మంటగలిసిన మానవత్వం..!
కాజీపేట: కుటుంబసభ్యురాలి మరణంతో పుట్టెడు దుఃఖం లో ఉన్న ఓ కుటుంబాన్ని అద్దె ఇంటి యజమాని ఇంట్లోకే రానివ్వలేదు. దీంతో ఆ కుటుంబం శ్మశానవాటిక ఎదుటే టెంట్ వేసుకొని రాత్రంతా గడపాల్సి వచ్చింది. ఈ సంఘటన వరంగల్ నగరంలోని కాజీపేటలో శనివారం రాత్రి జరిగింది. బాపూజీనగర్‌కు చెందిన సుమన్ బారుు(70) రైల్వే మాజీ ఉద్యోగి భార్య. ఆమెకు నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు అమర్‌గాంధీ వికలాంగుడు. కోడలు కిరణ్ కిరాణా దుకాణంలో పనిచేస్తూ ఆ కుటుంబాన్ని పోషిస్తోంది.
వీరు బాపూజీనగర్‌లో అద్దెకు ఉంటున్నారు. సుమన్ బారుు అనారోగ్యంతో శనివారం సాయంత్రం మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు యత్నించగా ఇంటి యజమానురాలు అభ్యంతరం తెలిపింది. అంత్యక్రియలు ముగిశాక రావాలని చెప్పింది. స్థానికుల సహాయంతో రాత్రంతా శ్మశానవాటిక వద్ద ఫ్రీజర్‌బాక్స్‌లో మృతదేహాన్ని భద్రపరిచారు. మరు నాడు అంత్యక్రియలు నిర్వహించారురు.