జనగాం పాఠశాలలో ముంబయి నుంచి వచ్చిన వారితో మాట్లాడుతున్న ఆర్డీఓ
సంస్థాన్ నారాయణపురం : ముంబయినుంచి కారులో సంస్థాన్ నారాయణపురం మండలానికి వస్తున్న నలుగురు వ్యక్తులను మండల వైద్యాధికారి దీప్తి సూచన మేరకు హైదారాబాద్‌లో కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు. వారికి పరీక్షలు జరపగా ముగ్గురికి కరోనా పాజిటివ్ తేలింది. ఈ ముగ్గురూ మండలంలోని జనగాం గ్రామానికి చెందిన ఒకే కుంటుంబ సభ్యులు. ఈ ఘటన గురువారం జనగాంలో కలకంరేపింది. సంస్థాన్‌నారాయణపురం మండలంలోని కంకణాలగూడెం, జనగాం, గుడిమల్కాపు రం, గుజ్జ గ్రామాలకు చెందిన సుమారు 400 మందికి పైగా ముంబయిలో కేబుల్ వైరింగ్ కూలీలుగా పని చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే 11 మంది కాలినడకన, పాలు, కూరగాయల వాహనాలు మార్చుకుంటూ మండలానికి చేరుకున్నారు. గురువారం కూడా పలువురు కాలినడకన మండలానికి వస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు చౌటుప్పల్ మండలం దామెర వద్ద నలుగురిని, కొయ్యలగూడెం వద్ద ఒక్కరిని, హైదారాబాద్‌లో నలుగురిని గుర్తించారు. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న నలుగురిని కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు తేలింది. మొత్తంగా మండలానికి చెందిన 24 మంది ముంబయి నుంచి వచ్చారు. ముంబయి నుంచివచ్చిన ముగ్గురికి పాజిటివ్ రావడంతో ప్రభుత్వ యంత్రాంగం ఆప్రమత్తమైంది.
పరీక్షల కోసం తరలింపు
జనగాం, కంకణాలగూడెం గ్రామాల్లో ఆర్డీఓ సూరజ్‌కుమార్, ఎంపీపీ గుత్త ఉమాదేవి, జెడ్పీటీసీ వీరమళ్ల భానుమతి, తహసీల్దార్ గిరిధర్, వైద్యాధికారి దీప్తి, ఎస్‌ఐ నాగరాజు పర్యటించారు. ముంబయి నుంచి ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు తదితర అంశాలపై ఆరా తీశారు. జనగాం పాఠశాల, కంకణాలగూడెంలో హోం క్వారంటైన్‌లో ఉన్న తొమ్మిది మందిని వైద్య పరీక్షల నిమిత్తం హైదారాబాద్‌కు తరలించారు. తొమ్మిది మందిని బీబీనగర్‌లో ఎయిమ్స్‌లో క్వారంటైన్‌కు తరలించారు. మరో ఇద్దరు జనగాంలోనే హోం క్వారంటైన్‌లో ఉన్నారు. నలుగురు కింగ్ కోఠి ఆస్పత్రిలో ఉన్నారు. కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించిన వారిలోనే ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
ఓ వ్యక్తి హోం క్వారంటైన్
చండూరు (మర్రిగూడ) : మర్రిగూడ మండలంలోని అంతంపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మహారాష్టకు వలస వెళ్లి బుధవారం గ్రామానికి చేరడంతో గ్రామస్తుల పిర్యాదు మేరకు మండలస్థాయి అధికారులు గురువారం నుంచి హోం క్వారంటైన్‌లో ఉంచినట్లు ఎస్‌ఐ క్రాంతి కుమార్ తెలిపారు. ఈ వ్యక్తి యాదాద్రి జిల్లా జనగాం గ్రామానికి చెందిన కొంతమందితో కలిసి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment