- నేడు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 దాకా పోలింగ్
- అనంతరం ఓట్ల లెక్కింపు
కదిరి :
ఆర్‌టీసీలో సీసీఎస్ (క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ) డెలిగేట్స్ స్థానాలకు శుక్రవారం నిర్వహిస్తున్న ఎన్నికలకు సబంధించి గురువారం జిల్లాలోని అన్ని డిపోల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. కడప జోన్ పరిధిలో అనంతపురం, కడప, కర్నూలు రీజియన్లు వస్తాయి. అనంతపురం రీజియన్‌లో 18 స్థానాలకు, కడప 19, కర్నూలు రీజియన్‌లో 17 స్థానాలకు కలిపి మొత్తం 54 సీసీఎస్ డెలిగేట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 దాకా పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ అనంతరం ఫ్రీ బ్యాలెట్ ఓట్లను వాటితో కలిపి లెక్కిస్తారు.
పోలింగ్ కేంద్రలోకి పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు. పోలింగ్ బూత్‌లలోకి సెల్‌ఫోన్లు, పెన్నులు తీసుకెళ్లడం, యూనియన్ బ్యాడ్జీలు ధరించి వెళ్లడాన్ని నిషేధించారు. ఓటు కూడా రహస్య బ్యాలెట్ పద్దతిన వినియోగించుకోవాల్సి ఉంటుంది. పోలీసులు అన్ని డిపోల వద్ద ఇప్పటికే గట్టి బందోబస్త్ చర్యలు చేపట్టారు. పోలింగ్ పూర్తి అయిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించి, రాత్రి 8 గంటలకల్లా అన్ని డిపోల ఫలితాలు వెలువడవచ్చు. ఫలితాల వివరాలను క్రెడిట్ కో ఆపరేటివ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌వీ రాఘవరెడ్డికి ఈ నెల 17న పంపుతారు. ఈ నెల 30న ఎంసీ మెంబర్ల ఎంపిక జరగనుంది.
యూనియన్ల బలపరీక్ష...
రీజియన్‌లోని 13 డిపోల్లో సీసీఎస్ జరిగే ఎన్నికల్లో నాలుగు యూనియన్ల మద్దతుదారులు బరిలో దిగుతున్నారు. గుర్తింపు ఎన్‌ఎంయూతో పాటు వైఎస్సార్ మజ్దూర్ యూనియన్, కార్మిక పరిషత్ తమ బలాన్ని నిరూపించుకోనున్నారు. ఎన్నికల ప్రొసీడింగ్ అధికారిగా ఆయా డిపో మేనేజర్లు, పోలింగ్ బూత్ అధికారులుగా సూపర్‌వైజర్లు వ్యవహరిస్తారని పీఓ ఎస్‌పీ కృష్ణవేణి తెలియజేశారు. డిపోల్లో రెండు బూత్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓ బూత్‌లో డ్రైవర్లు, కండక్టర్లు, మరో బూత్‌లో గ్యారేజ్ సిబ్బంది ఓటును వినియోగించుకుంటారన్నారు. జిల్లాలోని 13 డిపోల్లో 89 మంది గురువారం పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకున్నారు.