
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 8–9 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తుందన్న నమ్మకం తమకుందని, కచ్చితంగా 5 స్థానాల్లో విజయం సాధిస్తామని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతోపాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా కుమారుడు రాహుల్‌ను ప్రధాని చేయాలన్న ఆకాంక్షతో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేశారన్నారు. బీజేపీకి దక్షిణ తెలంగాణ మొత్తం కలిపి కూడా 10 స్థానాల కన్నా ఎక్కువ రావని, దేశ ప్రజలు 23న బీజేపీకి గట్టి బుద్ధి చెప్పబోతున్నారన్నారు.
విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను చేసిన అభివృద్ధిని చెప్పుకోకుండా రాహుల్ కుటుంబంపై విమర్శలకు మోదీ పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి గతంలోనూ గాడ్సేకి పాలాభిషేకం చేసి మహాత్మాగాంధీ చిత్రపటాన్ని కాల్చివేశారని, ఇప్పుడు గాంధీని చంపిన గాడ్సేని దేశభక్తుడని అన్నారని విమర్శించారు. ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment