ఎన్నికలపై చర్చించేందుకు 6న ప్రత్యేక సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికల కోలాహలం మొదలైంది. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఎన్నికలపై చర్చించేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ గంగాధర్ జూన్ 6న సమావేశం ఏర్పాటు చేశారు. దానికి హాజరు కావాల్సిందిగా ఆర్టీసీలోని 11 కార్మిక సంఘాలు, ఆర్టీసీ జేఎండీని ఆహ్వానిస్తూ లేఖలు పంపారు. ఈ సమావేశంలో ఎన్నికల తేదీపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉండడంతో అన్ని సంఘాలూ సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటైన తర్వాత ఇవే తొలి ఎన్నికలు కావడంతో అన్ని సంఘాలూ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.
ఆరు నెలలు సమ్మెలు నిషేధం...
ఆర్టీసీలో మరో ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జూన్ ఒకటి నుంచి ఇది అమలులోకి వస్తుంది. వేతన సవరణ బకాయిలతోపాటు ఇతర బకాయిల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ఇటీవలే పలు సంఘాల కూటమి సమ్మె నోటీసు ఇచ్చినా యాజమాన్యం పెద్దగా స్పందించనందున సమ్మెకు సై అంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేయటం గమనార్హం.