- సీఎం, మంత్రులు, ప్రజాప్ర తినిధులంతా హరితహారంలోనే
- తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా నాటిన మొక్కలు 75 లక్షలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పచ్చని పండుగ ప్రారంభమైంది. ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం నల్లగొండ జిల్లాలో ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ.. ఇతర ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో కలిసి సచివాలయంలో మొక్కలు నాటారు. ఇన్‌చార్జి డీజీపీ అంజనీకుమార్ డీజీపీ కార్యాలయంలో మొక్కలు నాటారు. జిల్లాల్లో కలెక్టర్లు, పోలీస్ అధికారులు హరితహారంలో పాల్గొన్నారు. రెండో విడత హరితహారం కింద రాష్ట్రవ్యాప్తంగా రెండువారాల్లో రికార్డు స్థాయిలో 46 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించగా.. శుక్రవారం ఒక్కరోజే సుమారు 75 లక్షల వరకు మొక్కలు నాటినట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 25 ప్రభుత్వ శాఖలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న నేపథ్యంలో జిల్లాల వారీగా శాఖల వారీగా నాటిన మొక్కల వివరాలు అధికారికంగా రావాల్సి ఉంది.
జాతీయ రహదారి వెంట మొక్కల జాతర
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణ సరిహద్దు వరకు సుమారు 163 కిలోమీటర్ల మేర సుమారు 1.25 లక్షల మొక్కలు నాటారు. విద్యార్థులు, యువతీయువకులు, రైతులు, కూలీలు, వివిధ పార్టీల కార్యకర్తలతో పాటు రహదారి వెంట ఉన్న ఆరు నియోజకవర్గాల్లోని సుమారు 50 గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంపులు గుంపులుగా రోడ్డుకు ఇరువైపులా నిలబడి, అప్పటికే గుంతలు తీసిన చోట మొక్కలు నాటారు. ఈ రహదారికి ఇరువైపులా లక్షమంది మొక్కలు నాటినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు.
రాష్ట్రమంతా పచ్చని పండుగ
Published Sat, Jul 9 2016 3:51 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM
Advertisement
Advertisement