గ్రామానికో రూ.2కోట్లు.. జిల్లాకు రూ.4,014 కోట్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మా ఊళ్లో వీధులన్నీ సీసీ రోడ్లు చేయాలి. సీసీ డ్రైనేజీలు నిర్మించాలి. రక్షిత మంచినీటిని అందించేందుకు బోరు.. వాటర్ ట్యాంక్ నిర్మించాలి. పైపులైన్లు వేయాలి. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. చెర్వుకు మరమ్మతులు చేయాలి. పూడిక తీయాలి. కాల్వలు పునరుద్ధరించాలి. పాఠశాలలో టాయిలెట్లు, అదనపు గదులు నిర్మించాలి. ప్రహరీ గోడ కట్టాలి. ‘మన ఊరు-మన ప్రణాళిక’ గ్రామసభల్లో జిల్లావ్యాప్తంగా వెల్లువెత్తిన విన్నపాల్లో ప్రధాన అంశాలివే.
వీటిని సమకూర్చేందుకు సగటున ఒక్కో పల్లెలో ఎంత ఖర్చు అవుతుంది... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్షేత్ర స్థాయి ప్రణాళికలను అమలు చేసేందుకు మన జిల్లాకు ఎంత బడ్జెట్టు కావాలి... అనే అంచనాలు రూపు దిద్దుకుంటున్నాయి. వరుసగా గ్రామసభల్లో వచ్చిన విన్నపాలను అధికారులు క్రోడీకరించి అంచనాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. సర్కారు సూచించిన మార్గదర్శకాల ప్రకారం ప్రాధాన్య క్రమం లో మూడు ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో పొందు పరుచనున్నారు. రమారమి వీటికి ఎంత ఖర్చు అవుతుంది... అని మండల స్థాయిలో అధికారులు అంచనా వ్య యాన్ని నమోదు చేస్తున్నారు.
గ్రామ సభల్లో వచ్చిన డిమాండ్ల ప్రకారం ఒక్కో గ్రామానికి సగటున రూ.2 కోట్లు కావాలని అంచనా వేశారు. పెద్ద గ్రామాల్లోని అవసరాలకు దాదాపు రూ.4 కోట్ల వరకు ఖర్చు అవుతుందని గుర్తించారు. జిల్లాలో మొతం్త 1207 పంచాయతీలున్నాయి. ఈ లెక్కన జిల్లాకు కనీసం రూ.4014 కోట్ల బడ్జెట్టు అవసరమవుతుందని ప్రాథమిక అంచనా. గ్రామ ప్రణాళికలన్నీ క్రోడీకరించిన అనంతరం జిల్లా ప్రణాళిక తయారీ చేస్తారు. దీంతో జిల్లాకు ఎంత బడ్జెట్టు అవసరమవుతుందనేది పక్కాగా లెక్కతేలుతుంది.
క్షేత్రస్థాయి అంచనాలు
చిన్న గ్రామమైతే కనీసం వెయ్యి మీటర్ల సీసీ రోడ్డు వేయాలి. ఇంజినీరింగ్ అధికారుల అంచనా ప్రకారం ఒక్కో మీటర్‌కు రూ.3000 ఖర్చు అవుతుంది. సీసీ మురికి కాల్వ నిర్మాణానికి ఒక్కో మీటర్‌కు రూ.2000 ఖర్చు. నలభై వేల లీటర్ల సామర్థ్యముండే తాగునీటి పథకానికి రూ.20 లక్షలు, 60 వేల లీటర్ల కెపాసిటీ ట్యాంక్‌కు రూ.27 లక్షలు, పైపులైన్లు, బోర్‌కు రూ.20 లక్షలు అవసరమవుతాయి. పూడికతీత, కట్టకు మరమ్మతులు, జంగిల్ క్లియరెన్స్, తూములు, షట్టర్ల మరమ్మతులు.. మొత్తంగా చెరువు అభివృద్ధికి కనీసం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలు అవసరం. ఇదే తీరుగా ప్రత్యేక విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కొత్త విద్యుత్ స్తంభాలకు సంబంధించిన అర్జీలు వెల్లువెత్తాయి. మొత్తంగా ఒక్కో పంచాయతీకి సగటున రూ.2 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరమున్నట్లు మండల స్థాయి అధికారులు లెక్క గట్టారు.
నేటితో ఆఖరు
శుక్రవారం నాటికి జిల్లాలో 1200 గ్రామాల్లో సభలు నిర్వహించారు. హుస్నాబాద్‌లో మిగిలిన అయిదు గ్రామాలు, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట మండలాల్లో మిగిలిన రెండు గ్రామాల్లో శనివారం సభలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సుల్తానాబాద్ మండలంలో ఈ ప్రణాళికల తయారీలో పాలుపంచుకున్నారు. ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం తన నియోజకవర్గంలో జరిగే సభలకు హాజరవనున్నారు. షెడ్యూలు ప్రకారం గ్రామస్థాయి ప్రణాళికలను మరో నాలుగు రోజుల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేసి.. తదుపరి జిల్లా ప్రణాళికను సిద్ధం చేస్తారు.
ప్లాన్ 2005
గ్రామ ప్రణాళికలను మండలంలో.. మండల ప్రణాళికలను జిల్లాలో... జిల్లా ప్రణాళికలను రాష్ట్ర స్థాయిలో ఆమోదించి బడ్జెట్టు రూపకల్పన చేయాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ కార్యక్రమం తలపెట్టింది. 2005లో కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలకు సంబంధించి సూక్ష్మ ప్రణాళికలు తయారు చేయించారు. అన్ని మండలాల్లో అధికారులు ఆగమేఘాలపై వీటిని రూపొందించి స్పైరల్ బైండిగ్ చేయించి కట్టలు కట్టారు.
కానీ.. అప్పటి ప్రభుత్వం వీటికి తగిన ప్రాధాన్యమివ్వకపోవటంతో అధికారుల స్థాయిలోనే అవి అటకెక్కాయి. దీంతో కేసీఆర్ ప్రయత్నం క్షేత్రస్థాయిలోనే ఆగిపోయింది. ఇప్పుడు నవ తెలంగాణ లక్ష్యంతో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అప్పటి తన ఆలోచనకు మరింత పదునుపెట్టి రాష్ట్రస్థాయికి విస్తరించారు. దీంతో భవిష్యత్తు నిధుల కేటాయింపులో ఈ ప్రణాళికల ప్రాధాన్యం కీలకంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.