బీ-థర్మల్ కేంద్రం.. ఓ ప్రయోగశాల! | thermal power plant with a capacity | Sakshi
Sakshi News home page

బీ-థర్మల్ కేంద్రం.. ఓ ప్రయోగశాల!

Published Sun, Feb 15 2015 3:08 AM | Last Updated on Wed, Sep 5 2018 1:47 PM

thermal power plant with a capacity

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రామగుండంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యం గల బీ-థర్మల్ విద్యుత్ కేంద్రం అధికారులకు ప్రయోగశాలగా మారింది. మరమ్మతులు, ఆధునికీకరణ పనుల పేరిట గతేడాది సెప్టెంబర్ 14న ఈ విద్యుత్ కేంద్రాన్ని నిలిపివేసిన అధికారులు.. ఐదు నెలలు పూర్తరుునా పునరుద్ధరణ చేయలేకపోయారు. ఫలితంగా ప్రతిరోజూ 1.5 మిలియన్ యూనిట్ల చొప్పున గత 150 రోజులుగా రూ.కోట్ల విలువైన విద్యుత్‌ను నష్టపోవాల్సి వస్తోంది.
 
  కరెంటు కష్టాల నుంచి బయటపడేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు బృహత్తర ప్రణాళికలు రూపొందిస్తున్న తరుణంలో రామగుండంలో పనిచేస్తున్న థర్మల్ కేంద్రంలో ఐదు నెలలుగా ఉత్పత్తిని నిలిపివేయడం గమనార్హం. దీనివల్ల ప్రభుత్వంపై ఇప్పటి వరకు సుమారు రూ.వంద కోట్ల భారం పడింది. ఈ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభిస్తారనేది సంబంధిత అధికారులు సైతం చెప్పలేకపోతున్నారు. దీంతో బీ-థర్మల్ కేంద్రం కొనసాగింపుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నారుు.
 
 45 రోజుల గడువు.. 150రోజులైనా నెరవేరని లక్ష్యం
 జెన్‌కో విద్యుత్ కేంద్రాల్లో అతి పురాతమైనది
 రామగుండం థర్మల్ కేంద్రం. 250 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం అంచనాతో ఐదు దశాబ్దాల క్రితం బీ-థర్మల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ 62.5 మెగావాట్ల సామర్థ్యానికే పరిమితమైంది. గత కొన్నేళ్లుగా ఇందులో విద్యుత్ ఉత్పత్తికి తరచూ ఆటంకాలు ఏర్పడటంతో దీనిని ఆధునికీకరించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్ర భుత్వం నిర్ణయించింది. కీలక విభాగాలైన బా యిలర్, టర్బయిన్‌లతోపాటు కంట్రోల్‌రూం డిస్ట్రిబ్యూట్ కంట్రోల్ సిస్టం (డీసీఎస్) డిజిటలైజేషన్ చేసేందుకు ప్రణాళికలు రూపొందించా రు. అందుకోసం రూ.40 కోట్ల నిధులు కూడా విడుదలవడంతో పరికరాలను కొనుగోలు చేశారు. 45 రోజుల్లో పునరుద్ధరించే లక్ష్యంతో థర్మల్ కేంద్రంలో ఉత్పత్తిని నిలిపివేశారు.
 
  ఇప్పటికి 150రోజులు పూర్తయినా ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. దశాబ్దాల నాటి యంత్రాలు కావడంతో ఆ డిజైన్‌కు సరిపడా పరికరాలను కొనుగోలు చేయలేకపోవడం, పనుల్లో నాణ్యత లోపించడం, కొందరు అధికారుల నిర్లక్ష్యం, మరికొందరు అధికారుల స్వార్థపూరిత ఆలోచనల కారణంగా పునరుద్ధరణతో తీవ్ర జాప్యం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు విద్యుత్ కేంద్రాన్ని ఉత్పత్తి దశలోకి తీసుకువచ్చేందుకు రూ.కోటికి పైగా విలువైన ఆయిల్‌ను కాల్చినట్లు అధికారులు వెల్లడించారు.
 
 ఉన్నతాధికారుల అసంతృప్తి
  రామగుండం థర్మల్ కేంద్రం పునరుద్ధరణ పనుల్లో జాప్యంపై ‘సాక్షి’లో పలు వరుస కథనాలు ప్రచురితమవడంతో ఉన్నతాధికారులు దృష్టి సారించారు. జెన్‌కో డెరైక్టర్ (థర్మల్) సచ్చిదానందం నెల రోజుల క్రితం థర్మల్ ప్లాం ట్‌ను సందర్శించి అధికారులతో సమావేశమయ్యారు. పనుల పురోగతి, ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను చర్చించారు. వాటిని అధిగమించేందుకు పలు సూచనలిచ్చారు. డెరైక్టర్ సూచనల మేరకు పనులు చేపట్టిన అధికారులు విద్యుత్ కేంద్రాన్ని పునరుద్ధరించి ఉత్పత్తి దశలోకి తీసుకువచ్చారు. అయితే మూడు రోజు లుగా నిరాటంకంగా నడిచిన క్రమంలో ఒక్కసారిగా టర్బయిన్ బేరింగ్‌లో ఆయిల్ ఫైర్ కావడంతో పెద్ద ఎత్తున మంటలు లేచాయి. తక్షణ మే స్పందించిన అధికారులు ఒక్కసారిగా వి ద్యుత్ కేంద్రాన్ని షట్‌డౌన్ చేశారు.
 
 ఆ సమయంలో అప్రమత్తంగా వ్యవహరించకుంటే విద్యుత్ కేంద్రం లాకౌట్ అయ్యే అవకాశముం డేదని అధికారులు తెలిపారు. దీనిపై మరోసారి జెన్‌కో డెరైక్టర్ సచ్చిదానందం విద్యుత్ కేంద్రా న్ని పర్యవేక్షించి అధికారుల వ్యవహరించిన తీ రుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అసహనం వ్యక్తం చేయడంతోపాటు మూడు రోజుల్లోగా ఉత్పత్తి దశలోకి తీసుకురావాలని ఆదేశించి వెళ్లిపోయారు. అరుునప్పటికీ ఇంతవరకు పునరుద్ధరణ పనులు కొలిక్కిరాలేదు. టర్బయిన్  పనులను చేపట్టిన జెప్సిల్ కంపెనీ ప్రతినిధులు ప్లాంట్‌ను సందర్శించి పునరుద్ధరణకు పెద్ద ఎత్తున వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీంతోపాటు కంట్రోల్‌రూంలో డీసీఎస్ పనులు ఇంకా 40శాతం మేరకు పూర్తి కావాల్సి ఉందని తెలుస్తోంది.
 
 ఆధునికీకరణ పేరుతో అత్యుత్సాహం
 జెన్‌కో అధికారుల అత్యుత్సాహం, అక్రమ రాబడిని దృష్టిలో ఉంచుకొనే ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు విద్యుత్ సౌ ద అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. ఉమ్మడి ప్రభుత్వ హయంలోనే ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించినప్పటికీ అది కార్యరూపం దా ల్చలేదు. విద్యుత్ కొరత లేని సమయంలో ఈ థర్మల్ కేం ద్రాన్ని నిలిపివేయాలని భావించడం వల్ల అది సాధ్యం కాలే దు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యుత్ కొరత తీవ్రమైన సంగతి తెలిసింది. అయినప్పటికీ మరికొంత కాలం వేచిచూడకుండా కరెంట్ సంక్షోభం నెలకొన్న సమయంలోనే బీ-థర్మల్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. 45 రోజుల్లోగా ఆధునికీకరణ పనులు పూర్తి చేయడంతోపాటు బీ-థర్మల్ నుంచి తక్కువ ఖర్చుతో మరింత నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తిని సాధిస్తామని పేర్కొన్న అధికారులు ఇంతవరకు ఆ పనిచేయలేకపోయారు.
 
 రూ.100 కోట్లు నష్టపోయిన తెలంగాణ ప్రభుత్వం
 ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలను నివారించేందుకు పక్క రాష్ట్రాల నుంచి యూనిట్‌కు గరిష్టంగా రూ.9 చొప్పున కొనుగోలు చేస్తోంది. వాస్తవానికి బీ-థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ యూనిట్ ధర గరిష్టంగా రూ.4కు మించదని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం బయట నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయడం వల్ల ఒక్కో యూనిట్‌కు రూ.5 చొప్పున అదనపు భారం పడుతోంది. రామగుండం ప్రతీ రోజు 1.5 మిలియన్ యూనిట్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న బీ-థర్మల్ కేంద్రం 150రోజులుగా నిలిచిపోయినందున సుమారు 21 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లే. ఈ మొత్తాన్ని బయటి నుంచి కొనుగోలు చేయడం ద్వారా రూ.100 కోట్ల మేరకు ప్రభుత్వం నష్టపోయినట్లయింది. ఉద్యోగుల జీతాల భారం రూ.7.5 కోట్ల పైమాటే.
 
 మూడేళ్లుగా మూలుగుతున్న ఈఎస్‌పీ
 విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే రసాయన, బూడిద తదితర వ్యర్థ పదార్థాలను అరికట్టి వాతావరణ పరిస్థితులను సక్రమంగా ఉంచేందుకు మూడేళ్ల క్రితం రూ.40కోట్లతో ఎలక్ట్రో స్టాటిక్ ప్రిసిబిరేటర్ (ఈఎస్‌పీ) యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని విద్యుత్ కేంద్రానికి అనుసంధానించాలంటే కనీసం పది రోజులపాటు ప్లాంట్‌ను షట్‌డౌన్ చేయాల్సి ఉంటుంది. ఈ కారణంతో గత మూడేళ్లుగా ఈఎస్‌పీనీ నిరుపయోగంగానే ఉంచారు. ప్రస్తుతం ఆధునికీకరణ పనులు జరుగుతున్న తరుణంలో దీనిని అనుసంధానిస్తే సమయం కలిసొస్తుందని తెలిసినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.
 
 పట్టించుకోని సర్కారు..
 తెలంగాణ ప్రభుత్వం సంస్కరణల పేరుతో అన్ని సంస్థలను ప్రక్షాళన చేస్తున్నప్పటికీ ప్రస్తుతం విద్యుత్ సంక్షోభం ఉన్నప్పటికీ దీనిపై ఎందుకు దృష్టిసారించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీ-థర్మల్ విద్యుత్ కేంద్రం ఐదు మాసాలుగా నిలిపివేసిన చరిత్ర గత 50 ఏళ్లలో ప్రథమం. ఇదేక్రమంలో బీ-థర్మల్ లాకౌట్ అయితే రామగుండం అంధకారమే అవుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement