‘డీపీసీ’లో బడంగ్‌పేట నుంచి ముగ్గురు | three members are in dpc race | Sakshi
Sakshi News home page

‘డీపీసీ’లో బడంగ్‌పేట నుంచి ముగ్గురు

Published Thu, Dec 18 2014 11:56 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

three members are in dpc race

సరూర్‌నగర్: రంగారెడ్డి జిల్లా ప్రణాళికా సంఘం (డీపీసీ)లో బడంగ్‌పేట నగర పంచాయితీ నుంచి ముగ్గురు వార్డు కౌన్సిలర్లకు సభ్యులుగా అవకాశం దక్కింది. కాంగ్రెస్ పార్టీ నుంచి జనరల్ స్థానంలో నామినేషన్ వేసిన 3వ వార్డు కౌన్సిలర్ పెద్దబావి శ్రీనివాస్‌రెడ్డి (బడంగ్‌పేట) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అలాగే 13వ వార్డు కౌన్సిలర్ యాతం శ్రీశైలం యాదవ్ (నాదర్‌గుల్) కూడా కాంగ్రెస్ పార్టీ తరుఫున బీసీ కోటా కింద బరిలో ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో ఓటింగ్‌ను ఎదుర్కొన్నారు. మొత్తం 119 ఓట్లకు గాను 101 ఓట్లు పోలయ్యాయి. అందులో శ్రీశైలం యాదవ్‌కు 85 ఓట్లు రావడంతో సభ్యుడిగా ఎన్నికైనట్లు సీఈవో ప్రకటించారు. ఇక అధికార పార్టీ టీఆర్‌ఎస్ నుంచి జనరల్‌లో  పోటీ చేసిన 15వ వార్డు కౌన్సిలర్ ఈరెంకి వేణుగౌడ్ (మామిడిపల్లి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  

చక్రం తిప్పిన మాజీ హోంమంత్రి సబిత..
కాంగ్రెస్ పార్టీనుంచి పోటీలో ఉన్న 3,13 వార్డుల సభ్యులు పెద్దబావి శ్రీనివాస్‌రెడ్డి, యాతం శ్రీశైలం యాదవ్‌లను జిల్లా ప్రణాళికా సంఘం సభ్యులుగా గెలిపించుకునేందుకు మాజీ హోంమంత్రి సబిత ఇంద్రారెడ్డి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. పెద్దబావి శ్రీనివాస్‌రెడ్డిని ఏకగ్రీవం చేయడంతోపాటుయాతం శ్రీశైలం యాదవ్ పోటీలో ఉన్నప్పటి కీ ఇతర పార్టీల నాయకులతో మాట్లాడి ఒప్పించి గెలిపించడం విశేషం. గెలుపునకు సహకరించిన మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్,జడ్పీ  ఫ్లోర్ లీడర్ జంగారెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
 
దీంతోపాటు పార్టీలకతీతంగా ఎన్నికకు సహకరించిన బడంగ్‌పేట నగర పంచాయితీ 20 వార్డుల కౌన్సిలర్లకు పెద్దబావి శ్రీనివాస్‌రెడ్డి, యాతం శ్రీశైలంయాదవ్‌లు కృతజ్ఞతలు తెలిపారు. నిన్న మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా అనందం వచ్చేసింది. మాజీ హోంమంత్రి తిరిగి సరూర్‌నగర్, బడంగ్‌పేట నగర పంచాయితీ పై దృష్టిపెట్టి తన వాళ్లకు మద్దతుపలికి గెలిపించుకోవడం పట్ల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  
 
హర్షం వ్యక్తం చేసిన చైర్మన్, వైస్ చైర్మన్
బడంగ్‌పేట నగర పంచాయితీ కౌన్సిల్ నుంచి ఒకేసారి ముగ్గురు కౌన్సిలర్లకు జిల్లా ప్రణాళికా సంఘంలో సభ్యులుగా చోటు దక్కడంపై చైర్మన్ సామ నర్సింహగౌడ్, వైస్ చైర్మన్ చిగురింత నర్సింహారెడ్డి గురువారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర ్భంగా వారు  మాట్లాడుతూ.. నగర పంచాయితీలో ప్రధానంగా ఉన్న సమస్యలతో పాటు అభివృద్ధికి, అమలుకు నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్న సమస్యలను జిల్లా ప్రణాళికా సంఘం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యో విధంగా కృషిచేయాలని కొత్తగా ఎన్నికైన ప్రణాళికా సంఘం సభ్యులను వారు కోరారు. దీంతోపాటు కొత్తగా ఏర్పడిన బడంగ్‌పేట నగర పంచాయితీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకురావాలని వారిని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement