
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన 711 గ్రామాల్లో మొదటి విడత రైతుబంధు చెక్కుల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. భూరికార్డుల సమాచారం సరిగా లేకపోవడమే ప్రధాన కారణమని అధికారులు అంటున్నారు. ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత రైతుబంధు చెక్కుల పంపిణీ చేపట్టనున్న విషయం తెలిసిందే. మొదటి విడతలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మినహా మిగిలిన 28 జిల్లాలకు చెందిన 3,302 గ్రామాల్లో 16.36 లక్షలమంది రైతులకు రూ.1,602 కోట్ల చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఇటీవల కలెక్టర్లకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీని కోసం వ్యవసాయశాఖ మూడు విడతలుగా రైతుల సమాచారాన్ని బ్యాంకులకు అందజేసింది. వాస్తవంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సమాచారాన్ని వ్యవసాయశాఖకు రెవెన్యూశాఖ మొదట్లో పంపిందని, వాటిల్లో వ్యవసాయ భూములని పేర్కొన్న అనేకచోట్ల భవనాలు, ఇతరత్రా వాణిజ్య సముదాయాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ సమాచారం గందరగోళంగా ఉండడంతో రెవెన్యూశాఖకు తిప్పి పంపినట్లు సమాచారం.
12, 13, 14 తేదీల్లో జిల్లా అధికారులకు చెక్కులు
ఈ నెల 12, 13, 14 తేదీల్లో మొదటి విడత చెక్కులను జిల్లాలకు చేరవేసేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేసింది. ఆయా తేదీల్లో బ్యాంకులవారీగా హైదరాబాద్‌లో నిర్ణీత ప్రదేశంలో చెక్కుల పరిశీలనకు రావాలని జిల్లా, మండల అధికారులను పార్థసారధి ఆదేశించారు. మూడో విడతకు చెందిన 2,064 గ్రామాల డేటాను సోమవారం ఆయన బ్యాంకులకు అందజేశారు.