సాక్షి, కరీంనగర్: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసింది. దేవాలయ అభివృద్ధికోసం ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్‌డీఎఫ్) కింద ఈ నిధులను మంజూరు చేస్తూ ప్రణాళికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె, రామకృష్ణా రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఉన్న కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయానికి రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల భక్తులూ అధికసంఖ్యలో వస్తుంటారు. ఆలయ అభివృద్ధికి రూ.వంద కోట్లు విడుదల చేస్తామని గత డిసెంబరులో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఈ నిధులను వెచ్చించనున్నారు.
ఉమ్మడి జిల్లాలోని కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న ఆలయాలకు బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యం దక్కినట్లయ్యింది. మొన్న రాజన్న ఆలయానికి రూ.50 కోట్లు కేటాయించిన సర్కారు.. తాజాగా కొండగట్టుకు రూ.100 కోట్లు ప్రకటించింది. దీంతో ఆలయాల అభివృద్ధికి ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న ఘడియలు వచ్చినట్లయ్యింది.
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి..
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 8, 2023
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించిన సీఎం గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి అశేష భక్తజనం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. pic.twitter.com/spGZ3N4NUb
ఎములాడ జంక్షన్ల సుందరీకరణ..
రాజన్న గుడి అభివృద్ధిపై సీఎం కేసీఆర్ 18 జూన్ 2015న స్వయంగా గుడి, పట్టణం కలియ తిరిగారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, ఇందుకు ఏటా రూ.100 కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తామని ప్రకటించారు. ముందుగా రూ.71 కోట్లు మంజూరు చేశారు. అనంతరం వీటీడీఏ ఏర్పాటు చేసి కమిటీనీ ప్రకటించారు. చైర్మన్‌గా సీఎం కేసీఆర్, వైస్ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పురుషోత్తంరెడ్డిని నియమించారు. నిధులను వీటీడీఏ ద్వారానే ఖర్చు చేయాలని జీవో విడుదల చేశారు.
వేములవాడ రాజన్న ఆలయం
ఆ మేరకు ఆలయ అధికారులు రూ.410 కోట్లతో భక్తుల సౌకర్యాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు. గతేడాది, ఈసారి బడ్జెట్‌లో రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు. తాజా నిధులతో బద్దిపోచమ్మ గుడి వద్ద సేకరించిన భూమికి ప్రహరీ, బోనాల మంటపం నిర్మిస్తామని వీటీడీఏ వైస్ చైర్మన్ వెల్లడించారు. నగరమంతా ఫుట్‌పాత్‌ల నిర్మాణం, గుడి ట్యాంక్‌బండ్‌పై వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ పనులు చేపడతామని, నందికమాన్ నుంచి వేములవాడకు చేరుకునే రోడ్డు సుందరీకరణ, జంక్షన్లు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
గోదావరినదిలో పడవల పోటీ(ఫైల్)
కాళేశ్వరం టూరిజం సర్క్యూట్
రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక కాళేశ్వరం.. దాని అనుబంధ ప్రాజెక్టుల వద్ద పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ పేరిట బడ్జెట్‌లో రూ.750 కోట్లు కేటాయించింది. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ, గోదావరిఖని వంతెన, కోటిలింగాల బ్యాక్ వాటర్, లోయర్, మధ్య, ఎగువ మానేరు డ్యామ్‌ల వద్ద పర్యాటక అభివృద్ధికి ఈ నిధులు వెచ్చించనున్నారు. అయితే ఉమ్మడి జిల్లాను పర్యాటక క్షేత్రంగా మలచాలన్న ప్రభుత్వ లక్ష్యం ఎప్పటిలోగా నెరవేరుతుందోనన్న విషయం ఆసక్తికరంగా మారింది.
కొండగట్టు
కొండగట్టుకు మాస్టర్‌ప్లాన్
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి బడ్జెట్‌లో రూ.100 కోట్లు మంజూరు చేశారు. గత డిసెంబరు 7న జగిత్యాల సభలో స్వామివారికి రూ.100 కోట్లు ఇస్తామన్న సీఎం.. సరిగ్గా 50 రోజులకు తన మాట నిలబెట్టుకున్నారు. రానున్న 50 ఏళ్లలో భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాల్సి ఉందని, ప్రత్యేక ప్రణాళికతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు.
నాంపల్లి గుట్ట
నాంపల్లి గుట్టకు రోప్‌వే
వేములవాడను తీర్చిదిద్దే క్రమంలో మంత్రి కేటీఆర్ సూచనల మేరకు నాంపల్లిగుట్టపై రెండో ఘాట్ రోడ్డు నిర్మాణం జరగనుంది. వేములవాడకు వచ్చే కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వేట్రాక్ నాంపల్లి గుట్టను ఆనుకుంటూ వెళ్లనుంది. దీంతో హైదరాబాద్, మేడ్చల్, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నుంచి వచ్చే భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా ఇక్కడి పరిసరాలను తీర్చిదిద్దనున్నారు. ఈ పనులపై కేటీఆర్ ఇప్పటికే సమీక్షించారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment