీత కార్మికులకు మేలుచేసేలా చిట్టాపూర్‌లో 5 ఎకరాల్లో ఈత మొక్కలు నాటించటం చరిత్రాత్మకమైన ఘట్టమని కొనియాడారు. గీత కార్మికులను ఒక వేదిక మీదికి తీసుకురావటం మంచి ఆలోచన అన్నారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరితహారం ద్వారా 2 కోణాలు ప్రస్ఫుటమయ్యాయన్నారు. హరితహారం విస్తరింపజేయటం మొదటిది కాగా, కులవృత్తులను పరిరక్షించుకోవటానికి సమీకరణ చేయటం రెండోదిగా అభివర్ణించారు.