కేసీఆర్.. పచ్చి అబద్ధాలకోరు
- ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై బెదిరింపులు
- మరో ఉద్యమానికి నాంది పలకాలి
- గిరిజన రిజర్వేషన్ సాధన పోరు సభలో వక్తలు
హైదరాబాద్: ప్రపంచంలోనే పచ్చి అబద్ధాలకోరు సీఎం కేసీఆర్ అని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. రాష్ట్రం వస్తే దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ మాట తప్పి తానే పీఠాన్ని అధిరోహించాడన్నారు. గిన్నిస్‌బుక్‌లో ‘అబద్ధాలకోరు’ కింద కేసీఆర్ పేరు చేర్చొచ్చన్నారు. నిరంతరం అభద్రతాభావంతో చచ్చి బతుకుతున్న వ్యక్తి కేసీఆర్ అని వారు దుయ్యబట్టారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ‘గిరిజన రిజర్వేషన్ సాధన పోరు సభ’.. అధ్యక్షుడు వెంకటేషన్‌చౌహాన్ అధ్యక్షతన జరిగింది. ఇందులో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రం వచ్చాక మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం వస్తుందని కలలు కన్నామన్నారు. కేవలం ఒక్క ఇంటి వారే ఉద్యోగాలు పొందారని కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిని కాంక్షిస్తూ గొంతెతు త్తున్న వారిని అణగదొక్కితే గల్లంతవ్వక తప్పదని అరు ణోదయ విమలక్క అన్నారు. ప్రభుత్వం ఆగడాలను చూస్తూ ఊరుకుంటే చరిత్ర మనల్ని క్షమించదని, ఐక్యంగా రాష్ట్ర అభివృద్ధికి పోరాడాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ రాచరిక పాలన నడిపిస్తున్నాడు కాబట్టే భయంతో బుల్లెట్‌ఫ్రూప్ బాత్‌రూమ్‌ను కూడా నిర్మించుకున్నాడని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. సమైక్యాంధ్ర పాలనలో వారు ఏనుగులను తింటే.. ఇప్పు డు సీఎం కుటుంబం పీనుగులను తింటుందని మా జీ ఎంపీ రవీంద్రనాయక్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కా రం కోసం ఏపీ వ్యాప్తంగా అలుపు లేకుండా తిరుగుతున్న వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ను మనమంతా ఆదర్శంగా తీసుకోవాలని కళాకారుడు ఏపూరి సోమన్న అన్నారు. మన హక్కుల కోసం ఆ విధం గా పోరాడాలన్నారు. ఓట్‌నీడ్ గ్యారెంటీ అధ్యక్షురాలు సొగ్రా చౌహాన్ తదితరులు ప్రసంగించారు.