వివరాలు వెల్లడిస్తున్న సీపీ రవీందర్, స్వాధీనం చేసుకున్న గృహోపకరణ వస్తువులు, కారు,ద్విచక్ర వాహనం
వరంగల్ క్రైం : మహానగరాల్లోని షాపింగ్ మాల్స్‌లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకొని, వందలాది మంది బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను ఆన్‌లైన్ ద్వారా కొల్లగొట్టిన ఘరానా మోసగాడిని వరంగల్ కమిషనరేట్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాద్ రవీందర్ గురువారం కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గుగులోతు విజయ్ ప్రస్తుతం హైదరాబాద్ ఉప్పల్‌లోని బుద్ధనగర్‌లో నివాసముంటున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన గత రెండేళ్లుగా వరంగల్ కమిషనరేట్‌తోపాటు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఆన్‌లైన్ దోపిడీలకు పాల్పడుతున్నాడు.
తొలి కేసును ఛేదించిన సైబర్ క్రైం ల్యాబ్..
వరుసగా జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలపై జేపీఎన్ రోడ్డులోని ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరంగల్ కమిషనరేట్‌లో నూతనంగా అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన సైబర్ క్రైం ల్యాబ్ ద్వారా ఆ విభాగం సీఐ డి.విశ్వేశ్వర్ విచారణ చేపట్టారు. చివరికి నిందితుడిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. నగరంలోని గీసుకొండ, ఇంతేజార్‌గంజ్, పోలీసు స్టేషన్ల పరిధిలో నిందితుడు రూ.5.76 లక్షల మేర ఆన్‌లైన్ మోసాలకు పాల్పడినట్లు సీపీ రవీందర్ తెలిపారు.
రూ.30 లక్షల బంగారం, ఇతర వస్తువులు స్వాధీనం..
నిందితుడి నుంచి 240 గ్రాముల బంగారం, రెండు ఇంటి స్థలాల దస్తావేజులు, ఒక ఐ 20 కారు, ఒక ద్విచక్ర వాహనం, 2 ఏసీలు, 2 కంప్యూటర్లు, 2 వాషింగ్ మిషన్లు, 3 ప్రింటర్లు, ఒక ఫ్రిజ్, ఒక కెమెరా, ఒక ఎల్‌ఈడీ టీవీ, 6 సెల్‌ఫోన్లు, పదికిపైగా వివిధ కంపెనీల సిమ్‌కార్డులు మొత్తం రూ.30 లక్షల విలువగల బంగారం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు.
అధికారులకు అభినందనలు..
వివిధ కమిషనరేట్ల పరిధిలో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు సొమ్మును స్వాధీనం చేసుకున్న సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ డి.విశ్వేశ్వర్, వరంగల్ ఏసీపీ ప్రభాకర్, ఇంతేజార్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, సైబర్ క్రైం సిబ్బంది ప్రశాంత్, సల్మాన్, రాజు, కిషోర్, అంజనేయులు, రత్నాకర్, దినేష్‌ను సీపీ రవీందర్ అభినందించారు.
డబ్బు కాజేసిందిలా..
హైదరాబాద్‌లోని వివిధ కంపెనీల్లో పనిచేసిన విజయ్ బిగ్‌బజార్‌లో వినియోగదారులు గిఫ్ట్ ఓచర్ల ద్వారా వస్తువులను కొనుగోలు చేయడం గమనించాడు. ఆ తర్వాత ఆన్‌లైన్ గిఫ్ట్ ఓచర్ల కొనుగోలు, వినియోగం గురించి అధ్యయనం చేశాడు. అనంతరం వివిధ కంపెనీలకు సంబం ధించిన సిమ్‌కార్డులు తీసుకొని ఇంటర్‌నెట్‌లో పలువురి పేరిట మీద జీమెయిల్స్, ఐడీ కార్డులను క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బీఐకి చెందిన ఏటీఎం మిషన్ల వద్ద వినియోగదారులు క్యూలైన్‌లో ఉండి డబ్బులను డ్రా చేస్తున్న క్రమంలో నిందితుడు ముందున్న ముగ్గురు వ్యక్తులను టార్గెట్ చేసుకొని వారి చేతుల్లో ఉన్న ఏటీఎం నంబర్‌తోపాటు వారు ఎంటర్ చేసే పిన్ నంబర్ గమనించేవాడు.
వెంటనే బయటికి వచ్చి ఏటీఎం నంబర్లు, పిన్‌నంబర్లు రాసుకునేవాడు. ఆ తర్వాత ఇంటర్‌నెట్ సెంటర్‌కు వెళ్లి ఆ ఏటీఎం నంబర్, పిన్ నంబర్‌తో రూ.2 వేలు, వెయ్యి గిఫ్ట్ ఓచర్లు బుక్ చేసేవాడు. అలా బుక్ చేసిన గిప్ట్ ఓచర్లతో నగరంలో ప్రముఖ బిగ్‌బజార్, జోయాలుకాస్, రిలయన్స్ డిటిటల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్‌వంటి షాపుల్లో వస్తువులను కొనుగోలు చేసేవాడు. ఇతడు వరంగల్‌లో 50 మంది, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన సుమారు 500 మంది పేరిట గిఫ్ట్ ఓచర్లు బుక్ చేసి మోసాలకు పాల్పడినట్లు సీపీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment