ముమ్మరంగా మెట్రో సర్వే
మార్చికి డీపీఆర్ సిద్ధం చేస్తామంటున్న డీఎంఆర్‌సీ అధికారులు
నగరంలో మొదటి సర్వే పూర్తి
ట్రాఫిక్‌పై సమగ్ర పరిశీలన కొనసాగుతున్న రెండో సర్వే
విజయవాడ : మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. నగరంలో 25 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్) తయారీ బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ) నిర్వహిస్తోంది. ఇందుకోసం నాలుగు సర్వేలు నిర్వహించి సమగ్ర అధ్యయనం తర్వాత డీపీఆర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించనున్నారు. డీపీఆర్ తయారీకి రూ.25కోట్లు మంజూరయ్యాయి.
చకచకా సాగుతున్న పనులు
ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ సలహాదారు శ్రీధరన్ బృందం సెప్టెంబర్ 20 నగరంతోపాటు గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో పర్యటించి మెట్రో రైలు ఏర్పాటుకు రూట్ మ్యాప్‌ను ఖరారు చేశారు. సుమారు రూ.8వేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. దీనిలో 20 శాతం కేంద్ర ప్రభుత్వం, 35 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. మిగిలిన 45 శాతం రుణం మంజూరవుతుంది. డీపీఆర్ పనులను డీఎంఆర్‌సీ నాలుగు భాగాలుగా విభజించి వాటి బాధ్యతలను నాలుగు కన్సల్టెన్సీలకు అప్పగించింది. డీపీఆర్‌కు సంబంధించిన సర్వేను నగరంలోనే కాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టి పెట్టుకుని విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ నిర్వహిస్తున్నారు. మొదటిగా ట్రాఫిక్ సర్వే పూర్తిచేశారు. రెండో విడతగా టోఫోగ్రఫీ సర్వే, మూడో విడతలో జియోటెక్ సర్వే (భూసార పరీక్షలు), నాలుగో విడతలో ఎన్విరాన్‌మెంటల్ సర్వే నిర్వహిస్తారు. ఈ క్రమంలో గత వారం డీఎంఆర్‌సీ మేనేజింగ్ డెరైక్టర్ మంగూ సింగ్ కూడా పర్యటించి డీపీఆర్ పనులను పరిశీలించారు.
ట్రాఫిక్ సర్వే పూర్తి
నగరంలో ట్రాఫిక్ సర్వేను గత వారంలో పూర్తిచేశారు. ప్రస్తుతం ట్రోఫోగ్రఫీ సర్వే పనులు జరుగుతున్నాయి. మొదటి సర్వేలో భాగంగా నగరంలో ట్రాఫిక్ పరిస్థితి, సిగ్నలింగ్ సిస్టం, బందరు, ఏలూరు రోడ్లలో ద్విచక్రవాహనాలు, కార్ల వినియోగంపై, మెట్రో రైలు నిర్మించిన తర్వాత ఆక్యుపెన్సీ శాతంపై పరిశీలన చేశారు. మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మించే ప్రధాన మార్గాల్లో బస్సులు, ఆటోలు, కార్ల రాకపోకలపై సమగ్రంగా సర్వే నిర్వహించారు. సర్వే బృందాలు ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ల వద్ద ఉండి వాహనాల రాకపోకలను పరిశీలించాయి. ప్రస్తుతం టోఫోగ్రఫీలో భాగంగా రోడ్ల విస్తీర్ణం, ప్రధాన మార్గల్లో రోడ్ల స్థితిగతులు, ఇతర అంశాలపై సర్వే కొనసాగుతోంది.
మార్చికి డీపీఆర్ సిద్ధం : రంగయ్య
వచ్చే ఏడాది మార్చికి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పూర్తిగా సిద్ధమవుతుందని ప్రాజెక్ట్ డెప్యూటీ డెరైక్టర్ సీహెచ్ రంగయ్య ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం రెండో సర్వే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మిగిలిన రెండు సర్వేలను కూడా త్వరగా పూర్తిచేసి, మార్చి నెలాఖరులోపు డీపీఆర్ రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామని వివరించారు.