
కాళేశ్వరం రాజగోపురంపై పిడుగు
పాక్షికంగా దెబ్బతిన్న శిఖర భాగం
కాళేశ్వరం(మంథని): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రిలింగ క్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ రాజగోపురంపై మంగళవారం పిడుగు పడింది. దీంతో ప్రధాన గోపుర శిఖరం రెండు వైపులా పాక్షికంగా ధ్వంసమైంది. మంగళవారం సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో పిడుగు పడడంతో గోపురం రెండు వైపులా సింహం విగ్రహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గోపురం కింది భాగంలోని ఒక గదిలో ఉన్న ఆలయ విద్యుత్ మీటర్‌తో పాటు బోర్ మోటార్ స్టార్టర్ బోర్డులు కాలిపోయాయి. భక్తులు దగ్గరగా లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
పెద్ద శబ్దంతో పిడుగు పడడంతో భక్తులు పరుగులు తీశారు. ఆలయ రాజగోపురం, ప్రధాన ఆలయానికి అమర్చిన సీసీ కెమెరాలు సైతం కాలిపోయినట్లు ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. ప్రధాన రాజగోపురంపై పిడుగు పడడంతో భక్తులు అపశృతిగా భావిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు, ఈవో శ్రీనివాస్ ఈ విషయంపై మాట్లాడుతూ జరగబోయే అనర్థాన్ని పిడుగు రూపంలో దేవుడే తప్పించాడని పేర్కొన్నారు. ఆలయంలో సంప్రోక్షణ పూజా కార్యక్రమాలు నిర్వహించాక పునఃనిర్మాణ పనులు చేపడుతామని వివరించారు.