పార్క్‌హయత్ హోటల్, (ఇన్‌సెట్లో) సీసీ ఫుటేజీలో అనుమానితుడి చిత్రం
హైదరాబాద్: నగరంలోని ఓ ప్రతిష్టాత్మక స్టార్ హోటల్‌లో హైటెక్ చోరీ జరిగింది. సూటుబూటు వేసుకొని వచ్చిన ఓ దొంగ దర్జాగా హోటల్‌లోకి ప్రవేశించి రూ.12 లక్షల విలువ చేసే బంగారు, వజ్ర వైఢూర్యా లు పొదిగిన ఆభరణాలను తస్కరించాడు. హిమ యత్‌నగర్‌కు చెందిన యువ వ్యాపారి వెంకట్ పెళ్లి ఈ నెల 4న జరిగింది. హనీమూన్ కోసం 5వ తేదీన దంపతులు బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లోని పార్క్‌హయత్ హోటల్‌కు వచ్చి 312వ గదిలో బస చేశారు.
ఫలక్‌నుమా ప్యాలెస్ సందర్శన, తాజ్‌హోటల్‌లో డిన్నర్ కోసమని మరునాడు రాత్రి 7 గంటల ప్రాంతంలో దంపతులు బయటకు వెళ్లారు. కాసేపటికి సూటుబూటు వేసుకొన్న ఓ వ్యక్తి ఆటోలో పార్క్‌హయత్ హోటల్‌కు వచ్చాడు. తాను 312లో బస చేసిన వ్యక్తి తాలూకూ బంధువునని, రూమ్‌లో కార్డు మర్చిపోయానని, దానిని తీసుకోవడానికి వచ్చానని చెప్పడంతో హోటల్ సిబ్బంది యాక్సిస్ కార్డు ఇచ్చారు. ఆ కార్డు ఉంటేనే లిఫ్ట్ తెరుచుకుంటుంది.
లిఫ్టులోంచి గది వద్దకు వెళ్లిన ఆగంతకుడు పాస్‌వర్డ్ మర్చిపోయానని రిసెప్షన్‌కు ఫోన్ చేశాడు. కంప్యూటర్‌లో నాలుగు డిజిట్లను సిబ్బంది నొక్కడంతో యాక్సెస్ కార్డు సహాయంతో గది తెరుచుకుంది. లోనికి వెళ్లిన ఆగంతకుడు సూట్‌కేస్‌లోని డైమండ్స్ పొదిగిన చెవి రింగు, నెక్లెస్, పాపిటబిళ్ల, బంగారు కాళ్ల పట్టీలు, జత గాజులు, రూ. 6 వేల నగదును బ్యాగులో సర్దుకొని ఉడాయించాడు. డిన్నర్ ముగించుకొని బుధవారం రాత్రి వెంకట్ దంపతులు హోటల్‌లోని తమ గదికి వచ్చారు. సూట్‌కేస్‌లోని ఆభరణాలు కనిపించలేదు. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి.
వెంటనే హోటల్ సిబ్బందికి, బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజీలు పోలీసులు పరిశీలించగా ఓ ఆగంతకుడు గదిలోనికి వెళ్లి, బయటకు వచ్చిన దృశ్యాలు నమోదయ్యాయి. చోరీకి పాల్పడిన వ్యక్తి చండీగఢ్‌కు చెందిన జయేష్ రావ్‌జీ భాయ్ సేజ్‌పాల్(48)గా గుర్తించారు. స్టార్ హోటళ్లే లక్ష్యంగా అతడు ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరువంటి నగరాల్లో ఈ తరహా దొంగతనాలు 8 వరకు చేసినట్లు తేల్చారు. నిందితుని ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. నగరంలోని అన్ని మార్గా ల్లో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్క్‌హయత్ లాంటి స్టార్ హోటల్‌లో దొంగతనం చోటు చేసుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment