ఇష్టదైవానికి మొక్కేముందు సంకల్పం చెప్పుకోవడం మనకు తరాలనుంచి వస్తున్న ఆచారం. గత ఆరున్నర దశాబ్దాలుగా ఉనికిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు మరో జన్మ ఎత్తబోతున్న నేపథ్యంలో అలాంటి సంకల్పాన్నే కొత్త అర్థంలో చెప్పుకోవాల్సి ఉంటుంది. 23 జిల్లాలుగా ఉన్న ఈ రాష్ట్రం నుంచి 10 జిల్లాల ప్రాంతం విడిపోయి నేడు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది. ఇక 13 జిల్లాల అవశేషాంధ్ర ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించవలసి ఉంటుంది. ఇదొక చారిత్రక సందర్భం. మెజారిటీ మనోగతం వేరుగా ఉన్నా, భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా... ప్రజల్లో అనేక సందేహాలూ, అభ్యంతరాలూ గూడుకట్టుకుని ఉన్నా, వాటన్నిటినీ తోసిరాజని కేవలం రాజకీయ నిర్ణయంగా రాష్ట్రం రెండు ముక్కలైంది. నాలుగు దశాబ్దాలు పైబడి ఈ గడ్డపై అలుపెరుగని ఉద్యమాలు సాగించి, మహాత్ముడిని సైతం ఒప్పించి దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల నిర్మాణానికి మార్గదర్శకులైనదీ...దాన్ననుసరించి ప్రథమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించుకున్నదీ ఇక్కడి ప్రజలే.
ఇంతటి సుసంపన్నమైన చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక నేపథ్యంగల ప్రాంతం దేశంలో మరొకటి కనబడదు. కానీ, ఒకే ఒక్క రాజకీయ నిర్ణయం ఆ చరిత్రనంతటినీ పూర్వపక్షం చేసింది. కారణాలేమైనా...కారకులెవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో నవ నిర్మాణానికి, సువర్ణాంధ్రగా అభివృద్ధి చెందడానికి నడుంకట్టాల్సి ఉంటుంది. చాలినన్ని మౌలిక సదుపాయాలు, అవసరమైనన్ని వ్యవస్థలు మనకు లేకపోవచ్చు. ప్రారంభ లోటే వేలకోట్ల రూపాయలుండవచ్చు. రాజధాని నిర్మాణం మొదలుకొని అనేకానేక సమస్యలు చుట్టుముట్టడం తప్పకపోవచ్చు. చేరవలసిన గమ్యం సుదీర్ఘమైనదే కావొచ్చు.
అంతమాత్రంచేత ఖేదపడవలసిన అవసరం లేదు. భీతిల్లవలసిన పని అసలే లేదు. భవిష్యత్తు ఎలాగని బెంగటిల్లవలసిన అవసరం లేనే లేదు. మనకు అపారమైన, అపురూపమైన మానవ వనరులున్నాయి. ప్రకృతి మాత అందించిన పుష్కలమైన వనరులు అందుకు అదనం. ఇదిగాక దాదాపు వేయి కిలోమీటర్లమేర తీర ప్రాంతం ఉన్నది. కావలసిందల్లా సంకల్పబలమే. ఈ సంకల్పబలంతో అవరోధాలన్నిటినీ అవలీలగా జయించగలం. ఈ సంకల్పబలంతో ఎన్ని కష్టాలనైనా అధిగమించగలం.
‘సత్యమేవ జయతే’ సూక్తిని శిరోభూషణం చేసుకున్న మీ హృదయ ‘సాక్షి’ ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీ అందరికీ తోడుగా, నీడగా నిలబడుతుందని...తనవంతు సంపూర్ణ సహకారాన్నందిస్తుందని...మీ అడుగులో అడుగై నడుస్తుందని హామీ ఇస్తున్నాం. పోటెత్తే సాగరజలాలను మధిస్తూ, అనునిత్యం మృత్యువుని సవాల్ చేస్తూ ధైర్యమే కవచంగా ముందుకురికే జాలరి మనోసంకల్పంలో...కొండకోనల్లోని దుర్గమారణ్యాల్లో వన్యమృగాలమధ్య స్వేచ్ఛగా తిరుగాడుతూ, దోపిడీ పీడనలను ఎదిరించే గిరిపుత్రుల కంఠస్వరంలో...కష్టాల సాగుబడిలో నిత్యమూ శిథిలమవుతున్నా జనావళికి గుక్కెడు బువ్వ అందించడానికి రాత్రింబగళ్లు శ్రమించే అన్నదాత చెమట బిందువుల్లో ...కుటుంబం కోసం, దాని బంగరు భవితవ్యం కోసం పంటచేలలో, నిర్మాణాల్లో భాగస్వాములవుతున్న అక్కచెల్లెమ్మల, కూలి తల్లుల శ్రమైక జీవన సౌందర్యంలో...‘యంత్రభూతముల’ కోరలు తోముతూ కర్మాగారాల్లో రెక్కలు ముక్కలు చేసుకుని అపార సంపద సృష్టించే కార్మికుల శ్రమలో ‘సాక్షి’ ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షర సత్యమవుతుంది.
మనకు బంగారం పండించే పంట భూములున్నాయి. మన రాష్ట్రానికి అన్నపూర్ణగా ఖ్యాతి తెచ్చిన భూములవి. సాగరజలాల్లో అపారమైన మత్స్యసంపద మాత్రమేకాదు...దాని గర్భంలో దశాబ్దాలైనా తరగని సహజవాయు, చమురు నిక్షేపాలున్నాయి. ఈ నేలలో ఇనుము, రాగి, మాంగనీసు, బాక్సైట్, బెరైటీస్, గ్రానైట్, సున్నపురాయి గనులున్నాయి. ప్రకృతి మాత వరంగా ఇచ్చిన ఇలాంటి సంపదంతటినీ మానవ వనరులతో అనుసంధానిస్తే...పేద, బడుగువర్గాల పిల్లలకు ఉన్నతశ్రేణి చదువులకు అవకాశమిస్తే, మన నిరుద్యోగుల చేతులకు పని కల్పిస్తే, ప్రాణాంతక వ్యాధులు చిత్తగించేలా తగిన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెస్తే...సువర్ణాంధ్రను సాకారం చేసుకోవడం సుసాధ్యమే. కావలసిందల్లా నిజాయితీ, చిత్తశుద్ధి, మొక్కవోని పట్టుదల. ఈ పదమూడు జిల్లాలలోనూ అందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయడానికి ముందుకొచ్చే పాలకులకు ‘సాక్షి’ సైదోడుగా నిలుస్తుంది. ఈ కృషిలో వలపక్షాన్ని ప్రదర్శించినా, ఏమరుపాటు, తొట్రుపాటు, అలసత్వం కానవచ్చినా ప్రజల పక్షాన నిలబడి ‘సాక్షి’ ప్రశ్నిస్తుంది. న్యాయం జరిగేవరకూ పోరాడుతుంది.
ఇది సువర్ణాంధ్ర సంకల్పానికి ‘సాక్షి’ చేస్తున్న సంతకం.
- ఎడిటర్
సువర్ణాంధ్ర సంకల్పానికి సాక్షి సంతకం
Published Mon, Jun 2 2014 3:56 AM | Last Updated on Mon, Jul 29 2019 7:41 PM
Advertisement