
తరగతులు 8.. టీచర్లు ముగ్గురే!
ప్రభుత్వ పాఠశాలలను ప్రై వేట్‌కు దీటుగా నడుపుతున్నట్లు మంత్రులు, అధికారులు చెబుతున్న మాటలు ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ఉపాధ్యాయులు కావాలని విద్యార్థులు, గ్రామస్తులు ఆందోళన చేసినా అధికారులలో స్పందన లేదు.
- రెండేళ్లుగా ధర్నాలు, తరగతులు బహిష్కరించినా ఫలితం శూన్యం
- జిల్లా అధికారులకు, సీఎం పేషీకి ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం
- ఇదీ రాంపూర్ ప్రాథమికోన్నత పాఠశాల దుస్థితి
అల్లాదుర్గం: ప్రభుత్వ పాఠశాలలను ప్రై వేట్‌కు దీటుగా నడుపుతున్నట్లు మంత్రులు, అధికారులు చెబుతున్న మాటలు ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ఉపాధ్యాయులు కావాలని విద్యార్థులు, గ్రామస్తులు ఆందోళన చేసినా అధికారులలో స్పందన లేదు. రాంపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎనిమిది తరగతులకు ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. ఒక్కో తరగతిలో మూడు తరగతులను నిర్వహిస్తుండడంతో విద్యార్థులు పాఠాలు అర్థం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయుల కొరత తీర్చకపోగా విద్యావలంటర్లనైనా నియమించడం లేదు.
రాంపూర్ పాఠశాలలోని ఎనిమిది తరగతుల్లో 137 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి కేవలం ముగ్గురు టీచర్లే పాఠాలు చెబుతున్నారు. నాలుగేళ్లుగా ఇక్కడ 8 తరగతి కొనసాగుతోంది. ఉపాధ్యాయులను నియమించాలని అధికారులకు ఎన్నోమార్లు మొర పెట్టుకుని ఆందోళనలు చేపట్టినా స్పందన లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6, 7 తరగతులను ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు చెబితే విద్యార్థులకు ఏం అర్థమవుతుందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం కంప్యూటర్లను సరఫరా చేసినా అవి మూలనపడ్డాయి. ప్రతి మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ వెంకట్‌రెడ్డి పాఠశాలలో టీచర్లు నియమించాలని, లేకుంటే విద్యార్థులను ఎంఈఓ కార్యాలయంలో ఉంచుతామని హెచ్చరించినా అధికారుల్లో స్పందన లేదు.
వారం రోజుల్లో స్పందించకుంటే...
రాంపూర్ పాఠశాలపై అధికారులు వారం రోజుల్లో స్పందించకుంటే ఆందోళనలు తీవ్రం చేస్తాం. పాఠశాలకు తాళం వేసి ఎంఈఓ కార్యాలయం వద్దనే విద్యార్థులను కూర్చోబెడతాం. పాఠశాల సమస్యపై సీఎం పేషీకి సోమవారం ఫోన్ చేసి సమాచారం ఇచ్చాం. అయినా స్పందన లేదు.
- వెంకట్‌రాంరెడ్డి, సర్పంచ్ రాంపూర్
ఇద్దరు వలంటీర్లను నియమించాలి
ఎనిమిది తరగతులకు ముగ్గురే టీచర్లు ఉన్నారు. ఇద్దరు వలంటీర్లను ప్రభుత్వం నియమిస్తే, ఒక వలంటీర్‌ను మేం నియమించుకుంటాం. అధికారులు స్పందించి చర్యలు తీసుకుని రాంపూర్ పాఠశాలను కాపాడాలి.
-గోపాల్, విద్యా కమిటీ చైర్మన్
పాఠాలు అర్థం కావడం లేదు
ఒకే గదిలో రెండు తరగతులు నిర్వహించడంతో ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలు అర్థం కావడం లేదు. కింది తరగతులకు అప్పుడప్పుడు విద్యార్థులే పాఠాలు చెప్పాల్సి వస్తోంది. ఉపాధ్యాయుల కొరతను తీర్చాలి.
- మోహన్, విద్యార్థి.