సాక్షి, అమరావతి: విపరీతంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు.. పచ్చదనాన్ని పెంచేందుకు కొండ ప్రాంతాల్లో సీడ్ బాల్ టెక్నాలజీ ద్వారా భారీగా మొక్కలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అటవీ ప్రాంతం వెలుపల కూడా 33 శాతం వృక్ష సంపదను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాలతో సంబంధం లేకుండా మైదాన ప్రాంతాల్లో ఉండే రెవెన్యూ కొండలపై భారీ స్థాయిలో మొక్కల పెంపకం చేపట్టనుంది. సాధారణంగా రోడ్లకిరువైపులా ఒక్కొక్క మొక్క పెంపకానికి మూడేళ్లలో రూ.300 వరకు ఖర్చవుతోంది. దీనికి భిన్నంగా రెవెన్యూ కొండలపై పెంచే ఒక్కొక్క మొక్కకు కేవలం ఒక్క రూపాయి కంటే తక్కువ ఖర్చే కానుంది. ఇందుకోసం సరికొత్త ‘సీడ్ బాల్స్’ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత 2021–22 ఆర్థిక సంవత్సరంలో 5 –6 వేల హెక్టార్లలో ఈ విధానంలో కొండ ప్రాంతాల్లో మొక్కల పెంపకం చేపట్టనుంది. రానున్న సంవత్సరాల్లో మొత్తం 25 వేల హెక్టార్లలో కొండలపై భారీగా మొక్కలను పెంచనుంది. ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామీణాభివృద్ధి శాఖ ఈ కార్యక్రమం చేపడుతోంది.
సీడ్ బాల్ విధానంలో మొక్కల పెంపకం ఇలా..
సీడ్ బాల్ విధానంలో.. ఎర్రమట్టి, బంక మట్టి కలగలిపిన మిశ్రమాన్ని 1.5 అంగుళాల నుంచి రెండు అంగుళాల సైజులో బంతి రూపంలో చిన్న ఉండలు చేస్తారు. ఆ బంతిపై చిన్న రంధ్రం చేసి 2–3 విత్తనాలు పెట్టి యథాతథంగా మారుస్తారు. తర్వాత ఆ మట్టి బంతులను 24 గంటల నుంచి 48 గంటల పాటు నీడలో ఆరబెడతారు. నాలుగైదు రోజుల తర్వాత కొండలపై నేరుగా చల్లుతారు. ఒక్కొక్క సీడ్ బాల్ తయారీకి అర్ధ రూపాయి.. వాటిని చల్లడానికి మరో అర్ధ రూపాయి కలిపి రూపాయికి మించి ఖర్చు కాదని అధికారులు తెలిపారు.
మొలక వచ్చే వరకు సీడ్ బాల్‌లో విత్తనం సేఫ్..
కొండలపై సీడ్ బాల్స్‌ను చల్లాక వర్షాకాలంలో మొలక వచ్చే వరకు అందులో విత్తనం భద్రంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఉపాధి హామీ పథకం కూలీల ద్వారా.. లేకుంటే డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్‌ను కొండలపై చల్లిస్తామని తెలిపారు. సీడ్ బాల్స్ అన్నీ ఒకే చోట పడకుండా ప్రతి రెండు మీటర్ల దూరంలో అర అడుగు లోతు, అర అడుగు వెడల్పుతో సన్నని గాడులు తీస్తారు. రాళ్ల గుళ్లలు ఉన్నచోట సీడ్ బాల్స్‌ను చల్లుతారు. చల్లే సమయంలో బాల్స్ పగలకుండా తగిన చర్యలు తీసుకుంటారు.
ఒక్కో హెక్టార్ పరిధిలో 2,000 నుంచి 2,500 సీడ్ బాల్స్..
ఒక్కో హెక్టార్ పరిధిలో 2000–2500 సీడ్ బాల్స్ పడేలా చల్లే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ వేసవిలో ఉపాధి హామీ పథకం నిధులతో 1.10 కోట్ల సీడ్ బాల్స్‌ను తయారు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, విశాఖ జిల్లాల్లో పది లక్షల చొప్పున.. తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడున్నర లక్షలు చొప్పున, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, పశ్చిమగోదావరి, విజయనగరం, కృష్ణా జిల్లాల్లో ఐదు లక్షల చొప్పున సీడ్ బాల్స్‌ను వర్షాకాలం ప్రారంభం నాటికి అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. సీడ్ బాల్స్ విధానంతోపాటు ఉపాధి హామీ పథకం నిధులతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొండ ప్రాంతాల్లో మరో కోటి మొక్కలను నేరుగా నాటడానికి వేరుగా కార్యాచరణను సిద్ధం చేసుకున్నామని అధికారులు తెలిపారు.
సీడ్ బాల్స్‌తో ఉష్ణోగ్రతలకు చెక్!
Published Sun, Apr 11 2021 3:34 AM | Last Updated on Sun, Apr 11 2021 3:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment