నమ్మితే నట్టేటికే.. | There has been forged in the Gulf of agents | Sakshi
Sakshi News home page

నమ్మితే నట్టేటికే..

Published Thu, Dec 25 2014 1:07 AM | Last Updated on Tue, Aug 21 2018 3:10 PM

నమ్మితే నట్టేటికే.. - Sakshi

నమ్మితే నట్టేటికే..

సిరిసిల్ల రూరల్: నకిలీ గల్ఫ్ ఏజెంట్ల దందా సిరిసిల్లలో మళ్లీ మొదలైంది. అనుమతి లేకుండానే గల్ఫ్ ట్రావెల్స్ కార్యాలయాలు నెలకొల్పి ఇంటర్వ్యూలు నిర్వహించే స్థాయికి చేరింది. విదేశాల్లో మంచి ఉద్యోగం.. వేలల్లో జీతాలు అంటూ పలు కేబుల్ టీవీల్లో ప్రకటనలు గుప్పిస్తూ నిరుద్యోగులకు ఎరవేస్తున్నారు. వీటిని నమ్మి పలువురు నిరుద్యోగ యువకులు గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు రూ.లక్షలు అప్పు చేసి నకిలీ ఏజెంట్ల చేతిలో పెడుతున్నారు. ఎలాగో అలా యువకులను గల్ఫ్‌కు పంపించినా అక్కడి కంపెనీల్లో కనీస వేతనాలు లేకపోవడం, ఏజెంట్లు చెప్పిన మాటలకు అక్కడి పరిస్థితులకు పొంతన లేకపోవడంతో తాము మోసపోయామనే విషయాన్ని గ్రహించి లబోదిబోమంటున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అక్కడ పనిలేక, తినేందుకు తిండిలేక, తలదాచుకునేందుకు ఆశ్రయం లేక, స్వదేశం వద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేక విలవిలాడుతున్నారు.
 
 తాజాగా సిరిసిల్ల డివిజన్‌లోని చందుర్తికి చెందిన శ్రీనివాస్, ఇదే మండలం రుద్రంగికి చెందిన కట్కూరి రాజలింగం, మల్యాలకు చెందిన సాగర్, అనిల్, బిట్ల సుమన్, సిరిసిల్ల మండలం బస్వాపూర్‌కు చెందిన బాలసాని శ్రీనివాస్, ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లికి చెందిన మధు, మెదక్ జిల్లాకు చెందిన ఎల్లం నకిలీ గల్ఫ్ ఏజెంట్ మోసానికి బలయ్యారు. వీరికి మాయమాటలు చెప్పి మలేషియా పంపించగా, అక్కడ ఏజెంట్ చెప్పిన పని లభించక, తిరిగివచ్చే దారి లేక దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు. తాము అనుభవిస్తున్న కష్టాలను వివరిస్తూ కుటుంబసభ్యులకు, మీడియా ప్రతినిధులకు ఫోన్లు చేయడంతోపాటు లేఖలు రాశారు. దీంతో సిరిసిల్ల ప్రాంతంలో గల్ఫ్ ఏజెంట్ల దందా మరోసారి చర్చనీయాంశమైంది.
 
 బాధిత కుటుంబసభ్యుల ధర్నా
 ఆగ్రహానికి గురైన బాధితుల కుటుంబసభ్యులు సిరిసిల్ల మండలం చంద్రంపేటలోని గల్ఫ్ ఏజెంట్ నవీన్‌గౌడ్ ఇంటెదుట మంగళవారం ధర్నా చేశారు. మలేషియాలో ఉన్న తమ వారికి ఏం జరిగినా నువ్వే బాధ్యత వహించాలని నవీన్‌గౌడ్‌ను హెచ్చరించారు. బాధితులు వారం రోజుల్లో ఇండియాకు వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటానని ఏజెంట్ హామీ ఇచ్చాడు. వారం రోజుల్లో తమ వారిని రప్పించకుంటే నీ ఇంటి ముందు టెంట్ వేసి దీక్ష చేస్తామని బాధితుల కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

 సిరిసిల్లలో గల్ఫ్ ఇంటర్వ్యూలు
 నాలుగు నెలల వ్యవధిలో సిరిసిల్ల పట్టణంలో మూడు గల్ఫ్ ఏజెంట్ల కార్యాలయాలు వెలిశాయి. ఈ కార్యాలయాల్లోనే నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాల పేరిట ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఒకరికే మాత్రమే ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అనుమతి ఉన్నట్టు తెలిసింది. మిగతా వారు నిబంధనలు విరుద్ధంగా ఈ దందా నిర్వహిస్తున్నట్లు సమాచారం. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల కోసం సంప్రదించండి.. అంటూ టీవీల్లో తమ ఫోన్ నంబర్లతో ప్రకటనలు ఇస్తున్నారు. అనుమతి ఉన్న ఏజెంట్లు మాత్రమే ఇంటర్వ్యూలు, ఇమిగ్రేషన్, ట్రావెల్స్ వంటివి నిర్వహించాల్సి ఉంటుంది.
 
 
 కానీ పలువురు ట్రావెల్స్‌ల పేరిట, వ్యక్తిగతంగా గల్ఫ్ ఏజెంట్లుగా చె లామణి అవుతూ మోసాలకు పాల్పడుతున్నారు. సిరిసిల్లలో పాతబస్టాండ్, కొత్తబస్టాండ్ ప్రాంతాల్లో ఈ కార్యాలయాలు వెలిశాయి. ఈ విషయమై సిరిసిల్ల సీఐ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా.. సిరిసిల్లలో ఇంటర్వ్యూలు ఒకరు మాత్రమే నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వారు సంబంధిత ఏంబసీ నుంచి అనుమతి పత్రాలు తీసుకువచ్చి ఠాణాలో సమర్పించారని తెలిపారు. అనుమతి లేకుండా ఎవరైనా గల్ఫ్ ఏజెంట్లుగా చెలామణి అవుతూ మోసాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
 
 నకిలీ  ఏజెంట్లపై కేసు
 ఎలిగేడు : కంపెనీ వీసాపై ఇరాక్‌కు పంపిస్తామని డబ్బులు తీసుకుని టూరిస్టు వీసాపై పంపిన నలుగురు లెసైన్స్‌లేని ఏజెంట్లపై కేసు నమోదు చేసినట్లు జూలపల్లి ఎస్సై భాస్కర్‌రావు తెలిపారు. ఎలిగేడుకు చెందిన కుడుదుల రాంబాబు, కుడుదుల గౌతమ్, చెర్ల దుబ్బయ్య, లచ్చయ్య అదే గ్రామానికి చెందిన గుజ్జుల రాజేశంతో పాటు మరో ఏడుగురిని మోసగించి ఒక్కొక్కరి నుంచి రూ.1.60 లక్షలు తీసుకుని ఇరాక్‌లో మంచి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. అక్కడికి వెళ్లాక పనులు లేకపోవడంతో రాజేశం సహా ఏడుగురు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుజ్జుల రాజేశం ఫిర్యాదుకేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
 
 సర్కారు స్పందించాలె
 మలేషియాకు వచ్చే భారతీయులను బానిసలుగా, పని యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారు. ఇక్కడ తినడానికి తిండి సరిగా లేదు. మురికి నీరే దిక్కు. మా బాధలు చెప్పినా ఎవరూ పట్టించుకునేవారు లేరు. ఏజెంట్ మాటలు నమ్మి కంపెనీ నుంచి బయటకు వచ్చినం. ఇప్పుడు అటు కంపెనీకి వెళ్లలేక, ఇండియా రాలేక గోసవడుతున్నం. తెలంగాణ ప్రభుత్వం చొరవచూపి మమ్మల్ని స్వదేశం చేర్చాలే.  - సాగర్, మల్యాల
 
 మాలాగా మోసపోవద్దు
 టీవీలో యాడ్ చూసి మాలాగా మరెవరూ మోసపోవద్దు. ఆ యాడ్‌ను వెంటనే ఆపివేయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. లేకుంటే నకిలీ ఏజెంట్లు నిరుద్యోగుల వద్ద నుంచి లక్షల్లో వసూలు చేసి మోసం చేస్తరు. ఏజెంటు మాటలు నమ్మి వచ్చినందుకు మా బాధలు అంతా ఇంతా కాదు. మా పాస్‌పోర్టులు ఇప్పించి ఇండియాకు వచ్చేలా చూడండి.
 - బూర అనిల్, మల్యాల
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement