తిరుమలలా కొండగట్టు అభివృద్ధి
► తక్షణమే రూ.5కోట్లు మంజూరు
► 200 గదులతో వసతిగృహం నిర్మాణం
► కొంపల్లె చెరువును రిజర్వాయర్‌గా తీర్చిదిద్దుతాం
► ఆలయ భూముల్లో ఆక్రమణలు తొలగించాలి
► రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్
మల్యాల : కొండగట్టు ఆలయాన్ని తిరుమల తిరుపతి మాదిరిగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆలయ అభివృద్ధికి తక్షణమే రూ.5కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధిపై జేఎన్‌టీయూ కళాశాలలో స్థానిక ఎమ్మెల్యే బొడిగ శోభతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొండగట్టు మాస్టర్ ప్లాన్, భూములకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ భూముల్లో వెలిసిన ఆక్రమణలు తొలగించాలని అధికారులకు సూచించారు. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుదధ్యంపై ప్రత్యేక శ్రద్ధవహించాలని ఆదేశించారు. రానున్న మూడేళ్లలో కొండగట్టు ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రాధాన్యతా క్రమంలో మొదట కాలినడక వచ్చే భక్తుల కోసం మెట్లదారిలో షెడ్డు వేయాలని సూచించారు.
అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భక్తుల కోసం రెండు వందల గదుల వసతిగృహం నిర్మిస్తామన్నారు. మాస్టర్ ప్లాన్‌లో భక్తుల మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకుని రూపొందించాలన్నారు. అలాగే మల్యాల, కొడిమ్యాల మండలాల ప్రజలకు తాగునీరందించడంతోపాటు కొండగట్టుకు నీరందించే కొంపల్లె చెరువును రిజర్వాయర్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. మున్సిపాలిటీ ప్రజలకు దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక జీవో జారీ చేశారని, దీంతో కొంపల్లె చెరువులోకి ఎస్సారెస్పీ నీరు రావడం లేదని ఎమ్మెల్యే బొడిగె శోభ పేర్కొన్నారు. కొంపల్లె చెరువు నింపేందుకు జీవో తీసుకురావాలని కోరగా, జీవోలు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలని, రెండు మండలాల ప్రజలకు నీరందించడంతోపాటు కొండగట్టుకు నీరందించేలా జీఓ జారీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
సమావేశంలో జగిత్యాల సబ్‌కలెక్టర్ శశాంక, ఆలయ ఈఓ అమరేందర్, ఈఈ రాజేశ్, డీఈఈ వసీయోద్దీన్, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, తహశీల్దార్ శ్రీహరిరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్‌మూర్తి, డీఎస్పీ రాజేందర్, సీఐ శ్రీనివాస్‌చౌదరి, ఎస్సై ప్రవీణ్‌కుమార్, వివిధ విభాగాల అధికారులు, సర్పంచ్ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంజన్న సన్నిధిలో మంత్రి పూజలు
కొండగట్టు శ్రీఆంజనేయస్వామి సన్నిధిలో మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మె ల్యే బొడిగె శోభ బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ ఈఓ అమరేందర్ మంత్రి రాజేందర్‌ను శాలువాతో సన్మానించారు. అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం నూతన పుష్కరిణిని పరిశీలించారు.