తమిళనాడులోని తిరుపూర్‌లో అధికారులతో మాట్లాడుతున్న కేటీఆర్
తమిళనాడు పర్యటనలో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌లో పది యూనిట్ల ఏర్పాటుకు తిరుపూర్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (టీఈఏ) సూత్రప్రాయంగా అంగీకరించిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తమిళనాడు పర్యటనలో భాగంగా గురువారం తిరుపూర్, పల్లడం గ్రామాల్లో టెక్స్‌టైల్స్ పరిశ్రమలను సందర్శించారు. వరంగల్‌లో నెలకొల్పనున్న మెగాటెక్స్‌టైల్ పార్క్‌లో పెట్టుబడులు పెట్టాలని టీఈఏ ప్రతినిధులను ఆహ్వానించారు.
దేశంలోనే అత్యుత్తమ ప్రోత్సాహకాల ప్యాకేజీ ఇస్తామని, కార్మికులు, ఇన్వెస్టర్లకు హౌజింగ్, విద్య, ఆరోగ్యంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. వరంగల్ టెక్స్‌టైల్స్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు అక్కడి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపారు. అనంతరం పల్లడం చేనేత పార్కును సందర్శించారు. పల్లడం తరహాలో సిరిసిల్లను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. చేనేత రంగం అభివృద్ధికి పరస్పర సహాయ సహకారం కోసం కోయంబత్తూరులోని పీఎస్‌జీ టెక్స్‌టైల్స్ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.