30రోజుల ప్రణాళికతో ఊరు మారింది | Thirty Days Special Action Plan In Medak District | Sakshi
Sakshi News home page

30రోజుల ప్రణాళికతో ఊరు మారింది

Published Tue, Oct 1 2019 9:05 AM | Last Updated on Tue, Oct 1 2019 11:05 AM

Thirty Days Special Action Plan In Medak District - Sakshi

కోనాపూర్‌లో పారిశుధ్య పనుల్లో నిమగ్నమైన మహిళలు

సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టిన 30రోజుల ప్రణాళిక పనులు జిల్లాలోని అన్ని గ్రామాల్లో వేగంగా సాగుతోంది. అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత గ్రామం చింతమడకతోపాటు, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్వగ్రామం తోటపల్లి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి స్వగ్రామం చిట్టాపూర్, మెదక్‌ పార్లమెంట్‌ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామం పోతారంతోపాటు హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ దత్తత గ్రామం గండిపల్లి గ్రామాలు స్వచ్ఛతలో ఒక అడుగు ముందున్నాయని చెప్పొచ్చు. తమ తమ నాయకులను ఆదర్శంగా తీసుకొని గ్రామంలోని నాయకులు, యువత, మహిళా సంఘాలు గ్రామాన్ని శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇతర గ్రామాలకు తమ గ్రామం ఆదర్శంగా నిలవాలని పోటీపడుతున్నారు. అయితే తమ పుట్టిన ఊరిలో పారిశుధ్య పనులు వేగంగా జరగడం, గ్రామాల రూపురేఖలు మారడం సంతోషంగా ఉందని, పరిశుభ్రత కార్యక్రమం నిరంతరంగా జరగాలని కోరుకుంటున్నారు.

శుభ్రమైన చిట్టాపూర్‌ 
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి స్వగ్రామం చిట్టాపూర్‌. గ్రామంలోని పలువీధుల్లో రోడ్లపై ఉన్న చెత్తా చెదారాన్ని తొలగిస్తూ.. చెత్తవేయడంవల్ల జరిగే ఇబ్బందులు, అనర్థాలగురించి వివరిస్తున్నారు. అలాగే గ్రామంలో పాత ఇళ్లను జేసీబీలతో ఇండ్ల యజమానుల అంగీకారంతో కూలగొడుతున్నారు. ఈ గ్రామంలో మొత్తం 112 ఇళ్లు శిథిలావస్థలో ఉండగా అందులో 63 ఇళ్లను యజమానుల అనుమతితో కూల్చివేశామని ఆ గ్రామ సర్పంచ్‌ పోతనక రాజయ్య తెలిపారు. మిగతా 60 ఇళ్లు  వారు పూర్తిగా నిరుపేదలు కావడం వల్ల ఆ ఇళ్లను త్వరలో కూల్చివేస్తామని యజమానులకు గ్రామ పంచాయతీ ద్వారా నోటీసులను కూడా ఇచ్చినట్లు తెలిపారు.  

గ్రామంలో ప్లాస్టిక్‌ ను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. ఇప్పటికే గ్రామంలో బహిరంగంగా మలవిసర్జన చేయకుండా ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డిని నిర్మించినట్లు చెప్పారు. ఇంకుడు గుంతల వల్ల కలిగే లాభాలగురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. చిట్టాపూర్‌ లో భాగంగా గ్రామంలో ఉన్న ఒక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో శ్రమదానం కార్యాక్రమాన్ని నిర్వహించి పాఠశాలల ఆవరణలో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించారు. గ్రామంలో నిర్మంచిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లల్లో కూడా శ్రమదానం నిర్వహించి వీధులన్నింటిని శుభ్రంచేశారు. దోమల నివారణకు మందులను పిచికారీ చేయించి, మురికి కాలువల్లో శుభ్రంగా ఉండటానికి పలు రకాల మందులను చల్లుతున్నారు.

చింతమడకలో పనుల జోరు
సీఎం స్వగ్రామమైన చింతమడక గ్రామంలో 23 రోజులుగా పారిశుధ్య కార్యక్రమాలు సాగుతున్నాయి.  తమ గ్రామ ముద్దుబిడ్డ ఆదేశాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తుంటే మా గ్రామాన్ని మేం సుందరంగా తీర్చుకోవడం సంతోషంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.  గ్రామంలో 720 కుటుంబాలు ఉండగా 2,524 మంది జనాభా ఉన్నారు.  గ్రామంలో ఎక్కడా చెత్తా చెదారం, పిచ్చిమొక్కలు లేకుండా స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం చేపట్టడం. గ్రామంలో  ఉన్న పాత, శి«థిలావస్థలో ఉన్న గోడలు, ఇళ్లను కూల్చివేయడం, ఇళ్ల మధ్యలో ఉన్న  పాడుబడ్డ బావులను పూడ్చివేశారు.  విద్యుత్‌ వైర్లు కిందికి వేలాడడం, ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల వద్ద నెలకొరిగేలా ఉన్న  ప్రమాదపు సమస్యలను పరిష్కరించడం, వ్యవసాయ బావుల వద్ద అవసరమైన ప్రాంతాల్లో కొత్త విద్యుత్‌ లైన్లు వేయించారు.  

గ్రామస్తుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు.  ఇళ్లల్లోని చెత్తాచెదారాన్ని తీసిసే పనిలో అందరు భాగస్వామ్యులయ్యారు.  విశాలంగా ఉన్న ప్రాంతాల్లో పెరిగిన  పిచ్చి మొక్కలను ట్రాక్టర్ల సాయంతో చదును చేశారు.  స్థాయి కమిటీలు, అధికారులు, గ్రామస్తులను  భాగస్వామ్యం చేస్తూ రోజువారిగా గ్రామంలోని వీధులను తిరుగుతూ పరిశీలించడంతోపాటు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరి సహకారం కావాలని కోరుతూ అవగాహన కల్పిస్తున్నారు. దీంతో గ్రామం అంతా స్వచ్ఛంగా తయారైంది. మురికికాల్వలు పూడ్చివేయడంతో దోమల బాధ తప్పిందని గ్రామస్తులు చెబుతున్నారు.

అద్దంలా.. తోటపల్లి
తోటపల్లి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్వగ్రామం. మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ దత్తత గ్రామామైన మండలంలోని తోటపల్లిలో వేగవంతంగా సాగుతున్నాయి. ఈనెల 6 నుంచి గ్రామంలో పారిశుధ్యం, డ్రైనేజీలు శుభ్రం చేస్తున్నారు. ఈ పనులకు ప్రత్యేకంగా నిధులు రాకపోయినా తమ సొంత డబ్బులతో పనులను పూర్తి చేస్తున్నట్లు సర్పంచ్‌ నర్సింగారావు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రి, పాఠశాల, దేవాలయాల్లో చెట్ల పొదలు తొలిగించి చదును చేశారు. ప్రణాళిక పనుల్లో సర్పంచ్‌ నుంచి వార్డు సభ్యులు, ప్రణాలిక కమిటీ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు ఉత్సాహంగా పాల్గొంటు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు.

పలు కుటుంబాలు ఉపాధి నిమిత్తం హైదరాబాద్, కరీంనగర్‌ తదితర ప్రాంతాల్లో స్థిరపడటం వలన పాత ఇల్లు, వాటిలోని పిచ్చి మొక్కలను తొలిగించడంలో కొంత జాప్యం జరుగుతుంది. 26 శిథిలమైన ఇళ్లను గుర్తించగా 12 ఇళ్లను తొలిగించామని మిగితా ఇళ్ల యజమానులకు నోటీసులు జారీ చేశామని సర్పంచ్‌ నర్సింగారావు తెలిపారు. త్వరలోనే వాటిని తొలిగిస్తామన్నారు. లూజ్‌ విద్యుత్‌ లైన్లతో పాటు 150 విద్యుత్‌ సమస్యలు పరిష్కరించారు.  రోడ్డు బీటీ డబుల్‌ రోడ్డు మంజూరి కావడంతో ఆప నులను సైతం పూర్తి చేసి గ్రామానికి రవాణ సౌకర్యం మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న రెండు బోర్లను మూసివేశారు. దీంతో తోటపల్లి గ్రామం అద్దంలా తయారు అవుతుందని, ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. 

అభివృద్ధిలో దూసుకెళ్తున్న ‘పోతారం
మెదక్‌ పార్లమెంట్‌ సభ్యులు  కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామం పోతారం. అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లుతుంది. ఎంపీ స్వగ్రామం కావడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి నెలకొని ఉన్న సమస్యలను ప్రణాళికలో చకచక చేస్తున్నారు.  కూలిపోయె దశకు చేరుకున్న ఎనిమిది ఇళ్లను పూర్తిగా కూల్చి వేశారు. ప్రమాదకరంగా ఉన్న రెండు పాత బావులను పూడ్చి వేశారు. హరితహారంలో నాటిన మొక్కలకు తెలుపు, నలుపు రంగులు వేశారు. గ్రామంలో కొన్ని విద్యుత్‌ వైర్లు వదులుగా ఉండడంతో వాటికి 20 స్తంభాలు పాతడానికి గుంతలు తీశారు.  గ్రామంలో నుంచి గొర్రెలు, మేకలు వెళ్లకుండా వాటి కోసం ప్రత్యేకించి గ్రామ చివర్లో గొర్రెల షెడ్లను ఏర్పాటు చేయడానికి గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. ప్రస్తుతానికి గ్రామం క్లీన్‌ అండ్‌ గ్రీన్‌లా కనిపిస్తుంది.

భళా.. గండిపల్లి 
హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ దత్తత గ్రామమైన అక్కన్నపేట మండలం గండిపెల్లి. గ్రామంలోని రహదారులను శుభ్రపరుస్తూ చెత్తను తరలించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గ్రామంలోని ప్రధాన రహదారులు కొంత వరకు సీసీ రోడ్లు ఉన్నప్పటికి గల్లీల్లో నేటికీ మట్టి రోడ్లు దర్శనమిస్తున్నాయి. ఇంకను మురికి కాలువల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది.    గ్రామంలో ఉన్న 13  పాడుబడ్డ ఇళ్లను కూల్చివేయగా, ఎస్సీ కాలనీలో మరికొన్ని పాత ఇళ్లను తొలగించాల్సి ఉంది. ముదిరాజ్‌ కమ్యూనిటీ హాల్, యాదవ కమ్యూనిటీ భవనం, గ్రామ పంచాయతీ నూతన భవనం, కొత్తగా మహిళా భవనం.

పాత మహిళ భవన నిర్మాణ మరమ్మతులకు కలిపి దాదాపు రూ.35లక్షలు  మంజూరయ్యాయి. అలాగే ఓపెన్‌ జిమ్, కూరగాయల మార్కెట్, అంగడి స్థలాలను చదును చేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఉపాధి హామీ పథకం కింద శ్మశానవాటిక పనులను కొనసాగిస్తున్నారు. మంచినీటి ట్యాంకులను శుభ్రపరుస్తూ, తాగునీరు కలుషితం కాకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వర్షాలకు గుంతలు ఏర్పడితే మొరంపోసి చదును చేస్తున్నారు. అలాగే విద్యుత్‌ స్తంభాల కొరత మూలంగా లూజ్‌ లైన్లు, స్ట్రీట్‌ లైట్లు పూర్తి స్థాయిలో వేయలేకపోతున్నారు. 

చాలా సంతోషంగా ఉంది..
మా స్వగ్రాం పోతారంలో 30రోజుల కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. గ్రామం మొత్తం శుభ్రంగా తయారు అవుతుందని చెబుతుంటే సంబురంగా ఉంది. గ్రామం శుభ్రంగా ఉంటేనే అందరూ బాగుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. గ్రామం స్వచ్ఛతగా తయారు చేసేందుకు పాల్గొంటున్న అందరికి అభినందనలు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలి.  –కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్‌ ఎంపీ

30 రోజుల ప్రణాళిక భేష్‌..
30 రోజుల ప్రణాళిక భేష్‌....గ్రామాలను అన్ని రంగాల్లో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు గాను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళికతో ఏళ్లుగా జరగని అభివృద్ధి కేవలం రోజుల్లోనే జరగడం సంతోషకరం. నా స్వగ్రామం చిట్టాపూర్‌లో నా చిన్నతనం నుంచి జరగని పనులు ఇప్పుడు  జరిగాయి. – రామలింగారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే

గ్రామ పరిశుభ్రత కీలకం
నా దత్తత గ్రామం గండిపల్లిలో 30 రోజుల ప్రణాళిక పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామస్తులు కలిసికట్టుగా పరిశుభ్రత పనులు చేసుకోవడం అభినందనీయం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించిన ఈపనులతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. ప్రజాప్రతినిదులతోపాటు, యువత కూడా ముందుకు వచ్చి పనులు చేస్తున్నారు. ఇలా వారంలో ఒకరోజు తప్పకుండా చేయాలని చెప్పాను. –సతీశ్‌కుమార్, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement