విత్తన బంతి.. హరిత కాంతి..!
- విత్తన బంతులతో గుట్టలు, పర్వతాలకు ఆకుపచ్చ తోరణం
- హరితహారంలో వినూత్న పద్ధతికి వరంగల్ పోలీసుల శ్రీకారం
- కర్ణాటక రిటైర్డ్ ఐఏఎస్ స్ఫూర్తితో అమలు
- 10 లక్షల విత్తన బంతుల తయారీ లక్ష్యం
- వచ్చే వర్షాకాలంలో విస్తృతంగా సీడ్‌బాల్స్ వినియోగం
సాక్షి, వరంగల్: హరితహారం.. తెలంగాణకు ఆకుపచ్చ తోరణం కట్టేందుకు ఉద్దేశించిన పథకం.. రాష్ట్రంలో ఎటు చూసినా పచ్చదనం పరుచుకోవాలని.. పల్లెలు, పట్టణాలు, నగరా లు పచ్చికతో కళకళలాడాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్షకు ప్రతిరూపం. ఇందుకోసం అహ ర్నిశలు శ్రమిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈనేప థ్యంలో వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారులు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోనే కాక.. గుట్టలు, పర్వత ప్రాంతాల్లోనూ విస్తారంగా అడవులను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం వీరు ఎన్నుకున్న మార్గం విత్తన బంతులు(సీడ్‌బాల్స్). ఈ విత్తన బంతులతో ఒకేసారి ఎక్కువ విస్తీర్ణంలో మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు.
ఎక్కడిదీ ఆలోచన..
కర్ణాటకలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి కె.అమరనారాయణ విత్తన బంతుల ఆలోచనను వరంగల్ పోలీస్ కమి షనర్ జి.సుధీర్‌బాబుకు వివరించారు. సుధీర్ బాబు ఈ ఆలోచనను అమలు చేయాలని నిర్ణయించి కమిషనరేట్ పరిధిలోని పోలీసు శిక్షణ కేంద్రం(పీటీసీ)లో శిక్షణ పొందుతున్న 218 కానిస్టేబుళ్లతో సీడ్ బాల్స్ తయారీని మొదలు పెట్టారు. వరంగల్ పీటీసీ ఆధ్వర్యంలో 10 లక్షల సీడ్ బాల్స్ తయారు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే లక్ష సీడ్ బాల్స్ తయారు చేశారు. హరితహారంలో భాగంగా వచ్చే వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. సీడ్ బాల్స్‌ను వరంగల్ అర్బన్, జనగామ తదితర జిల్లాల్లో వినియోగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏమిటీ విత్తన బంతులు..
ప్రత్యేకంగా సంరక్షణ అవసరం లేకుండా, ప్రకృతి సిద్ధంగా త్వరగా పెరిగే చెట్ల రకాలకు విత్తనబంతుల పద్ధతిని అమలు చేస్తారు. మన రాష్ట్రంలో కానుగ, వేప, అల్లనేరేడు, సీమరూప, రావి, మర్రి, నమిలినార రకాలను సీడ్ బాల్స్ పద్ధతిలో పెంచా లని నిర్ణయించారు. అటవీ శాఖ ఈ రకాల విత్తనాలను భారీగా సేకరించి వరంగల్ పోలీసులకు ఇచ్చింది. జల్లెడ పట్టిన ఎర్రమట్టిని సరఫరా చేస్తోంది. 75 శాతం ఎర్రమట్టి, 25 శాతం పేడ ఎరువును మిశ్రమంగా చేస్తారు. ఈ మిశ్రమాన్ని కలిపి వారం పాటు మురుగబెడతారు. అనంతరం జీవామృతం (ఆవుమూత్రం, ఆవుపేడ, బెల్లం, శనగపిండి)తో మిశ్రమాన్ని ముద్దలుగా తయారు చేస్తారు. ఈ మట్టిముద్దల్లో విత్తనాలను పెట్టి ఆరబెట్టి.. గట్టిపడిన తర్వాత ఫారెస్ట్ సిబ్బంది తీసుకెళతారు. తొలకరి వర్షాలు పడిన తర్వాత వీటిని కందకాలు, గుట్టలు, పర్వతాలు, సాగుకు పనికిరాని భూముల్లో విసురుతారు. అటవీ జాతి మొక్కలే కావడంతో సీడ్ బాల్స్ నుంచి మొక్కలు సులువుగా మొలకెత్తుతాయి.
మంచి ఫలితాలు..
హరితహారంలో గ్రామాలు, పట్టణాలు, నగరాలు, రహదారుల వెంట మాత్రమే మొక్కలు నాటుతున్నారు. వేసవిలో వీటిసంరక్షణ కష్టతరం. ఎండల తీవ్రత, నిర్వహణ లోపాలతో భారీగా మొక్కలు చనిపోతున్నాయి. మరోవైపు మొక్కల సంరక్షణలో ఇబ్బందులులేని గుట్టలు, పర్వత ప్రాంతాల్లో కొత్తగా మొక్కలు నాటడం తక్కువగా ఉంటోంది. రిటైర్డ్‌ఐఏఎస్ అధికారి అమరనారాయణ దీనిని గమనించి సీడ్ బాల్స్ ఆలో చన అమలు చేశారు. తన సర్వీసులో మూడేళ్లపాటు పాఠశాల విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలసి సీడ్‌బాల్స్‌ను బోడి గుట్టల్లో వేయించి మంచి ఫలితాలు సాధించారు.
పచ్చదనం పెరగాలి..
సీడ్‌బాల్స్‌ను మన రాష్ట్రంలో తొలి సారి మేమే అమలు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కువ స్థాయిలో వర్షాలు రావాలని మా ఆకాంక్ష. ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటి పచ్చదనం పెరిగితేనే ఇది సాధ్య మవుతుంది.
– జి.సుధీర్‌బాబు,వరంగల్ పోలీస్ కమిషనర్