Seed balls
-
హ్యాపీ స్పేస్
యాంత్రిక ప్రయాణంలో పోటీ ఎప్పుడూ ఉండేదే! కానీ, చంటిబిడ్డ తన జీవనంలోకి వచ్చినప్పుడు అమ్మ కళ్లలో.. కలల్లో చుట్టూ జీవం ఉండాలనుకుంటుంది. ‘ఆ ప్రయాస నుంచి పుట్టుకువచ్చిందే నా ప్రకృతి ఎకో ప్లే థీమ్’ అంటోంది భార్గవి. హైదరాబాద్ అల్వాల్‌లో ఉంటున్న భార్గవి నేచురల్ కలర్స్ వాడకం గురించి అపార్ట్మెంట్ పిల్లలకు పరిచయం చేస్తూ కనిపించారు. ఆసక్తితో ఆమె చేస్తున్న పని గురించి ప్రశ్నించినప్పుడు పిల్లల కోసం తను సృష్టించిన సహజ ప్రపంచాన్ని మన ముందుంచారు.. ‘‘పుట్టింది మెదక్ జిల్లాలో. ఎమ్‌టెక్ చేసి, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో బిజీ బిజీగా మారిపోయాను. పెళ్లై, పిల్లలు జీవితంలోకి వచ్చాక నాలో ఎన్నో సందేహాలు తలెత్తాయి. మూడేళ్ల నా కూతురు స్వతంత్రంగా ఎదగాలంటే ఏదైనా హ్యాపీ స్పేస్ ఉందా.. అని వెతికాను. కానీ, నాకేవీ సంతృప్తినివ్వలేదు. ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే పిల్లల వికాసం అంత బాగుంటుంది అనే తపన నాది. దీంతో చాలారోజులు ఆలోచించాను. నా సేవింగ్స్ ఎంత ఉన్నాయో చూసుకున్నాను. చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకున్నాను. ఆరేళ్లక్రితం నా ఇద్దరు పిల్లలతో ఈ థీమ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాను. ఇప్పుడు ముప్పైమంది పిల్లలు ఉన్నారు. ఈ ముప్పై సంఖ్య దగ్గరే నేను కటాఫ్ పెట్టుకున్నాను. స్వలాభం ఏ మాత్రం చూసుకోని ఒక ప్రాజెక్ట్ ఇది. నాకై నేను నా పిల్లలకోసం సృష్టించుకున్న ప్రపంచం. ఈ పిల్లలు ఎదిగి, పైస్కూళ్లకు వెళ్లినప్పుడు ఎంత ప్రతిభను చూపిస్తున్నారో స్వయంగా తెలుసుకుంటున్నాను. ఈ హ్యాపీ స్పేస్‌లో పిల్లలు చేసే అద్భుతాలు కళ్లారా చూడాల్సిందే. అందమైన పెయింట్స్ వేస్తుంటారు. సీడ్ బాల్స్తయారుచేస్తారు. కాగితాలతో బొమ్మలు తయారుచేస్తారు. కూరగాయలు, పువ్వులతో రంగులు తయారుచేస్తారు. తొమ్మిదేళ్ల పాప ఫిక్షన్ స్టోరీస్ రాసి, బుక్ కూడా పబ్లిష్ చేసింది.ఆరుబయట చెట్ల కింద రాలిపడిన పూలు, విత్తనాలను ఏరుకొచ్చి, ఒక్కోదాని గురించి వివరంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. వారికి ఇష్టమైన పండ్లు, కూరగాయలతో సలాడ్స్ చేస్తుంటారు. ప్రతీదీ నిశితంగా పరిశీలించడం వల్ల వారిలో ఎంతటి అవగాహన పెరుగుతుందో స్వయంగా చూస్తుంటాం. ఇది వారి మానసిక వికాసానికి ఎంతో మేలు కలిగిస్తుంది. హ్యాండీ క్రాఫ్ట్ తయారీలో పిల్లల చూపే ప్రతిభ చాలా సృజనాత్మకంగా ఉంటుంది. పిల్లలను స్వతంత్రంగా ఎదగనిస్తే ఎన్ని అద్భుతాలు చూపుతారో స్వయంగా నేనే తెలుసుకుంటూ ఆశ్చర్యపోతుంటాను. రెండేళ్ల నుంచి పద్నాలుగేళ్ల పిల్లలు ఈ గ్రూప్‌లో ఉన్నారు. పిల్లలు వేసే ప్రశ్నలే ఈ ఎకో థీమ్‌లో పాఠ్యాంశాలు. ఎవరికీ నచ్చలేదు... మా దగ్గరకు వచ్చే పిల్లల్లో ఇప్పుడు స్పెషల్ కిడ్స్ కూడా ఉన్నారు. వారిలో ఎంత ఆర్ట్ ఉందో చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోతుంటాను. చాలా మంది పేరెంట్స్ ముందు నా థీమ్‌ను ఏ మాత్రం నమ్మలేదు. ‘పిల్లలకు ఈమె ఏమీ నేర్పడం లేదు. ఆడుకోవడానికి వదిలేస్తున్నారు. క్రమశిక్షణగా పిల్లలు ఒక్క దగ్గర కూర్చోవడం లేద’ని చాలా మంది తల్లిదండ్రులు తిరిగి వెళ్లిపోయారు. కోవిడ్ టైమ్‌లో అయితే అందరూ మూసేయమనే సలహాలే. మా ఇంటి నుంచి మరీ ఎక్కువగా వచ్చాయి. ‘జాబ్ మానేసి, ఇలాంటి ప్రాజెక్ట్ వద్దు, ఎలాంటి లాభాలూ ఉండవు’ అనే మాటలే నా చుట్టూ విన్నాను. కానీ, లాభం కోసం ఈ థీమ్‌ని ఎంచుకోలేదు. నా పిల్లల కోసం ఎంచుకున్నాను. నేను నమ్మిన ఈ సిస్టమ్‌పై నాకు చాలా నమ్మకం ఉంది. నా ఈ థీమ్‌కు తగిన టీచర్లను ఎంపిక చేసుకోవడం కూడా కష్టంగా ఉండేది. దీంతో నేనే కొందరిని ఎంపిక చేసుకొని, నాకు తగినవిధంగా ట్రైన్ చేసుకున్నాను. అదే పట్టుదలతో కొనసాగించాను. ఫైనాన్షియల్‌గా ఇది సక్సెస్ఫుల్ అని చెప్పలేం. కానీ, ఎప్పటికీ నిలిచే ఉండేది, నాకు సంతృప్తిగా అనిపించిన ప్రపంచం ఇదే. దానినే పిల్లలకు పరిచయం చేయాలనుకున్నాను. నా పిల్లలనూ ఈ ప్రపంచంలో పెంచడం చాలా హ్యాపీగా ఉంది. అవగాహన కార్యక్రమాలు... ఈ థీమ్ వల్ల పిల్లల్లో జరిగే మానసిక వికాసం ఎంతగా ఉంటుందో తెలియజేస్తూ కార్పోరేట్ స్కూళ్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాం. పిల్లల్లోని స్వయంప్రతిభ ఎలా ఉంటుందో, వారిని వారిలాగే ఎలా ఎదగనివ్వాలో మా నేచర్ పిల్లలను పరిచయం చేసి, మరీ చూపుతుంటాను. రోజువారీ మనకు ఏం అవసరమో వాటన్నింటినీ స్వయంగా ఇక్కడి పిల్లలు చేస్తుంటారు. వాళ్లే వంట చేయడం, తినడం.. ఏదీ కూడా చెప్పకుండానే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ, తమ ప్రతిభను చూపుతుంటారు. లాభాపేక్ష లేకుండా చేసే ఈ పని రాబోయే తరాలకు ప్రయోజనం కలిగించడమే నాకు వచ్చే ఆదాయం’ అని చెబుతోంది భార్గవి. – నిర్మలారెడ్డి ఫొటో: మోహనాచారి -
డ్రోన్లతో అటవీ భూమిలో 10 వేల సీడ్ బాల్స్.. మారుత్ డ్రోన్స్ ఒప్పందం
ఆగ్రా/ఫిరోజాబాద్: ’హరా బహారా’ నినాదం కింద అడవుల పెంపకం కార్యక్రమాన్ని విస్తృతం చేసేలా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంతో హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ మారుత్ డ్రోన్స్ చేతులు కలిపింది. డ్రోన్ల ద్వారా ఆగ్రాకు సమీపంలో 10 ఎకరాల అటవీ భూమిలో 10,000 సీడ్ బాల్స్‌ను వెదజల్లింది. తమ సీడ్కాప్టర్స్ ద్వారా 2030 నాటికి 100 కోట్ల మొక్కలు నాటాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు ప్రేమ్ కుమార్ విస్లావత్ తెలిపారు. వృక్షారోపణ్ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే ప్రక్రియను నిర్వహించేందుకు ఔత్సాహిక ఎంట్రప్రెన్యూర్లు, డ్రోన్ టెక్నాలజీ తోడ్పడగలవని ఉత్తర్‌ప్రదేశ్ అటవీ శాఖ మంత్రి దారా సింగ్ చౌహాన్ తెలిపారు. -
ఇక కొండలపై మొక్కల పెంపకం
సాక్షి, అమరావతి : గ్రామీణ ప్రాంతాల్లోని కొండలపై ఈ వర్షాకాలంలో ఒకే రోజు కోటి పండ్ల మొక్కలు నాటేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధమైంది. ఉపాధి హామీ పథకంలో.. కొండలపై మొక్క బతికేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కో మొక్కపై కేవలం అర్థరూపాయి ఖర్చుతో అధికారులు ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. సాధారణంగా మొక్కల పెంపకంలో ఒక్కో మొక్క నాటాలంటే.. గుంత తీసేందుకు కనీసం రూ.25, మొక్క కొనుగోలుకు రూ.25 నుంచి రూ.50.. ఇలా ఒక్కో మొక్కకే రూ.50 నుంచి 100 దాకా ఖర్చవుతుంది. అయితే సీడ్ బాల్స్ విధానంలో ఒక్కో మొక్కపై కేవలం అర్థరూపాయి మాత్రమే ఖర్చుపెట్టేలా కొండలపై ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సేంద్రియ ఎరువులతో కూడిన షోషకాలు ఎక్కువగా ఉండే మట్టిని సిద్ధం చేసుకుని.. ఆ మట్టిని ఉండలు ఉండలుగా చేస్తారు. ఒక్కో ఉండలో నాటాల్సిన మొక్కకు సంబంధించిన విత్తనాన్ని ఉంచుతారు. ఎలాంటి నేలలోనైనా నామమాత్రపు తేమకే ఆ విత్తనం మొలకెత్తేలా ఆ మట్టి ఉండలు(సీడ్స్ బాల్స్) అత్యంత నాణ్యంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. విత్తనం, మట్టి ఉండల తయారీకి అయ్యే ఖర్చు కూడా ఒక్కో దానికి అర్ధరూపాయి లోపే ఉంటుందంటున్నారు. కనీసం వెయ్యి కొండల్లో పదివేల చొప్పున.. ఈ వర్షాకాలంలో కొండలపై కోటి మొక్కలు పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న గ్రామీణాభివృద్ధి శాఖ.. రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు మండలానికి రెండేసీ కొండలను ఎంపిక చేసుకోనుంది. మండలానికి కనీసం ఒక్క కొండపైనైనా ఈ సీడ్ బాల్స్ విధానంలో మొక్కల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇలా రాష్ట్రంలో 660 మండలాల్లో కనీసం వెయ్యి కొండల్లో ఒక్కో కొండపై పది వేల చొప్పున మొక్కల పెంపకాన్ని చేపడతారు. ఉపాధి హామీ పథకం, వాటర్‌హెడ్ కార్యక్రమాల్లో భాగంగా గతంలో కూలీల ద్వారా వర్షం నీరు నిల్వలకు స్ట్రెంచ్‌ల తవ్వకం జరిపిన కొండలను ఎక్కువగా ఈ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు. కాగా, సీతాఫలం, ఉసిరి, రేగు వంటివాటితో పాటు కుంకుడు, వెలగ వంటి వాటినే ఈ మొక్కల పెంపకం కార్యక్రమంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు. నీడకు పనికొచ్చే వేప, కానుగ మొక్కలను కూడా పెంచుతారు. కొండల గుర్తింపు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. వర్షాకాలం మధ్య కల్లా కార్యక్రమాన్ని చేపడతామని అధికారులు వెల్లడించారు. -
సూర్యకళ: రైతుల అక్కయ్య.. నేల రుణం తీర్చుకుందాం!
సూర్యకళ పుట్టింది పెరిగింది హైదరాబాద్ నగరంలో. ఆమె సాంత్వన పొందుతున్నది మాత్రం గ్రామసీమల్లో. ప్రకృతిమాత కోసం మొదలు పెట్టిన సేవను రైతుల సేవతో పరిపూర్ణం చేస్తున్నారామె. హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సూర్యకళ రెండు దశాబ్దాలుగా కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నతస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘ఆ ఉద్యోగం బతకడానికి మాత్రమే. గ్రామాలు, రైతుల కోసం చేస్తున్న పని జీవితానికి ఒక అర్థం, పరమార్థం’ అంటారామె. ఆమె తన ఫార్మర్ ఫ్రెండ్లీ జర్నీ గురించి ‘జాతీయ రైతు దినోత్సవం’ సందర్భంగా సాక్షితో పంచుకున్న వివరాలివి. ‘‘రైతును బతికించుకోకపోతే మనకు బతుకు ఉండదు. నేలను కాపాడుకోక పోతే మనకు భూమ్మీద కాలం చెల్లినట్లే. మనిషిగా పుట్టిన తరవాత మన పుట్టుకకు అర్థం ఉండేలా జీవించాలి. ఎంతసేపూ మనకోసం మనం చేసుకోవడం కాదు, మనకు బతుకునిస్తున్న నేలకు కూడా పని చేయాలి. మనం పోయిన తర్వాత కూడా మనం చేసిన పని భూమ్మీద ఉండాలి. మన స్ఫూర్తి మిగిలి ఉండాలి. ఇదీ నా జీవిత లక్ష్యం. నా లక్ష్యం కోసం నేను పని చేస్తున్నాను. ఒక దశాబ్దకాలంగా మొదలైందీ మిషన్. తెలంగాణ జల్లాల్లో 2016 నుంచి యాభైకి పైగా రైతు శిక్షణ సదస్సులు నిర్వహించాను. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల ఇళ్లకు వెళ్లి, వాళ్లందరినీ ఒక గొడుగు కిందకు తెచ్చాను. రైతు సేవల నిలయం భావసారూప్యత ఉన్న వాళ్లందరం కలిసి నల్గొండ జిల్లా, మర్రిగూడలో గ్రామ భారతి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో రైతు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. మార్చి నాటికి ఒక రూపానికి వస్తుంది. రైతులకు ఉపయోగపడేవిధంగా పాలేకర్ మోడల్, సుథారియా అభివృద్ధి చేసిన గోకృపామృతం మోడల్, చౌరాసియా మోడల్ వంటి వివిధ రకాల మోడల్స్‌ని మరింతగా అభివృద్ధి చేయడం ఈ శిక్షణాకేంద్రం ఉద్దేశం. రైతులకు ఉపయోగపడే సేవలను ఒక గొడుగు కిందకు తీసుకురావడమన్నమాట. వ్యవసాయం కోసం చెక్ డ్యామ్‌ల నిర్మాణం, మొక్కల పెంపకం కోసం లక్షల్లో సీడ్ బాల్స్ తయారు చేయించి ఖాళీ నేలల్లో విస్తరింపచేయడం వంటి పనుల్లో నాకు సంతృప్తి లభిస్తోంది. నింగి– నేలకు బంధం ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు తన కాళ్ల మీద తాను నిలబడడం అంత సులువు కాదు. అందుకే సమాజంలో ఆర్థిక పరిపుష్టి కలిగిన వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో రైతును దత్తత తీసుకోవలసిందిగా కోరుతున్నాను. నా అభ్యర్థన మేరకు కొంతమంది విదేశాల్లో ఉన్న వాళ్లు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మన రైతులకు సహాయం చేస్తున్నారు కూడా. వ్యవసాయంలో మంచి దిగుబడులు తెస్తూ నలుగురికి ఆదర్శంగా నిలిచిన రైతులకు రైతు దినోత్సవం నాడు ఐదేళ్లుగా సన్మానం చేస్తున్నాం. మొదట్లో చిన్న చిన్న ఖర్చులు సొంతంగా పెట్టుకున్నాం. రైతు శిక్షణ కేంద్రం నిర్మాణం కోసం మా కొలీగ్స్, స్నేహితులతోపాటు కార్పొరేట్, మల్టీనేషనల్ కంపెనీల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నాం. ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుకు సహాయం చేయడమంటే ఒక వ్యక్తికి సహాయం చేయడం కాదు. మనం కంచంలో ఆరోగ్యకరమైన అన్నానికి చేయూతనివ్వడం. మనల్ని బతికిస్తున్న నేల రుణం తీర్చుకోవడం’’ అన్నారు సూర్యకళ. మనదేశ మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్‌సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రైతుల కోసం పని చేయడంలో జీవిత పరమార్థాన్ని వెతుక్కుంటున్న సూర్యకళ పుట్టింది కూడా ఇదే రోజు కావడం విశేషం. రైతులను కలుపుతున్నారు రెండున్నరేళ్ల కిందట సిద్ధిపేటలో గోకృపామృతం రూపకర్త గోపాల్ భాయ్ సుథారియా గారి మీటింగ్‌కి వెళ్లాను. ఆ సదస్సును నిర్వహించిన సూర్యకళ మేడమ్ అప్పుడే పరిచయమమ్యారు. రైతుల సమావేశాలు, కరోనా సమయంలో జూమ్ మీటింగ్‌లు ఏర్పాటు చేశారు. వారి సూచనలతో రెండెకరాల్లో వరి సాగుతోపాటు పండ్ల మొక్కల పెంపకం కూడా మొదలు పెట్టాను. – పద్మాల రాజశేఖర్, శిర్నాపల్లి గ్రామం, మండలం ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా నీటి నిల్వ నేర్పించారు మేము ఎనిమిది ఎకరాల్లో సేద్యం చేస్తున్నాం. అప్పట్లో మాకు పొలంలో నీళ్లు లేవు. సూర్యకళ మేడమ్‌కి మా పరిస్థితి తెలిసి, శర్మ గారనే రిటైర్డ్ ఇంజనీర్ గారిని మా పొలానికి పంపించారు. ఆయన మాకు నీటిని నిల్వ చేసుకునే పద్ధతులు నేర్పించారు. అలాగే ప్రకృతి సేద్యం చేయడానికి ప్రోత్సహించడంతోపాటు మేము పండించిన పంటను కొనుక్కునే వారిని మాతో కలిపారు. అలా రైతులకు– వినియోగదారులను అనుసంధానం చేస్తూ ఒక నెట్వర్క్ రూపొందించారు మా మేడమ్. – వాకాటి రజిత, చౌటుప్పల్, నల్గొండ జిల్లా పంట వేయకముందే ఆర్డర్లు మూడున్నర ఎకరాల్లో వరి, కూరగాయలు, పశువుల కోసం నాలుగు రకాల గ్రాసం వేస్తుంటాను. ఈ ఏడాది 60 కొబ్బరి మొక్కలు కూడా పెట్టాను. మా పంటలు అమ్ముకోవడానికి వాట్సప్ గ్రూప్‌లున్నాయి. మాకు తెలియని పంట పెట్టడానికి ప్రయత్నం చేసి సందేహాలు అడిగితే, ఆ పంటలు సాగు చేస్తున్న రైతు సోదరులతో కలుపుతారు. సూర్యకళ అక్కయ్య మమ్మల్నందరినీ కలపడం కోసం ‘రైతులతో భోజనం’ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. రైతు దినోత్సవం రోజు సన్మానాలు చేస్తారు. మంచి దిగుబడి తెచ్చినందుకు నాకూ ఓ సారి సన్మానం చేశారు. – ఒగ్గు సిద్దులు, ఇటికాలపల్లి, జనగామ జిల్లా – వాకా మంజులారెడ్డి -
ఏమిటీ విత్తన బంతులు.. ఎలా తయారు చేస్తారు?
సాక్షి, విశాఖపట్నం: పర్యావరణ పరిరక్షణలో కీలకమైన పచ్చని చెట్లను పెంచడానికి వీలైన అన్ని వనరులను అధికార యంత్రాంగం సమీకరిస్తోంది. రెండేళ్లుగా చేపడుతున్న ‘జగనన్న పచ్చతోరణం’ సత్ఫలితాలనిస్తుండడంతో.. పచ్చదనం పెంపునకు ఈ ఏడాది అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తోంది. విశాఖ జిల్లాలోని కొండలు, గుట్టలు, ఖాళీ స్థలాల్లో విసిరేందుకు సామాజిక అటవీ శాఖ 2 లక్షల విత్తన బంతులను తయారుచేయిస్తోంది. అడవులు సహజ సిద్ధంగా తయారు కావాలి. గుంతలు తవ్వి, మొక్కలు నాటి.. అడవులు సృష్టించాలంటే సాధ్యం కాని పని. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అడవి జీవ వైవిధ్యానికి అద్దం పడుతుంది. ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోకపోయినా.. అడవుల్లో చెట్లు సహజ సిద్ధంగానే పెరుగుతాయి. ఇలాంటి అడవులను సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా శ్రమిస్తోంది. ఇందుకోసం విలక్షణమైన విత్తన బంతుల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. హరిత హారం అడవిలో అంతంత మాత్రంగా కనిపించడం, గుట్టలు, కొండల్లో పచ్చదనం కనుమరుగవుతున్న విషయాలను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘జగనన్న పచ్చతోరణం’పేరుతో విత్తన బంతుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏమిటీ విత్తన బంతులు? ప్రత్యేకంగా సంరక్షణ అవసరం లేకుండా.. ప్రకృతి సిద్ధంగా త్వరగా పెరిగే చెట్ల రకాలకు అధికారులు విత్తన బంతుల పద్ధతి అమలు చేస్తున్నారు. ముందుగా మన వాతావరణానికి అనుకూలమైన చింత, వేప, కానుగ, రెల్ల, కుంకుడు, ఏగిస మొదలైన చెట్ల నుంచి విత్తనాలు సేకరిస్తారు. జల్లెడ పట్టిన ఎర్రమట్టిని సిద్ధం చేస్తారు. 75 శాతం ఎర్రమట్టిలో 25 శాతం ఆవుపేడ, కొంత కోకాపిట్ను కలిపి ఎరువు మిశ్రమంగా తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని కలిపి వారం రోజులు మురుగబెడతారు. అనంతరం జీవామృతం(ఆవుపేడ, బెల్లం, శనగపిండి)తో మిశ్రమాన్ని ముద్దలుగా తయారు చేస్తారు. ఇవి వీడిపోకుండా గట్టిగా ఉండేందుకు స్టార్చ్ లిక్విడ్, బబుల్ గ్లూ ద్రావణాలు మట్టి ముద్దలో కలుపుతారు. ఈ మట్టి ముద్దల్లో విత్తనాలను పెట్టి ఎండబెట్టారు. తొలకరి వర్షాలు పడిన తర్వాత కందకాలు, గుట్టలు, కొండలు, సాగుకు పనికిరాని భూముల్లో విసురుతారు. అటవీ జాతి మొక్కలే కావడంతో సీడ్ బాల్స్ నుంచి విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. గతేడాది మంచి ఫలితాలు గతేడాది కూడా అటవీ శాఖ విత్తన బంతులను చల్లింది. మొత్తం 2 లక్షల విత్తన బంతులు తయారు చేయగా.. జీవీఎంసీకి 50 వేల బంతులు అందించారు. నౌకాదళంతో కలిసి నగరంలోని కొండలపై జీవీఎంసీ అధికారులు విత్తన బంతులు చల్లారు. మిగిలిన 1.50 లక్షల బంతులను జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు విసిరారు. వాటి నుంచి ప్రస్తుతం మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. ఈ ఏడాది కూడా 2 లక్షల సీడ్ బాల్స్ తయారు చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. ముఖ్యమంత్రి సూచనలతో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విత్తన బంతులు తయారు చేస్తున్నాం. నేడు మనం జాగ్రత్త చేసిన విత్తనమే.. రేపు భారీ వృక్షంగా మారుతుంది. జగనన్న పచ్చతోరణంలో భాగంగా విత్తన బంతుల కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. తక్కువ ఖర్చుతో సేంద్రీయ పద్ధతిలో తయారు చేసి.. పెద్ద సంఖ్యలో వృక్ష సంపద పెరిగేలా చర్యలు చేపడుతున్నాం. అవసరమైతే నౌకాదళ సహకారం కూడా తీసుకుంటాం. – ఎన్ ప్రతీప్‌కుమార్, రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణ అధికారి సీడ్ బాల్స్‌తో అనేక లాభాలున్నాయి.. కొండప్రాంతాల్లో గోతులు తవ్వి మొక్కలు నాటడం చాలా కష్టతరం. విత్తన బంతుల తయారీ తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. పోషకాలు అధికంగా ఉండే మట్టిలో విత్తనాలను పెట్టడం వల్ల మొక్కలు బతికే అవకాశాలు 100 శాతం ఉన్నాయి. గతేడాది చేపట్టిన సీడ్‌బాల్స్ ప్రక్రియ సత్ఫలితాలిచ్చింది. ఈ పద్ధతిలో జిల్లాలోని అటవీ ప్రాంతం, రెవెన్యూ హిల్స్‌లో.. అన్ని రకాల ప్రదేశాల్లోనూ మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. సెప్టెంబర్‌లో విత్తన బంతులు విసిరే ప్రక్రియ ప్రారంభిస్తాం. – గంపా లక్ష్మణ్, డీఎఫ్‌వో, సామాజిక అటవీ శాఖ -
Green India Challenge: గిన్నీస్ బుక్‌లో పాలమూరు ఆడబిడ్డలు
పాలమూరు ఆడబిడ్డలు గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించారు. విత్తన బంతుల (సీడ్ బాల్స్)తో ఇంగ్లిష్ అక్షరాలతో అతిపెద్ద వాక్యాన్ని పేర్చినందుకు ఈ ఘనత సాధించారు. అంతేకాదు 2.08 కోట్ల విత్తన బంతులు (సీడ్ బాల్స్) తయారు చేసి వెదజల్లారు. జిల్లాలోని 479 గ్రామైక్య, 11,506 స్వయం సహాయక సంఘాల్లోని (ఎస్‌హెచ్‌జీ 1,29,506 మంది మహిళలు, మెప్మా ఆధ్వర్యంలోని 27,040 మంది 10 రోజుల పాటు శ్రమించి వీటిని తయారుచేశారు. 81 మంది మహిళలు.. 81 ఇంగ్లిష్ అక్షరాలతో ‘టూ క్రోర్ సీడ్ బాల్స్ మేడ్ అండ్ ప్లాంటెడ్ బై ఎస్‌హెచ్‌జీ ఉమెన్ ట్రాన్స్ఫామ్ మహబూబ్‌నగర్ ఇన్ టు హెటిరో గ్రీన్ బెల్ట్’అని ఇంగ్లిష్‌లో 73,918 సీడ్ బాల్స్‌ను పేర్చారు. ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా వీక్షించిన గిన్నిస్ బుక్ ప్రతినిధి రిషినాథ్ సాయంత్రం రికార్డు సాధించినట్లు ప్రకటించారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని మయూరి రిజర్వ్ ఫారెస్ట్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ సంతోష్‌కుమార్, కలెక్టర్ వెంకట్రావ్ విత్తన బంతులను వెదజల్లి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. - సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ -
సీడ్ బాల్స్‌తో ఉష్ణోగ్రతలకు చెక్!
సాక్షి, అమరావతి: విపరీతంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు.. పచ్చదనాన్ని పెంచేందుకు కొండ ప్రాంతాల్లో సీడ్ బాల్ టెక్నాలజీ ద్వారా భారీగా మొక్కలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అటవీ ప్రాంతం వెలుపల కూడా 33 శాతం వృక్ష సంపదను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాలతో సంబంధం లేకుండా మైదాన ప్రాంతాల్లో ఉండే రెవెన్యూ కొండలపై భారీ స్థాయిలో మొక్కల పెంపకం చేపట్టనుంది. సాధారణంగా రోడ్లకిరువైపులా ఒక్కొక్క మొక్క పెంపకానికి మూడేళ్లలో రూ.300 వరకు ఖర్చవుతోంది. దీనికి భిన్నంగా రెవెన్యూ కొండలపై పెంచే ఒక్కొక్క మొక్కకు కేవలం ఒక్క రూపాయి కంటే తక్కువ ఖర్చే కానుంది. ఇందుకోసం సరికొత్త ‘సీడ్ బాల్స్’ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత 2021–22 ఆర్థిక సంవత్సరంలో 5 –6 వేల హెక్టార్లలో ఈ విధానంలో కొండ ప్రాంతాల్లో మొక్కల పెంపకం చేపట్టనుంది. రానున్న సంవత్సరాల్లో మొత్తం 25 వేల హెక్టార్లలో కొండలపై భారీగా మొక్కలను పెంచనుంది. ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామీణాభివృద్ధి శాఖ ఈ కార్యక్రమం చేపడుతోంది. సీడ్ బాల్ విధానంలో మొక్కల పెంపకం ఇలా.. సీడ్ బాల్ విధానంలో.. ఎర్రమట్టి, బంక మట్టి కలగలిపిన మిశ్రమాన్ని 1.5 అంగుళాల నుంచి రెండు అంగుళాల సైజులో బంతి రూపంలో చిన్న ఉండలు చేస్తారు. ఆ బంతిపై చిన్న రంధ్రం చేసి 2–3 విత్తనాలు పెట్టి యథాతథంగా మారుస్తారు. తర్వాత ఆ మట్టి బంతులను 24 గంటల నుంచి 48 గంటల పాటు నీడలో ఆరబెడతారు. నాలుగైదు రోజుల తర్వాత కొండలపై నేరుగా చల్లుతారు. ఒక్కొక్క సీడ్ బాల్ తయారీకి అర్ధ రూపాయి.. వాటిని చల్లడానికి మరో అర్ధ రూపాయి కలిపి రూపాయికి మించి ఖర్చు కాదని అధికారులు తెలిపారు. మొలక వచ్చే వరకు సీడ్ బాల్లో విత్తనం సేఫ్.. కొండలపై సీడ్ బాల్స్‌ను చల్లాక వర్షాకాలంలో మొలక వచ్చే వరకు అందులో విత్తనం భద్రంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఉపాధి హామీ పథకం కూలీల ద్వారా.. లేకుంటే డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్‌ను కొండలపై చల్లిస్తామని తెలిపారు. సీడ్ బాల్స్ అన్నీ ఒకే చోట పడకుండా ప్రతి రెండు మీటర్ల దూరంలో అర అడుగు లోతు, అర అడుగు వెడల్పుతో సన్నని గాడులు తీస్తారు. రాళ్ల గుళ్లలు ఉన్నచోట సీడ్ బాల్స్‌ను చల్లుతారు. చల్లే సమయంలో బాల్స్ పగలకుండా తగిన చర్యలు తీసుకుంటారు. ఒక్కో హెక్టార్ పరిధిలో 2,000 నుంచి 2,500 సీడ్ బాల్స్.. ఒక్కో హెక్టార్ పరిధిలో 2000–2500 సీడ్ బాల్స్ పడేలా చల్లే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ వేసవిలో ఉపాధి హామీ పథకం నిధులతో 1.10 కోట్ల సీడ్ బాల్స్‌ను తయారు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, విశాఖ జిల్లాల్లో పది లక్షల చొప్పున.. తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడున్నర లక్షలు చొప్పున, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, పశ్చిమగోదావరి, విజయనగరం, కృష్ణా జిల్లాల్లో ఐదు లక్షల చొప్పున సీడ్ బాల్స్‌ను వర్షాకాలం ప్రారంభం నాటికి అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. సీడ్ బాల్స్ విధానంతోపాటు ఉపాధి హామీ పథకం నిధులతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొండ ప్రాంతాల్లో మరో కోటి మొక్కలను నేరుగా నాటడానికి వేరుగా కార్యాచరణను సిద్ధం చేసుకున్నామని అధికారులు తెలిపారు. -
రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్యా రజనీ కాంత్ పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. శుక్రవారం చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో సన్నిహితులు, బంధువులకు గ్రాండ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు రజనీ కుటుంబ సభ్యులు. ఈ రిసెప్షన్‌కు వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్‌గా సీడ్ బాల్‌ను అందించడం విశేషం. ఫార్మా బిజినెస్‌మేన్ విశాగన్ వనంగాముడి, సౌందర్య రజనీకాంత్ వివాహం ఆదివారం జరగనుంది. సౌందర్యకు ఇది రెండో వివాహం. ఆల్రెడీ అశ్విన్ రామ్‌కుమార్ అనే పారిశ్రామికవేత్తను వివాహం చేసుకున్నారు. 2017లో విడాకులు తీసుకున్న వీళ్లకు వేద్ అనే కుమారుడు ఉన్నారు. -
సీడ్‌బాల్స్‌తో అటవీ సంరక్షణ
హరితహారంలో భాగంగా విత్తన బంతుల తయారీతో హరితహారం లక్ష్యం చేరుకునేందుకు గత ఏడాది ఈ పద్ధతిని సర్కారు ప్రయోగించింది. ప్రభుత్వం ఆదేశం మేరకు ఈ సారి కూడా ఇదే తరహాలో మొక్కలను పెద్దఎత్తున నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లోనూ ఇదే పద్ధతిని అనుసరిస్తుడడంతో ప్రభుత్వం కూడా ఈ పద్ధతికే మొగ్గు చూపుతోంది. ఈవిధానంతో అడవి శాతాన్ని పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వికారాబాద్ అర్బ్న్ : నూతనంగా ఏర్పడ్డ వికారాబాద్ జిల్లా విస్తీర్ణంలో 1.1 లక్షల ఎకరాల్లో మాత్రమే అడవులు ఉన్నాయి. భౌగోళికంగా ఇది 14శాతం మాత్రమేనని అటవీశాఖ అధికారులు తెలిపారు. దీన్ని 37శాతానికి పెంచేందుకు పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో అడవుల శాతాన్ని 37 శాతానికి పెంచేందుకు గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపడుతుంది. ఇందులో భాగంగానే అటవీశాఖ, ఉపాధిహామీ పథకం కింద నర్సరీల్లో మొక్కలు పెంచి అన్నీ గ్రామాలకు అందిస్తున్నారు. ఈ రకంగా అడవి ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లో నాటుతున్న మొక్కలు రక్షణ లేక ఎండిపోతున్నాయి. వర్షాలు పుష్కలంగా ఉండి వీటికి నీరు అందించినా ఎండిపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే అటవీ శాఖ ఆధ్వర్యంలో విత్తన బంతి ప్రయోగాన్ని ముందుకు తీసుకొచ్చారు. ప్రత్యేక ఆకర్షణగా సీడ్‌బాల్.. సీడ్ బాల్స్ ప్రయోగాన్ని గత ఏడాది హరితహారంలో అమలుపరిచి విజయం సాధించిన అటవీశాఖ అధికారులు ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున విత్తన బంతులు తయారు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సుమారు లక్ష విత్తన బంతులు తయారు చేసి నిల్వ ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హరితహారం ప్రారంభం కాగానే విత్తన బంతులను అన ంతగిరి అడవిలో విసిరేందుకు సిద్ధంగా ఉంచారు. ఈ సీడ్ బాల్స్ ద్వారా చేపట్టే హరితహారం కార్యక్రమంలో యువజన సంఘాలను, స్వచ్ఛంద సంస్థలను, విద్యార్థులు పాల్గొనేలా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కర్ణాటకలో సత్ఫలితాలు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన విశ్రాంత ఐఏఎస్ అ ధికారి అమర్ నారాయణ విత్తన బంతులను ప్ర యోగాత్మకంగా ప్రవేశపెట్టి విజయం సాధించా డు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మన రాష్ట్రంలో కూడా గత ఏడాది ఈ పద్ధతి ఫలితాన్ని ఇచ్చింది. జిల్లాలో అటవీ శాతం పెంచేందుకు.. జిల్లాలో అనంతగిరి అటవి శాతాన్ని పెంచేందుకు అటవీ శాఖ అధికారులు సీడ్ బాల్స్ ప్రయోగాన్ని అమలు చేయనున్నారు. అనంతగిరి అటవీ ప్రాంతం 3,700 ఎకరాల వరకు విస్తరించి ఉంది. ఎత్తయిన కొండలు, లోయలతో కూడిన ఈ అనంతగిరిలో కొంత కాలంగా అటవి అంతరించిపోయే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు పచ్చని చెట్లతో కళకళలాడిన అనంతగిరి కొండలు నేడు కళ తప్పాయి. దీంతో ఈ ప్రాంతంలో అటవి శాతాన్ని పెంచి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అటవీశాఖ అధికారులు సీడ్ బాల్ ప్రయోగాన్ని అమలు చేయబోతున్నారు. అనంతగిరి పర్యాటక కేంద్రానికి వచ్చే పర్యాటకులు ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు.ఆ సమయంలో వారికి విత్తన బంతులు ఇచ్చి విసిరేయించే ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు అనంతగిరిలోని ఫారెస్టు గెస్టహౌస్లో విత్తన బంతులను సిద్ధంగా ఉంచనున్నారు. విత్తన బంతుల తయారీ విధానం.. విత్తన బంతిలో ఉండే విత్తనం పుచ్చిపోకుండా పాడవకుండా ఉండడానికి కారణం బంతి తయారీలో వాడే పదార్థాలే. విత్తన బంతిని తయారు చేయాలంటే స్థానికంగా లభించే విత్తనాన్ని ముందుగా ఎండబెట్టి సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత వర్మీకంపోస్టు ఎరువు, ఎర్రమట్టి, పశువుల పేడ, గో మూత్రం, బెల్లం, శనగపిండి పదార్థాలు తగినంత నీటిలో మిశ్రమం చేసి చిన్న పాటి లడ్డూల మాదిరిగా తయారు చేసుకోవాలి. ఎండబెట్టిన విత్తనాన్ని లడ్డూ మాదిరి తయారు చేసిన విత్తన బంతి మధ్యలో విత్తనాన్ని ఉంచి గుం డ్రంగా బంతిలా తయారు చేయాలి. ఈ బంతులు నెల నుంచి రెండు నెలల పాటు నిల్వ ఉంటాయి. వర్షాలు కురుస్తున్న సమయంలో విత్తన బంతులను అటవి ప్రాంతంలో, పొలాల వద్ద విసిరేస్తే మొక్కలుగా మొలుస్తాయి. మామూలుగా పెరిగే మొక్కకంటే విత్తన బంతి ద్వారా నాటిన మొక్క త్వరగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఏ ప్రాంతాలు అనుకూలం.. అటవీ ప్రాంతం తక్కువగా ఉన్న చోట్ల, బంజరు భూములు, పొలం గట్లు, ప్రభుత్వ భూముల్లో విత్తన బంతులను చల్లాలి. కొద్దిపాటి తేమ, మట్టి ఉన్న భూములను ఎంపిక చేసుకోవాలి. రాయి ఉన్న భూములు పనికి రావు. ఖర్చు తక్కువ.. అటవీశాఖ, ఉపాధి హామీ నర్సరీల్లో పెంచే మొక్కలకు ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేస్తుంది. ఒక్కో మొక్కపై సుమారు రూ. 20 నుంచి రూ. 30వరకు ఖర్చు చేస్తుంది. అయితే విత్తన బంతి ఖర్చుమాత్రం చాలా తక్కువ అవుతుంది. ఒక్కో బంతి తయారీకి కేవలం రూ. 5 లోపే ఖర్చు అవుతున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. -
సత్ఫలితాలిస్తున్న ‘సీడ్ బాల్స్’
కెరమెరి : గతేడాది విత్తన బంతుల ద్వారా నూతన ప్ర యోగానికి శ్రీకారం చుట్టిన అటవీ అధికారులు ప్రణా ళిక విజయవంతమవుతుంది. ప్లాస్టిక్ కవర్లలో స్టంపు పెట్టి వాటికి నీరు పోసి బతికించే దానికంటే మట్టితో వివిద రకాల వస్తువులు కలిపి తయారు చేసిన విత్తన బంతులు సీడ్ బాల్స్ తోనే అధిక ప్రయోజనం ఉం టుందని భావించిన అటవీ అధికారులు ఈ ఏడాది ప్రతి ష్టాత్మకంగా చేపట్టబోయే హరితహరంలో ఆ ప్రయోగాన్నే అధికంగా వాడనున్నారు. కెరమెరి అటవీ „ó క్షేత్రాధికారి పరిధిలో కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు) మండలాలు ఉన్నాయి. కెరమెరిలో గతేడాది రేంజ్‌లోని కొప్పగూడలో 2 వేలు, గోయగాంలో 2 వేలు, సాంగ్వి లో 2 వేలు, ధోబోలిలో 2 వేలు, బిర్లఘాట్లో రెండు వే లు మొత్తం 10 వేల విత్తన బంతులు విసరగా 6 వేలు ప్రస్తుతం సజీవంగా ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. రెండు వందల ఎకరాల్లో విత్తన బంతులు కెరమెరి రేంజ్ మొత్తం 60 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అందులో విత్తన బంతులు గత సంవత్సరం 200 ఎకరాల్లో విసరారు. ఆ బంతులన్ని అటవీ ప్రాంతంలో విసరడం తో పాటు అధికారులు అటువైపుగా పశువులు మేపకుండా చర్యలు తీసుకోవడంతో ఆ మొక్కలు సజీ వంగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం అయితే ఈ సంవత్సరం 25 వేల విత్తన బంతులను వేయాలని అటవీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రేంజ్‌లోని అన్ని మండలాల్లో నర్సరీ పనులు ప్రారంభమైయ్యాయి. లక్ష్యం 5 లక్షల మొక్కలు గతేడాది కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు) మండలాల్లో అటవీ అధికారులకు మూడు లక్షల మొక్కలు నాటా రు. ఈ సంవత్సరం ఐదు లక్షల మొక్కలను నాటాలని అధికారులు ఆదేశించారు.. అందులో మూడు మండలాల్లోని సాంగ్వి, కెరమెరి, దుబ్బగూడ, కోహినూర్, రాసిమొట్టల్లో 5 లక్ష్యల మొక్కలను నాటనున్నారు. ఒక్కో నర్సరీలో లక్ష మొక్కలను నాటనున్నారు. అయి తే అధికారుల కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నారు. 25 మంది అటవీ సిబ్బంది ఉండాల్సి ఉండగా ఎప్ ఎస్వోలు ఐదుగురు, ఎఫ్‌బీవోలు ఐదుగురు మాత్రమే ఉన్నారు. పండ్ల మొక్కలకు ప్రాధాన్యం మా నర్సరీల్లో వివిధ రకాల పూలు, పండ్ల మొక్కల కు అధిక ప్రాధాన్యం ఇస్తాం. గతేడాది కూడా వివిద రకాల పూలు, పండ్ల మొక్కలను నర్సరీల్లో పెంచాం. ఈ ఏడాది హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. వివిద రకాల మొక్కలను అందుబాటులో ఉంచుతాం. – సయ్యద్ మజరుద్దీన్, ఎఫ్ఆర్వో, కెరమెరి -
మసనోబు ఫుకుఓక ఆవిష్కరణ..
► విత్తన బంతులతో సేద్యం! బంజరు భూముల్లో, కొండలు, గుట్టల్లో, ఎడారి ప్రాంతాల్లో చెట్ల పెంపకానికి దోహదపడటంతోపాటు రాజు టైటుస్ వంటి ప్రకృతి వ్యవసాయదారులు తమ పొలాలను దున్నకుండా విత్తన బంతులతో సేద్యం చేస్తుండడం విశేషం. 1940లోనే జపాన్ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా విత్తన బంతుల విధానాన్ని కనిపెట్టారు. ప్రస్తుతం అన్ని దేశాలకూ విత్తన బంతుల వాడకం విస్తరించింది. విత్తన బంతుల తయారీ ఇలా.. మెత్తని జల్లెడ పట్టిన ఎర్రమట్టి మూడు పాళ్లు, పశువులు/వానపాముల ఎరువు ఒకపాలు, జీవామృతం మిశ్రమాన్ని కలిపి.. రొట్టెల ముద్దలు చేసినట్టు.. గులాబ్ జామూన్ సైజులో చేసుకోవాలి.రెండు, మూడు విత్తనాలను అందులో చొప్పించి 3–4 గంటలు ఆరబెట్టాలి. గట్టి పడిన విత్తన ముద్దలను నిల్వ చేసుకొని.. వర్షాకాలంలో గుట్టలపైనా క్షీణించిన అడవుల్లో వెదజల్లాలి. ఇదే పద్ధతిని అనుసరించి భూమిని దుక్కి చేయకుండా పంట విత్తనాలతో సైతం విత్తన బంతులు తయారు చేసి.. సేద్యం చేయవచ్చు అని రాజు ౖటైటుస్ చెబుతున్నారు. -
విత్తన బంతి.. హరిత కాంతి..!
- విత్తన బంతులతో గుట్టలు, పర్వతాలకు ఆకుపచ్చ తోరణం - హరితహారంలో వినూత్న పద్ధతికి వరంగల్ పోలీసుల శ్రీకారం - కర్ణాటక రిటైర్డ్ ఐఏఎస్ స్ఫూర్తితో అమలు - 10 లక్షల విత్తన బంతుల తయారీ లక్ష్యం - వచ్చే వర్షాకాలంలో విస్తృతంగా సీడ్‌బాల్స్ వినియోగం సాక్షి, వరంగల్: హరితహారం.. తెలంగాణకు ఆకుపచ్చ తోరణం కట్టేందుకు ఉద్దేశించిన పథకం.. రాష్ట్రంలో ఎటు చూసినా పచ్చదనం పరుచుకోవాలని.. పల్లెలు, పట్టణాలు, నగరా లు పచ్చికతో కళకళలాడాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్షకు ప్రతిరూపం. ఇందుకోసం అహ ర్నిశలు శ్రమిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈనేప థ్యంలో వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారులు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోనే కాక.. గుట్టలు, పర్వత ప్రాంతాల్లోనూ విస్తారంగా అడవులను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం వీరు ఎన్నుకున్న మార్గం విత్తన బంతులు(సీడ్‌బాల్స్). ఈ విత్తన బంతులతో ఒకేసారి ఎక్కువ విస్తీర్ణంలో మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. ఎక్కడిదీ ఆలోచన.. కర్ణాటకలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి కె.అమరనారాయణ విత్తన బంతుల ఆలోచనను వరంగల్ పోలీస్ కమి షనర్ జి.సుధీర్‌బాబుకు వివరించారు. సుధీర్ బాబు ఈ ఆలోచనను అమలు చేయాలని నిర్ణయించి కమిషనరేట్ పరిధిలోని పోలీసు శిక్షణ కేంద్రం(పీటీసీ)లో శిక్షణ పొందుతున్న 218 కానిస్టేబుళ్లతో సీడ్ బాల్స్ తయారీని మొదలు పెట్టారు. వరంగల్ పీటీసీ ఆధ్వర్యంలో 10 లక్షల సీడ్ బాల్స్ తయారు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే లక్ష సీడ్ బాల్స్ తయారు చేశారు. హరితహారంలో భాగంగా వచ్చే వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. సీడ్ బాల్స్‌ను వరంగల్ అర్బన్, జనగామ తదితర జిల్లాల్లో వినియోగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏమిటీ విత్తన బంతులు.. ప్రత్యేకంగా సంరక్షణ అవసరం లేకుండా, ప్రకృతి సిద్ధంగా త్వరగా పెరిగే చెట్ల రకాలకు విత్తనబంతుల పద్ధతిని అమలు చేస్తారు. మన రాష్ట్రంలో కానుగ, వేప, అల్లనేరేడు, సీమరూప, రావి, మర్రి, నమిలినార రకాలను సీడ్ బాల్స్ పద్ధతిలో పెంచా లని నిర్ణయించారు. అటవీ శాఖ ఈ రకాల విత్తనాలను భారీగా సేకరించి వరంగల్ పోలీసులకు ఇచ్చింది. జల్లెడ పట్టిన ఎర్రమట్టిని సరఫరా చేస్తోంది. 75 శాతం ఎర్రమట్టి, 25 శాతం పేడ ఎరువును మిశ్రమంగా చేస్తారు. ఈ మిశ్రమాన్ని కలిపి వారం పాటు మురుగబెడతారు. అనంతరం జీవామృతం (ఆవుమూత్రం, ఆవుపేడ, బెల్లం, శనగపిండి)తో మిశ్రమాన్ని ముద్దలుగా తయారు చేస్తారు. ఈ మట్టిముద్దల్లో విత్తనాలను పెట్టి ఆరబెట్టి.. గట్టిపడిన తర్వాత ఫారెస్ట్ సిబ్బంది తీసుకెళతారు. తొలకరి వర్షాలు పడిన తర్వాత వీటిని కందకాలు, గుట్టలు, పర్వతాలు, సాగుకు పనికిరాని భూముల్లో విసురుతారు. అటవీ జాతి మొక్కలే కావడంతో సీడ్ బాల్స్ నుంచి మొక్కలు సులువుగా మొలకెత్తుతాయి. మంచి ఫలితాలు.. హరితహారంలో గ్రామాలు, పట్టణాలు, నగరాలు, రహదారుల వెంట మాత్రమే మొక్కలు నాటుతున్నారు. వేసవిలో వీటిసంరక్షణ కష్టతరం. ఎండల తీవ్రత, నిర్వహణ లోపాలతో భారీగా మొక్కలు చనిపోతున్నాయి. మరోవైపు మొక్కల సంరక్షణలో ఇబ్బందులులేని గుట్టలు, పర్వత ప్రాంతాల్లో కొత్తగా మొక్కలు నాటడం తక్కువగా ఉంటోంది. రిటైర్డ్ఐఏఎస్ అధికారి అమరనారాయణ దీనిని గమనించి సీడ్ బాల్స్ ఆలో చన అమలు చేశారు. తన సర్వీసులో మూడేళ్లపాటు పాఠశాల విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలసి సీడ్‌బాల్స్‌ను బోడి గుట్టల్లో వేయించి మంచి ఫలితాలు సాధించారు. పచ్చదనం పెరగాలి.. సీడ్‌బాల్స్‌ను మన రాష్ట్రంలో తొలి సారి మేమే అమలు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కువ స్థాయిలో వర్షాలు రావాలని మా ఆకాంక్ష. ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటి పచ్చదనం పెరిగితేనే ఇది సాధ్య మవుతుంది. – జి.సుధీర్‌బాబు,వరంగల్ పోలీస్ కమిషనర్