సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ వ్యాధి మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. తాజాగా ముగ్గురు స్వైన్‌ఫ్లూ రోగులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మృతి చెందారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం లింగరాజపల్లికి చెందిన స్వరూప(46) స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌తో కిమ్స్ ఆసుపత్రి నుంచి రిఫరల్‌పై ఈ నెల 15న గాంధీ ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ గురువారంరాత్రి మృతి చెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన బాబూరావు(50) జ్వరంతో ఈ నెల 5న గాంధీ ఆస్పత్రిలో చేరాడు.
వైద్యపరీక్షల్లో స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. డిజాస్టర్‌వార్డులో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. హన్మకొండకు చెందిన సాజిదా సుల్తానా(48) ఈ నెల 22న గాంధీ ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. వీరు స్వైన్‌ఫ్లూతో పాటు న్యూమోనియా, ఆస్తమా, థైరాయిడ్ వంటి రుగ్మతలతో బాధపడుతున్నారని, మెరుగైన వైద్య సేవలు అందించినా ఫలితం లేకుండా పోయిందని గాంధీ ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో చలిగాలులకు వైరస్ మరింత బలపడే ప్రమాదముందని, దీని బారిన పడకుండా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1750కి పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో 36 మంది మృతి చెందారు. తాజాగా మరో ముగ్గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 39కి చేరింది.
Published Sun, Sep 24 2017 2:34 AM | Last Updated on Sun, Sep 24 2017 2:34 AM
Advertisement
Advertisement