సాక్షి, హైదరాబాద్: నిలోఫర్‌లో జరిగిన క్లినికల్ ట్రయల్స్‌లో ఉల్లంఘనలు జరిగినట్లు త్రిసభ్య కమిటీ తేల్చి చెప్పింది. అయితే అవేవీ పెద్దవి కావని, చిన్నపాటి ఉల్లంఘనలేనని కమిటీ పేర్కొంది. ఈ మేరకు త్రిసభ్య కమిటీ సభ్యులు ప్రభుత్వానికి మంగళవారం నివేదిక అందజేశారు. ఆ నివేదికను అధికార వర్గాలు గోప్యంగా ఉంచుతు న్నాయి. నిలోఫర్‌లో చిన్న పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరిగినట్లు, కొన్ని ఉల్లంఘనలు, అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో సర్కారు కదిలింది. నిలోఫర్‌లో జరిగిన ఔషధ ప్రయోగాల డాక్యుమెంట్లను పరిశీలించి ఒక్క రోజులోనే త్రిసభ్య కమిటీ నివేదిక అందజేసింది. నివేదికలో ఉన్న అంశాలను ఉన్నత స్థాయి వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చిన ఎథిక్స్ కమిటీ, ఆ తర్వాత ఔషధ ప్రయోగాలు ఎలా జరుగుతున్నాయో తరచుగా పర్యవేక్షించలేదని కమిటీ పేర్కొన్నట్లు సమాచారం. వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరిపినప్పుడు ఎథిక్స్ కమిటీ అనుమతి మాత్రమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కూడా తప్పనిసరి.
కానీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే వ్యాక్సిన్లపై క్లినికల్ ట్రయల్స్ జరిపినట్లు కమిటీ గుర్తించింది. క్లినికల్ ట్రయల్స్ సమయంలో వచ్చే శాస్త్రీయమైన, న్యాయపరమైన చిక్కులపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని తేలినట్లు సమాచారం. క్లినికల్ ట్రయల్స్ ఎన్నాళ్లు నిర్వహిస్తున్నారన్న దానిపైనా నిర్ధిష్ట కాలపరిమితి పేర్కోలేదని తేలింది. ట్రయల్స్ వివరాలను క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా (సీటీఆర్‌ఐ)లో నమోదు చేయలేదని గుర్తించినట్లు తెలుస్తోంది. చిన్న పిల్లలు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారి నుంచి పూర్తిస్థాయి ఆమోదం తీసుకోలేదన్న చర్చ జరుగుతోంది.
ప్రతిష్ట దెబ్బతినకూడదన్న భావన..
నిలోఫర్ ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్స్ వ్యవహారంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే ఆసుపత్రి ప్రతిష్ట దెబ్బతింటుందని, కాబట్టి క్లినికల్ ట్రయల్స్‌లో ఏవైనా పొరపాట్లు జరిగినా వాటిని భూతద్దంలో చూపకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది. అందుకే మొదట్లో నిలోఫర్ క్లినికల్ ట్రయల్స్‌పై అనేక అనుమానాలు వ్యక్తం చేసిన కొందరు వైద్యాధికారులు ఇప్పుడు చాలా మెతకగా వ్యవహరిస్తున్నారు.
పరస్పరం కొందరు డాక్టర్ల మధ్య వివాదంతో వెలుగులోకి వచ్చిన ఈ విషయం.. ఇప్పుడు ఆయా వర్గాల మధ్య రాజీ తీసుకురావడం ద్వారా క్లినికల్ ట్రయల్స్‌లోని లోపాలను దాచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు విమర్శలొస్తున్నాయి. దీంతో ప్రభుత్వాన్ని వైద్యాధికారులు కొందరు పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.
కొద్దిపాటి ఉల్లంఘనలు వాస్తవం: ఈటల
నిలోఫర్ క్లినికల్ ట్రయల్స్‌లో కొద్దిపాటి ఉల్లంఘనలు జరిగిన మాట వాస్తవమేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అంగీకరించారు. ఈ మేరకు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
కట్టుదిట్టమైన చర్యలు: డీఎంఈ
నిలోఫర్ సంఘటన నేపథ్యంలో క్లినికల్ ట్రయల్స్‌పై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి వెల్లడించారు. ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఎథిక్స్ కమిటీలకు ట్రయల్స్‌పై దిశానిర్దేశం చేశామన్నారు. వారం రోజుల్లోగా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ట్రయల్స్ జరుగుతున్నాయో సమగ్ర సమాచారం కావాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎక్కడ అక్రమంగా క్లినికల్ ట్రయల్స్ చేపట్టినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. నిలోఫర్‌లో ట్రయల్స్‌పై త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి పంపామన్నారు. వివరాలు వెల్లడించడానికి ఆయన అంగీకరించలేదు.
Comments
Please login to add a commentAdd a comment