రైతులను విస్మరిస్తే సంక్షోభమే
• రైతు గర్జనసభలో టీ జేఏసీ చైర్మన్ కోదండరాం
ఖిలా వరంగల్: ప్రజలకు అన్నం పెట్టే రైతాంగాన్ని విస్మరిస్తే తెలంగాణలో సంక్షోభం తప్పదని తెలంగాణ టీ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. తెలంగాణ రైతు జేఏసీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై చర్చించడంతో పాటు వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి ఒత్తిడి తెచ్చేలా బుధవారం రైతుగర్జన సభ ఏర్పాటుచేశారు. వరంగల్‌లో జరిగిన ఈ సభకు రైతు జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటనారాయణ అధ్యక్షత వహించగా, కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణలో ప్రస్తుతం రైతులు గౌరవంగా బతికే అవకాశం లేకుండా పోయి0దని ఆవేదన వ్యక్తం చేశారు. పంట సాగు దశ నుంచి రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, విత్తనాలు, పురుగు మందుల కొనుగోలులో దోపిడీ ప్రముఖ పాత్ర పోషిస్తోందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన రుణమాఫీ హామీ అమలుకాకపోగా.. రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సాకులు చెబుతూ వేధిస్తున్నారన్నారు. తద్వారా రైతులు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని తెలిపారు.
ప్రభుత్వం రైతులను ఆదుకునేలా స్పష్టమైన వ్యవసాయ విధానం ప్రకటించాలని కోదండరాం డిమాండ్ చేశారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ మాట్లాడుతూ రైతులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో రైతు జేఏసీ రాష్ట్ర కోకన్వీనర్ మోర్తాల చందరావు తదితరులు పాల్గొన్నారు.