‘ఆర్టీసీ’ ఎన్నికల్లో టీఎంయూ విజయం
- ఖమ్మం మినహా అన్ని జిల్లాల్లో ఆధిక్యం
- వచ్చే నెల 8న అధికారికంగా ఫలితాల వెల్లడి
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూని యన్ (టీఎంయూ) విజయం సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్‌డిపోలు, రీజియన్‌లు, వర్క్‌షాప్‌లలో మంగళవారం జరిగిన ఈ ఎన్నికల్లో ఆ సంఘం ఆధిక్యత చూపింది. ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) కూటమి ముందంజలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈయూతో కలసి పోటీ చేసి నాటి గుర్తింపు సంఘం ఎన్‌ఎంయూకు టీఎంయూ చెక్‌పెట్టింది. తెలంగాణ ఏర్పాటయ్యాక తాజాగా జరిగిన తొలి ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేసుకుని రాష్ట్రస్థాయిలో గుర్తింపు కార్మిక సంఘంగా నిలుస్తోంది. అయితే ఈనెల 25, 26 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాల్సి ఉన్నందున ఎన్నికల ఫలితాలు వెల్లడించలేదు. ఆగస్టు 8న అధికారిక ంగా వెలువడే ఫలితాలతో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి గుర్తింపు సంఘాలేవో తేలనుంది.
97.7 శాతం పోలింగ్: తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 6 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం వరకు సాగింది. సాయంత్రం 6.30 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. పది యూనియన్లు పోటీ పడ్డ ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన యూనియన్ల మధ్య హోరాహోరీగా పోరు సాగుతుందని తొలుత భావించినా... కార్మికులు టీఎంయూ వైపే మొగ్గు చూపారు. మొత్తం 49,600 మంది ఓటర్లు ఉండగా.. 97.7 శాతం ఓటింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 98.2 శాతం, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 96 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎన్‌ఎంయూ ఘోర ఓటమిని మూటగట్టుకోగా, ఎస్‌డబ్ల్యూఎఫ్‌తో కలసి ఈయూ ఖమ్మం జిల్లాలో పరువు దక్కించుకుంది.