అజయ్ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు, బంధువులు
పెద్దవూర (నాగార్జునసాగర్) : ఐదుగురు స్నేహితులు కలిసి విహారయాత్రకు కారులో బయలుదేరారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా దర్శిలో ఉన్న వారి స్నేహితుని వద్దకు వెళ్లి రాత్రి అక్కడే బస చేశారు. మరుసటి రోజు బాపట్ల బీచ్‌కు వెళ్లి పగలంతా అక్కడ సరదాగా గడిపారు. సాయంత్రం కారులో ఇంటికి తిరుగుపయనమయ్యారు.
మార్గమధ్యలో వీరిని మృత్యువు కబళించింది. నిద్రమత్తులో ఉన్న కారు నడిపే యువకుడు చెట్టుకు బలంగా ఢీకొట్టడంతో అందులో ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పోతునూరు స్టేజీ సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
సరదాగా గడిపి..
నాగర్‌కర్నూల్‌లోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన పొడుగు జయంత్(24), ఖానాపురం అజయ్(22), ముండ్లపాటి సందీప్, మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం బోగారం గ్రామానికి చెందిన తూర్పు సంతోష్‌రెడ్డి(23), హన్వాడ మండలం మునిమోక్షం గ్రామానికి చెందిన గుంటికె రాఘవేందర్‌రెడ్డి స్నేహితులు. వీరంతా వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. ఐదుగురు స్నేహితులు కలిసి ఈ నెల 14వ తేదీన విహారయాత్రకు కారులో బయలుదేరారు.
ముందుగా ప్రకాశం జిల్లా దర్శిలో ఉన్న వారి స్నేహితుని వద్దకు వెళ్లి రాత్రి అక్కడే బస చేశారు. మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల బీచ్‌కు వెళ్లి పగలంతా అక్కడ సరదాగా గడిపి.. సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు పెద్దవూర మండలంలోని నాగార్జునసాగర్– హైదరాబాద్ ప్రధాన రహదారిపై పోతునూరు స్టేజీ సమీపంలో కారు కుడివైపు దూసుకెళ్లి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది.
దీంతో కారు నడుపుతున్న పొడుగు జయంత్, ఖానాపురం అజయ్, తూర్పు సంతోష్‌రెడ్డిలు కారులోనే మృతి చెందగా.. ముండ్లపాటి సందీప్, గుంటికె రాఘవేందర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డున వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించడంతో సాగర్ సీఐ రవీందర్, పెద్దవూర ఎస్‌ఐ రాజు అక్కడికి చేరుకుని గాయపడిన సందీప్, రాఘవేందర్‌రెడ్డిలను నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రికి 108లో తరలించారు.
వీరిలో సందీప్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. మృతులంతా అవివాహితులే. మృతుల్లో పొడుగు జయంత్ పౌల్ట్రీ వ్యాపారం చేస్తుండగా, ఖానాపురం అజయ్ విద్యుత్ శాఖలో ఒప్పంద కార్మికుడిగా, తూర్పు సంతోష్‌రెడ్డి డీజే సౌండ్స్ స్వతహాగా నిర్వహిస్తున్నారు.
సందీప్ హైదరాబాద్‌లోని చైతన్యపురి, కమలానగర్‌లో నివాసం ఉంటూ రాజ్ న్యూస్ ఛానల్‌లో క్రైం రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు సాగర్ సీఐ రవీందర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.
నిద్రమత్తే కారణమా?
పగలంతా బీచ్‌లో ఈతలు కొడుతూ సరదాగా గడిపి అలసిపోయిన వీరంతా రాత్రి స్వగ్రామాలకు తిరుగు ప్రయాణమయ్యారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా ఎడమవైపు నుంచి వెళ్లి కుడివైపు రోడ్డు పక్కన ఉన్న చెట్టును అదే వేగంతో బలంగా ఢీకొట్టింది. రోడ్డు ఎడమ వైపున ఉన్న కారు కుడివైపు వెళ్లి చెట్టును ఢీకొట్టే వరకు కనీసం డ్రైవర్ బ్రేకులను ఉపయోగించిన దాఖలాలు కనిపించలేదు.
కారులో ఉన్న అందరూ నిద్రమత్తులో ఉండడం, ఒక్కసారిగా చెట్టును ఢీకొట్టడంతో కారులో ఉన్న వారంతా కారులోనే చెల్లాచెదురుగా పడిపోయారు. డ్రైవర్ సీట్లో ఉన్న జయంత్ మాత్రం అదే సీట్లో స్టీరింగ్‌పై పడి మృతిచెందాడు.
సీటు బెల్టు పెట్టుకుని ఉంటే..
కారు ముందు సీట్లో కూర్చున్న వ్యక్తులు సీటు బెల్టులు ధరించి ఉంటే ముగ్గురు ప్రాణాలు పోయి ఉండేవి కావని పోలీసులు భావిస్తున్నారు. హోండా కంపెనీకి చెందిన ఆస్సెంట్ కారుకు ఎయిర్ బెలూన్లు సైతం ఉన్నాయి. కానీ ప్రమాద సమయంలో ఎవరూ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో బెలూన్లు తెరుచుకోలేదు. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. లేదంటే ఇంతగా ప్రాణ నష్టం సంభవించేది కాదేమోనని భావిస్తున్నారు. నేరుగా చెట్టును ఢీకొట్టకుండా కొంచెం పక్కకు వెళ్లినా ప్రమాద తీవ్రత తగ్గేది.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీలు
రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని సోమవారం మిర్యాలగూడ, దేవరకొండ డీఎస్పీలు శ్రీనివాసులు, రవికుమార్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణాలను అన్వేషించారు. సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న మూలమలుపు వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. వీరి వెంట నాగార్జునసాగర్, దేవరకొండ సీఐలు రవీందర్, శివరాంరెడ్డి, పెద్దవూర, పీఏపల్లి ఎస్‌ఐలు రాజు, శ్రీనివాస్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment