సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో మంచిర్యాల జిల్లాలో వన్యప్రాణులు పిట్టల్లా రాలిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకే రైతులు విద్యుత్ తీగలు అమరుస్తున్నారని ఇప్పటి వరకు అటవీ అధికారులు చెప్పిన మాటలన్నీ అబద్దాలేనని స్పష్టమవుతోంది. వన్యప్రాణులను వధించాలనే లక్ష్యంతోనే వేటగాళ్లు అడవుల్లో విద్యుత్ తీగలను అమర్చి అరుదైన జంతు జాతిని అంతమొందిస్తున్నారని తెలుస్తోంది.
శివ్వారంలో గత నెలలో విద్యుత్ తీగలకు తగిలి మృత్యువాత పడ్డ పులికి సంబంధించి రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ చొరవతో జరిపిన దర్యాప్తులో వాస్తవాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. వన్యప్రాణులతోపాటు పులి, చిరుత వంటి అరుదైన జంతు జాలాన్ని కూడా ఉద్దేశపూర్వకంగానే చంపి, వాటి చర్మాన్ని, గోళ్లను విక్రయించాలనే దుర్బుద్ధితో వేటగాళ్లు విద్యుత్ కంచెలు అమరుస్తున్నారని తేలింది.
బుధవారం మంచిర్యాలలో మీడియా సమావేశంలో కమిషనర్ వి.సత్యనారాయణ రామగుండం కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న వన్యప్రాణుల వధ, అందుకు సహకరిస్తున్న యానిమల్ ట్రాకర్స్, పులి చర్మం పట్టివేత ముసుగులో చంద్రాపూర్ గ్యాంగ్ చేస్తున్న అకృత్యాలను పూసగుచ్చినట్లు వివరించారు. సిబ్బంది లేరనే ఏకైక కారణంతో అటవీశాఖలోని పైస్థాయి నుంచి బీట్ అధికారుల వరకు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్లనే చెన్నూరు, బెల్లంపల్లి, జన్నారం, కాగజ్‌నగర్, మంచిర్యాల డివిజన్‌లలో వన్యప్రాణులతో పాటు అరుదైన పులులు, చిరుతలు కూడా వేటగాళ్ల బారిన పడుతున్నట్లు స్పష్టమైంది.
శివ్వారంలో పులి హతమైనా?
కడెం అటవీ ప్రాంతంలో డిసెంబర్ 15న రాయల్ బెంగాల్ టైగర్ జాతికి చెందిన మగ పెద్దపులి సీసీ కెమెరాలకు చిక్కింది. అక్కడి నుంచి 17న కవ్వాల్ అభయారణ్యంలోకి ప్రవేశించి ఓ మేకను చంపి తిన్న ఆనవాళ్లు కనిపించాయి. అటు నుంచి తిర్యాణి మీదుగా డిసెంబర్ 23న ఆసిఫాబాద్ అల్లినగర్ బీట్ ఏరియాలో పులి సంచరించినట్లు పగ్ మార్క్స్ (పంజా అడుగులు) కనిపించాయి. 30వ తేదీన బెల్లంపల్లి రేంజ్ రొట్టెపల్లి ఏరియాలో, జనవరి 6న చెన్నూరు డివిజన్‌లోని పౌనూరు, శివ్వారం గ్రామాల శివార్లలో పులి అడుగులను గుర్తించారు. ఈ విషయాలను యానిమల్ ట్రాకర్స్ ఎప్పటికప్పుడు బీట్ ఆఫీసర్లకు, రేంజ్ ఆఫీసర్లకు, డీఎఫ్‌ఓలకు తెలియజేస్తూనే ఉన్నారు.
శివ్వారం ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు గ్రామాల్లో దండోరా కూడా వేయించారు. 7వ తేదీ తరువాత పులి జాడ కనిపించలేదు. అలాంటప్పుడు పులి ఏమైందనే విషయంలో కనీసం దృష్టి పెట్టకపోవడం అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. జనవరి 23న పులి చర్మాన్ని పట్టిస్తామని చంద్రాపూర్ గ్యాంగ్ నడుపుతున్న ఎన్‌జీవో సంస్థ టైగర్ హంటింగ్ ఎండ్ అసోసియేషన్ అధ్యక్షుడు నందుకిషోర్ పింప్లే అనే వ్యక్తి మంచిర్యాల ఎఫ్‌డీవో వెంకటేశ్వర్‌రావుకు ఫోన్ చేసినప్పుడు ఆయన గాని, అప్పటి డీఎఫ్‌ఓ రామలింగం కానీ కనిపించకుండా పోయిన పులి గురించి ఆలోచించకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. ఒక వ్యక్తి పులి చర్మం పట్టిస్తానని ఫోన్ చేయగానే కనీసం స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించకుండా మందమర్రి వెళ్లి, పులి చర్మాన్ని మంచిర్యాలకు తీసుకొచ్చి, ఏదో సాధించినట్లు ఘనంగా మీడియా ముందు ప్రదర్శించిన అధికారులు ఆ చర్మం ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే కోణంలో మందమర్రిలోనే ఆలోచించి ఉంటే ఆ రోజే నిందితులు దొరికేవారు.
గతంలో హతమైన పులులు, చిరుతలపై అనుమానాలు
2016లో కోటపల్లి మండలంలో ఓ పులి విద్యుత్ కంచెకు తగిలి మరణించగా, దాన్ని కాల్చి పూడ్చివేశారు. ఈ సంఘటనపై అటవీశాఖ దర్యాప్తు జరిపి, కొందరిని అరెస్టు చేసి, పొలాలను కాపాడుకునేందుకు రైతులు చేసిన ప్రయత్నంగా తేల్చేసింది. ఇటీవల పెంబిలో పులిని హతమార్చి, చర్మాన్ని తరలిస్తుండగా అరెస్టు చేశారు. గత నెలలోనే పాత మంచిర్యాలలో చిరుత వేటగాళ్ల ఉచ్చుకు బలైంది. పై రెండు సంఘటనల్లో తూతూమంత్రంగా దర్యాప్తు సాగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోతుగా దర్యాప్తు చేస్తే ఈ ఘటనలకు సంబంధించి కూడా నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. విద్యుత్ తీగలు తగిలి రామగుండం కమిషనరేట్‌లో 2018లో 9 మంది వ్యక్తులు మృత్యువాత పడగా, వందలాది మూగజీవాలు బలయ్యాయి. 9 మంది మరణానికి కారణమైన వారిపై సెక్షన్ 304పార్ట్–2 కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అలాగే వన్యప్రాణుల మృతికి కారణమైన వారిపై కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది.
వేటగాళ్లతో యానిమల్ ట్రాకర్స్ దోస్తీ
శివ్వారం పులి హత్యకు సంబంధించి అటవీశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులైన ఇద్దరు యానిమల్ ట్రాకర్స్ ఇచ్చిన సమాచారంతోనే వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చి పులిని అంతమొందించారు. వన్యప్రాణులు సంచారాన్ని ఎప్పటికప్పుడు పై అధికారులకు తెలియజేయాల్సిన ట్రాకర్స్ వేటగాళ్లకు సమాచారం ఇస్తూ వారితో కలిసి దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ కంచె ఏర్పాటు చేసి వన్యప్రాణుల మృతికి కారణమవుతున్న వారిని రామగుండం కమిషనరేట్ పరిధిలో 100 మంది వేటగాళ్లను గుర్తించిన పోలీసులు 9 మందిని బైండోవర్ చేశారు. అటవీశాఖ ఇప్పటికైనా కళ్లు తెరిస్తే వన్యప్రాణులు అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంది.
తిప్పేశ్వర్ పులి... శివ్వారంలో బలి అని తేల్చిచెప్పిన ‘సాక్షి’
జనవరి 24న మందమర్రిలో పులి చర్మాన్ని స్వాధీనం చేసుకొని, ఒకడిని అరెస్టు చేసి... మోసపు ఎన్‌జీవోను వదిలేసిన అటవీశాఖ అధికారులు ఈ విషయాన్ని పీసీసీఎఫ్ ఝా కు తెలియజేయడంతో ఆయనకు అనుమానం వచ్చి కేసు వివరాలను డీజీపీకి తెలియజేసి, పోలీసుల సహకారాన్ని కోరారు. 25న నేరుగా పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ నిందితుడు ఇచ్చిన సమాచారం శివ్వారం వచ్చి పరిశీలిస్తే అక్కడే పులి చనిపోయినట్లు తేలింది. అయితే ఆ పులి ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని అప్పటి వరకు అటవీశాఖ గానీ, పోలీసులు గానీ పట్టించుకోలేదు. ఆ మరుసటి రోజు 26న ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘తిప్పేశ్వర్ పులి... శివ్వారంలో బలి’ అనే శీర్షినక కథనం ప్రచురితం కావడంతో అటవీశాఖ, పోలీస్ శాఖ ఆ కోణంలో దర్యాప్తు జరిపాయి. అప్పుడే పులి కదలికలకు సంబంధించిన ఆనవాళ్లు వెలుగు చూశాయి.
అంతకు పది రోజుల ముందే పాత మంచిర్యాల బీట్ పరిధిలో రంగంపేట వద్ద చిరుత పులి వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి బలైంది. ఈ క్రమంలో ‘సాక్షి’ ప్రధాన సంచికలో అంతర్రాష్ట్ర ముఠా పాత్ర, చంద్రాపూర్ గ్యాంగ్ మోసాలను వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో అటవీశాఖ ఈ కేసును పూర్తిగా పోలీసులకు బదిలీ చేయడంతో రామగుండం కమిషనర్ సత్యనారాయణ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అదనపు డీసీపీలు అశోక్‌కుమార్, రవికుమార్‌ల సారథ్యంలో కేసును ఛేదించారు. ‘సాక్షి’ ప్రచురించిన వార్తా కథనాల వల్లనే రాష్ట్ర వ్యాప్తంగా పులి మరణంపై కదలిక వచ్చిందని సాక్షాత్తూ కమిషనర్ సత్యనారాయణ మీడియా సమావేశంలో అన్యోపదేశంగా వెల్లడించారు. సాక్షి ప్రతినిధిని స్వయంగా అభినందించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment