శోకసంద్రంగా రాయగూడెం
రాయగూడెం (నేలకొండపల్లి): నల్లగొండ జిల్లా మునగాల మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయగూడెం గ్రామస్తులు ముగ్గురు మృతిచెందారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. రాయగూడెం నుంచి మెదక్ జిల్లా సిద్ధిపేటకు పెంకులతో వెళుతున్న లారీ నల్లగొండ జిల్లా మునగాల మండలంలోని ముకుందాపురం గ్రామం వద్ద మంగళవారం అర్థరాత్రి దాటాక బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో రాయగూడెం గ్రామస్తులు డి.కుమారి(45), ఆకం శ్రీను(35), తొట కొండలు(35) మృతిచెందారు. లింగం అప్పారావు, వడ్డెబొయిన గురవయ్య, లారీ డ్రైవర్ షేక్ వలీ, క్లీనర్ ఈసూబ్ (నల్గొండ హుజూర్‌నగర్ నివాసి) తీవ్రంగా గాయపడ్డారు.
రాలేనని చెప్పినా..
‘జ్వరంతో ఉన్నాను. రాలేను’ అని, తన భర్త ఆకం శ్రీను చెప్పినప్పటికీ డ్రైవర్ బలవంతం చేయడంతో వెళ్లాడని శ్రీను భార్య రోదించింది. నిరుపేద కూలీ అయిన శ్రీనుకు భార్య నాగమణి, ఇద్దరు పిల్లలు చైతన్య(7), రోహిత్(9) ఉన్నారు. ‘‘నాన్న ఎక్కడమ్మా’’ అంటూ, అడుగుతున్న ఆ పిల్లలన తల్లి హత్తుకుని గుండెలవిసేలా రోదిస్తోంది.
పిల్లలు జాగ్రత్తని చెప్పి...
‘పిల్లలు జాగ్రత్త. వచ్చేసరికి ఆలస్యం కావచ్చు’ అని చెప్పి, కానరాని లోకాలకు వెళ్లాడని తొట కొండలు భార్య మల్లికాంబ గుండె పగిలేలా రోదించి సృహ కోల్పోయింది. కొండలుది నిరుపేద కుటుంబం. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురుకు వివాహమైంది.
వ్యాపారంలో అనుభవనం కోసమని...
గ్రామంలో చిన్న దుకాణం నడుపుతున్న కుమారి... మొట్టమెదటిసారిగా పెంకుల వ్యాపారంలోకి దిగింది. ఇటీవల చుట్టుపక్కల గ్రామాలలో పాతపెంకులు కొని సిద్ధిపేటలో విక్రయిస్తోంది. ఒక్కసారి సిద్ధిపేటకు స్వయంగా వెళ్లాల నుకుని మంగళవారం బయల్దేరి, ప్రపమాదంలో ప్రాణా లు కోల్పోయింది. ఆమె తన మనుమరాలు తేజస్వి(కూతురు బిడ్డ)ను పెంచుకుంటోంది.
కుమారి మృతదేహం వద్ద ఆ చిన్నారి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. వైఎస్‌ఆర్ సీపీలో ఆమె క్రియాశీలకంగా పనిచేస్తుండేది. ఆమె మృతదేహాన్ని పార్టీ మండల అధ్యక్షుడు కొర్లకుంట్ల నాగేశ్వరరావు, ఎంపీటీసీ సూరేపల్లి రామారావు, నాయకులు పతానపు నాగయ్య, బి.రేణుకరావు సందర్శిం చి, పార్టీ పతాకాన్ని కప్పారు. ఆమెకు కుమారుడు లేకపోవడంతో కూతురు అనసూయ అంత్యక్రియలు నిర్వహించింది.