స్వాధీనం చేసుకున్న ఆభరణాలను పరిశీలిస్తున్న అడిషనల్ డీసీపీ అశోక్‌కుమార్
వరంగల్ క్రైం : వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో తాళం వేసిన ఇళ్లే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడే దొంగ పోలీసులకు చిక్కినట్లు వరంగల్ క్రైం అడిషనల్ డీసీపీ బిల్లా అశోక్‌కుమార్ తెలిపారు. గురువారం సీసీఎస్ పోలీసుస్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా, కంబాలపల్లికి చెందిన బెల్లంకొండ యాకయ్య గత పది సంవత్సరాల క్రితం కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. మద్యంకు బానిసై కూలీ పనులతో వచ్చే డబ్బులు సరిపోకా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనలతో మహబూబాబాద్, కేసముద్రం, నర్సంపేట, నెల్లికుదురు పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో దొంగతనాలకు పాల్పడి అరెస్ట్ అయి జైలు జీవితం గడిపినట్లు డీసీపీ తెలిపారు. గత ఐదు నెలల నుంచి వరంగల్ పోలీస్‌కమిషనరేట్ పరిధిలో రూ.7.20 లక్షల విలువగల 232 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి ఆభరణాలు దొంగిలించినట్లు చెప్పారు. సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో 3 చోరీలు, కేయూసీ, నర్సంపేట, చెన్నారావుపేట, ఖానాపూర్, పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ఒకటి చొప్పున చోరీలకు పాల్పడినట్లు ఆయన వివరించారు.
వరంగల్‌కు వచ్చి..పోలీసులకు చిక్కి...
దొంగలించిన బంగారు, వెండి ఆభరణాలను అమ్మి వచ్చిన డబ్బులతో ఇళ్లు కట్టుకోవాలనే ఆలోచనతో యాకయ్య దొంగిలించిన సొమ్మును ఇంట్లో భద్రపరచుకున్నాడు. మహబూబాబాద్‌లో అమ్మితే అనుమానం వస్తుందని భావించిన అట్టి సొమ్ములను వరంగల్ బులియన్ మార్కెట్‌లో అమ్మేందుకు వచ్చిన సమాచారంతో సీసీఎస్ ఇన్స్‌పెక్టర్ డెవిడ్‌రాజ్ సిబ్బందితో వెళ్లి నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీలకు పాల్పడిన విషయం ఒపుకున్నట్లు ఆయన చెప్పారు. కాగా సకాలంలో నిందితుడిని గుర్తించి సొమ్ము స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన క్రైం అదనపు డీసీపీ బిల్లా అశోక్‌కుమార్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ డేవిడ్ రాజు, ఎస్సై సంపత్, ఏఎస్సై వీరస్వామి, హెడ్‌కానిస్టేబుల్ శివకుమార్, సుధీర్, ఉమామహేశ్వర్, జంపయ్యలను వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment