
►సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన ముగిసింది. కొండగట్టు నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు బయల్దేరారు.
► కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అనంతరం విహంగ వీక్షణం ద్వారా ఆలయ పరిసరాలను ఆయన పరిశీలించారు. 100 కోట్లతో చేపట్టబోయే ఆలయ పునర్నిర్మాణం ప్రతిపాదనలు పనులు, వసతులపై అధికారులతో రెండు గంటలకు పైగా సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు వినిపించాలని అన్నారు.
►దేశంలోనే గొప్పగా హనుమాన్ జయంతి కొండగట్టులో జరగాలని.. భక్తుల హనుమాన్ దీక్షాధారణ, విరమణ చేసే సమయంలో ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. హనుమాన్ దీక్ష దివ్యంగా, గొప్పగా జరిగేలా చూడాలని తెలిపారు.
►ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి బృహత్తర ప్రాజెక్ట్ అని.. భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని తెలిపారు. ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డులను అభివృద్ధి చేయాలన్నారు.
►‘సుమారు 850 ఎకరాలలో ఆలయ అభివృద్ధి , విస్తరణ పనులు చేయాలి. పెద్ద వాల్, పార్కింగ్, పుష్కరిణీ, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరు, పుష్కరిణీ నీ అభివృద్ధి చేయాలి. 86 ఎకరాలలో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలి. వసతులు గొప్పగా ఉంటే దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతారు. మళ్ళీ కొండగట్టు వస్తా.. ఆలయ అభివృద్ధి, విస్తరణపై సమీక్ష నిర్వహిస్తాను’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
► కొండగట్టు ఆలయం వద్ద సీఎం కేసీఆర్‌కు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రులు, ప్రజాప్రతినిథులు, అధికారులతో కలిసి కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించారు.
► ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సీఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కఅంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు దేవాలయానికి బయల్దేరారు. ప్రగతిభవన్ నుంచి బేగంపేటకు చేరుకున్న ముఖ్యమంత్రి.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కొండగట్టు అంజన్న క్షేత్రానికి పయనమయ్యారు. కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు చేరుకొని అక్కడి నుంచి ఆలయానికి వెళ్లనున్నారు. అక్కడ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.
అనంతరం కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించనున్నారు. తరువాత జేఎన్టీయూ వెళ్లి.. అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు-చేర్పులపై సమాలోచనలు జరుపుతారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టే అభివృద్ధి పనులపై ఓ నిర్ణయానికి రానున్నారు.
కాగా కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో 14న సాయంత్రం 4 గంటల నుంచి 15న మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఆలయానికి గత వారమే రూ.100 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే
Comments
Please login to add a commentAdd a comment