కర్మకాండకు వెళ్తొస్తూ.. కానరాని లోకాలకు
► మునగాల మండలంలో కల్వర్టును ఢీకొట్టిన కారు
► అక్కడికక్కడే ముగ్గురి మృతి..మరో ఇద్దరి పరిస్థితి విషమం
► అతివేగం,నిద్రమత్తే ప్రమాదానికి కారణం మృతులు హైదరాబాద్ వాసులు
మితిమీరిన వేగం.. ఆపై నిద్రమత్తు... కళ్లు మూసి తెరిచేలోపల.. కారు కల్వర్టును ఢీకొట్టింది.. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు యువకులు మృత్యుఒడికి చేరగా, మరో ఇద్దరి ప్రాణాలు గాలిలో ఊగిసలాడుతున్నాయి.. ఇదీ.. శుక్రవారం తెల్లవారుజామున 65వ నంబర్ జాతీయ రహదారిపై మునగాల మండలం మాదవరం గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదం తీరుతెన్ను.
- మునగాల
హైదరాబాద్‌కు చెందిన పది మంది మిత్రులు తమ మిత్రుడి తండ్రి కర్మకాండకు హాజరయ్యేందుకు ఈ నెల 23వ తేదీన రెండు కార్లలో విశా ఖపట్టణం బయలుదేరి వెళ్లారు. 24వ తేదీన కర్మకాండలు పూర్తయ్యాక అదే రోజు రాత్రి మిత్రబృందం స్కొడా ర్యాపిడ్ కారులో ఐదుగురు, ఇన్నోవా వాహనంలో మరో ఐదుగురు హైదరబాద్‌కు తిరుగుపయనమయ్యారు. ఈ రెండు వాహనాలు కృష్ణాజిల్లా చిల్లకల్లు వద్ద టోల్‌గేట్ వరకు కలిసి ప్రయాణించాయి.
కొంపముంచిన నిద్రమత్తు
రెండు రాత్రులుగా మిత్రబృందం ప్రయాణిస్తోంది. ముందుగా వెళ్తున్న స్కోడా ర్యాపిడ్ కారు శుక్రవారం తెల్లవారుజామున సుమారు 5.30గంటల సమయ ంలో మండలంలోని మాధవరం గ్రామశివారులో అతివేగంగా వచ్చి కల్వర్టును ఢీకొట్టి గుంతలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడకు చెందిన బుద్దరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి(18), బంజారహిల్స్‌కు చెందిన షేక్ మొబిన్(19), మాదాపూర్‌కు చెందిన ఆశికంటి మంజునాథ్(17) అక్కడికక్కడే దుర్మర ణం పాలయ్యారు. శ్రీనగర్ కాలనీకి చెం దిన తాటికొండ లక్ష్మారెడ్డి, ఖైరాతాబాద్ ఆనంద్‌నగర్ కాలనీకి చెందిన రమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన అరగంట తర్వాత అటుగా వచ్చి న మాధవరం వాసులు గుర్రం సుధాకర్‌రెడ్డి, చెన్నగాని దుర్గయ్యలు ప్రమాద సంఘటన తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు. కారులో ప్రాణాలతో ఉన్న ఇద్దరిని బయటకు తీశారు. ఈలోగా మునగాల ఎస్‌ఐ రాహుల్‌దేవ్ తన సిబ్బంది తో సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పోలీస్ వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి, మృతదేహాలను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇద్దరి పరిస్థితి విషమం
ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన రమ్య, లక్ష్మారెడ్డిలను తొలుత చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి త రలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఇద్దరిని హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు ఎస్‌ఐ తెలిపారు.
ఎంతకీ రాకపోవడంతో..
ఇన్నోవా కారులో ముందుగా వె ళ్లిన ఐదుగురు మిత్రులు హైదరాబాద్ శివారుకు చేరుకున్న తర్వాత మిగిలిన ఐదుగురు సంబంధించిన కారు ఎంతకూ రాకపోవడంతో మిత్రబృందానికి ఫోన్ చేశారు. ప్రమాదస్థలిలో ఉన్న గ్రామస్తులు ఫోన్ ఎత్తి ప్రమాదం జరిగిన తీరును వివరించడంతో వారు తిరిగి 12గంటలకు కోదాడ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. విగతజీవులుగా మారిన తమ మిత్రుల మృతదేహాలను చూసి బోరున విలపించారు.
మిన్నంటిన రోదనలు
మాధవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు యువకుల కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులతో ఆస్పత్రి కిటకిటలాడింది. తమ పిల్లలు విగతజీవులుగా మారడంతో వారి రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం ముగిసిన అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.