సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండోదశ ప్రాజెక్టు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. తొలుత అనుకున్న మార్గాల్లో కాకుండా తాజాగా బీహెచ్‌ఈఎల్–లక్డీకాపూల్ (25 కి.మీ.), రాయదుర్గం– శంషాబాద్ (30 కి.మీ.), ఎల్బీనగర్–నాగోల్ (5 కి.మీ.) మార్గాల్లో మొత్తంగా 60 కి.మీ. మెట్రో రెండోదశ మెట్రో ప్రాజెక్టు ఏర్పాటుపై వేగంగా కసరత్తు జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) త్వరలో సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రెండోదశ ప్రాజెక్టుకు సుమారు రూ.10 వేల కోట్ల వ్యయం కానుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ మార్గాల్లో చేపట్టనున్న డిపోలు, స్టేషన్లు, పార్కింగ్ సదుపాయాల కల్పనకు అవసరమైన స్థలాలను ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. మెట్రో రెండో దశలో ప్రధానంగా శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని పెంచాలని నిర్ణయించిన విషయం విదితమే.
బీహెచ్‌ఈఎల్–లక్డీకాపూల్ మెట్రో రూట్ ఇలా..
ఈ కారిడార్ పరిధిలో సుమారు 70 ఎకరాల స్థలాన్ని బీహెచ్‌ఈఎల్ (రామచంద్రాపురం)లో మెట్రో డిపోకు కేటాయించనున్నట్లు తెలిసింది. ఈ కారిడార్‌లో 22 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గాన్ని బీహెచ్ ఈఎల్, మదీనాగూడా, హఫీజ్‌పేట్, కొండాపూర్, కొత్తగూడా జంక్షన్, షేక్‌పేట్, రేతిబౌలి, మెహిదీపట్నం, లక్డీకాపూల్‌లలో మెట్రో స్టేషన్లు
ఏర్పాటు కానున్నాయి.
రాయదుర్గం–శంషాబాద్ మెట్రో రూట్ ఇలా..
రాయదుర్గం, బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడా, తెలంగాణ పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్ మీదుగా శంషాబాద్ వరకు ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గంలో బుద్వేల్ లేదా శంషాబాద్ ప్రాంతాల్లో 60 ఎకరాల స్థలాన్ని మెట్రో డిపో ఏర్పాటు కోసం కేటాయించనున్నారు. ఈ మార్గంలో హైస్పీడ్ రైలును నడపనున్నట్లు సమాచారం. దీంతో విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు సమయం ఆదా కానుంది. ఈ మేరకు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు రెండోదశ మార్గాల్లో విస్తృతంగా అధ్యయనం జరిపి ఈ రూట్లను ఖరారు చేసినట్లు తెలిసింది. కాగా సుమారు రూ.10 వేల కోట్ల అంచనా వ్యయం కానున్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఈపీసీ (ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్) విధానంలో చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.
డీఎంఆర్‌సీ సమర్పించనున్న సమగ్ర ప్రాజెక్టు నివేదికలో తేలనున్న అంశాలివే...
- రెండోదశ మెట్రో రైళ్లకు సిగ్నలింగ్ వ్యవస్థ, కోచ్‌ల ఎంపిక, ట్రాక్‌ల నిర్మాణం ఎలా ఉండాలో ఈ సంస్థ సూచించనుంది.
- భద్రతా పరమైన చర్యలు.. టికెట్ ధరల నిర్ణయం
- రెండోదశ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ
- వివిధ రకాల ఆర్థిక నమూనాల పరిశీలన
- ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన గడువు, దశలవారీగా చేపట్టాల్సిన షెడ్యూలు ఖరారు
ఈనెలాఖరులో హైటెక్ సిటీకి మెట్రో రైళ్లు..
అమీర్‌పేట్–హైటెక్ సిటీ (13 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్లు ఈనెలాఖరున సిటిజన్లకు అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్గంలో ఇప్పటికే మెట్రో రైళ్లకు ప్రయోగ పరీక్షలను నిర్మాణ సంస్థ విజయవంతంగా పూర్తిచేసింది. ఇక జేబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో వచ్చే ఏడాది మార్చిలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగించ నున్నాయి. ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో మెట్రో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందా..? పాతనగరానికి మెట్రో రైళ్లు ఎప్పుడు రాకపోకలు సాగిస్తాయన్న అంశం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఈ మార్గాల్లో మెట్రో లేనట్టేనా..?
ప్రస్తుతం రెండోదశ ప్రాజెక్టుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభిం చినప్పటికీ గతంలో మరో ఐదు మార్గాల్లో రెండో దశ మెట్రో ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ ఆ దిశగా అడుగులు పడకపోవడంతో ఈ మార్గాల్లో మెట్రో అనుమా నమే అన్న సందేహాలు వ్యక్తమవుతుండటం గమనార్హం.
1.ఎల్బీనగర్–హయత్‌నగర్
2.ఎల్బీనగర్–ఫలక్‌నుమా–శంషాబాద్ ఎయిర్‌పోర్టు
3.మియాపూర్–పటాన్‌చెరు
4.తార్నాక–ఈసీఐఎల్
5.జేబీఎస్–మౌలాలి
Comments
Please login to add a commentAdd a comment