బస్సు కిందపడి యువకుడు మృతి | The young man killed in the bus accident | Sakshi
Sakshi News home page

బస్సు కిందపడి యువకుడు మృతి

Published Mon, Nov 17 2014 1:58 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

బస్సు కిందపడి యువకుడు మృతి - Sakshi

బస్సు కిందపడి యువకుడు మృతి

టేకులపల్లి: హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు కిందపడి టేకులపల్లికి చెందిన యువకుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటనకు సంబంధించి, ఆ యువకుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాలు: టేకులపల్లిలో నివసిస్తున్న రైతు దంపతులు గుగులోత్ సుక్యా-సుగుణ పెద్ద కుమారుడు సంతోష్ రాజు(25) పీజీ పూర్తి చేశాడు. గ్రూప్స్ పరీక్షలు రాసి ఉన్నతోద్యోగం సాధించేందుకని మూడు నెలల కిందట హైదరాబాద్ వెళ్లాడు.

అక్కడ మెహిదీపట్నంలో ఓ అద్దె గదిలో ఉంటూ, అశోక్‌నగర్‌లోని రాజిరెడ్డి ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నాడు. రోజులాగానే శనివారం కూడా అశోక్ నగర్ చౌరస్తా వద్ద మెట్రో బస్సు ఎక్కబోతూ, కాలు జారి బస్సు వెనుక టైరు కింద పడ్డాడు. అతడు తీవ్ర గాయూలతో ఆస్పత్రిలో మృతిచెందాడు.
 
రెండు గంటలపాటు అందని వైద్యం
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే సంతోష్ రాజును ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ముందుగా డబ్బు కట్టనిదే చికిత్స చేయలేమంటూ అక్కడి వైద్యులు చెప్పారు. రెండు గంటల తరువాత సంతోష్ రాజు బంధువు వచ్చి ఆస్పత్రిలో డబ్బు జమ చేసిన తరువాతనే చికిత్స మొదలైంది. ‘‘ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే  సకాలంలో వైద్యం అందకపోవడంతోనే సంతోష్ మృతిచెందాడు’’ అని, అతడి తల్లిదండ్రులు ఆరోపించారు.

హైదరాబాద్ నుంచి ఆదివారం సాయంత్రం టేకులపల్లికి చేరినమృతదేహాన్ని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జడ్పీటీసీ సభ్యుడు లక్కినేని సురేందర్‌రావు, ఎంపీపీ భూక్య లక్ష్మి, సర్పంచ్ ఇస్లావత్ పార్వతి, వివిధ పార్టీల నాయకులు సందర్శించారు.అతని కుటుంబీకులకు సానుభూతి తెలిపారు. సంతోష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement